అంత్యక్రియలకు వెళ్తుండగా కూలిన విమానం.. ఐదుగురు మృతి..

ABN , First Publish Date - 2020-06-06T15:01:10+05:30 IST

జార్జియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు...

అంత్యక్రియలకు వెళ్తుండగా కూలిన విమానం.. ఐదుగురు మృతి..

ఈటోన్టన్ (అమెరికా): జార్జియాలో ఓ తేలికపాటి విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. ఫ్లోరిడాకు చెందిన వీరంతా ఇండియానాలో తమ బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అట్లాంటాకి ఆగ్నేయంలో 161 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని పుట్నాం కౌంటీ మంత్రి హోవార్డ్ సిల్స్ పేర్కొన్నారు.


మృతి చెందిన వారిలో ఫ్లోరిడాలోని మోరిస్టన్‌కు చెందిన లారీ రే ప్రూయిట్ (67), గెయిన్స్‌విల్లేకి చెందిన షాన్ చార్లెస్ లామోంట్ (41), ఆయన సతీమణి జోడి రే లామోంట్ (43), వారి పిల్లలు జేస్ (6), ఆలిస్ (4) ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదానికి ముందు ఘటనా ప్రాంతం చుట్టూ చక్కర్లు కొట్టిన విమానం.. కొద్ది సేపటికే పొలాల్లో  కూలిపోయి మంటల్లో చిక్కుకున్నట్టు స్థానికులు వెల్లడించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) దర్యాప్తు చేపట్టనున్నాయి. 

Updated Date - 2020-06-06T15:01:10+05:30 IST