విమాన ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ABN , First Publish Date - 2021-03-31T15:26:51+05:30 IST

ఓ పక్షి విమాన ఇంజిన్‌ను ఢీకొట్టడంతో ఫ్లైట్ అత్యావసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని ఉటాలో మంగళవారం చోటు చేసుకుంది.

విమాన ఇంజిన్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ఉటా: ఓ పక్షి విమాన ఇంజిన్‌ను ఢీకొట్టడంతో ఫ్లైట్ అత్యావసరంగా ల్యాండ్ అయిన ఘటన అమెరికాలోని ఉటాలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉటా జాజ్ ఎన్‌బీఏ జట్టు ఆటగాళ్లను తీసుకెళ్తున్న డేల్టా చార్టర్డ్ విమానం బోయింగ్ 757 ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. ఇది గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై సాల్ట్ లేక్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఎన్‌బీఏ జట్టు మంగళవారం టేనస్సీలోని మెంఫిస్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం నాటి గ్రిజ్లీస్‌తో మ్యాచ్ కోసం జాజ్ జట్టు మెంఫిస్ వెళ్తున్నట్లు తెలిసింది. విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ఆటగాళ్లు ట్వీట్ చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డేల్టా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై పలువురు జాజ్ ఆటగాళ్లు తమదైన శైలిలో స్పందించారు. 'దేవుడు మంచోడు' అని రాయిస్ ఓ నీల్ ట్వీట్ చేయగా.. 'ఇది చాలా మంచి రోజు' అని రూడీ గోబెర్ట్ అన్నారు.     



Updated Date - 2021-03-31T15:26:51+05:30 IST