Nepal : 22 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం కాంటాక్ట్‌లో లేదు : అధికారులు

ABN , First Publish Date - 2022-05-29T17:17:08+05:30 IST

నేపాల్‌లోని పోఖారా నుంచి జోమ్‌సోమ్ వెళ్తున్న ఓ విమానం ఆదివారం

Nepal : 22 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం కాంటాక్ట్‌లో లేదు : అధికారులు

న్యూఢిల్లీ : నేపాల్‌లోని పోఖారా నుంచి జోమ్‌సోమ్ వెళ్తున్న ఓ విమానం ఆదివారం ఉదయం కాంటాక్ట్‌లో లేకుండా పోయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. Tara Airకు చెందిన NAET ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు బయల్దేరిందని, కొద్ది సేపటికే రాడార్ పరిధికి దూరమైందని తెలిపారు. ఈ విమానాన్ని గుర్తించేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపించినట్లు పేర్కొన్నారు. 


పైలట్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే ఈ విమానాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ఈ విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపనీయులు కాగా, మిగిలినవారు నేపాలీయులని వివరించారు. 


ముస్టంగ్ జిల్లా ప్రధాన అధికారి నేత్ర ప్రసాద్ శర్మను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం జోమ్‌సోమ్ వద్ద ఆకాశంలో ఎగురుతూ కనిపించింది, ఆ తర్వాత అది ధవళగిరి పర్వతం వైపు వెళ్ళింది. అనంతరం దాని జాడ తెలియకుండాపోయింది. ఈ విమానం జాడను తెలుసుకునేందుకు ముస్టంగ్, పోఖారాల నుంచి రెండు ప్రైవేట్ హెలికాప్టర్లను నేపాల్ హోం మంత్రిత్వ శాఖ పంపించింది. నేపాల్ సైనిక హెలికాప్టర్‌ను కూడా గాలింపు చర్యల కోసం వినియోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


పోఖారా నుంచి జోమ్‌సోమ్ మధ్య దూరం దాదాపు 160 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పర్వత ప్రాంతం కావడం వల్ల రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే సుమారు 6 గంటలు పడుతుంది. విమాన ప్రయాణానికి 25 నిమిషాలు పడుతుంది. 

Updated Date - 2022-05-29T17:17:08+05:30 IST