ప్రియుడితో కలిసి భర్త హత్య.. కట్టుకథ అల్లి అందరినీ నమ్మించి.. చివరికి ఇలా దొరికిపోయింది!

ABN , First Publish Date - 2021-07-19T05:53:04+05:30 IST

ప్రియుడి మోజులో పడి..

ప్రియుడితో కలిసి భర్త హత్య.. కట్టుకథ అల్లి అందరినీ నమ్మించి.. చివరికి ఇలా దొరికిపోయింది!
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ-1 గౌతమీశాలి

ప్రియుడి మోజులో భర్త హత్యకు పథకం

పదో తరగతిలో ఉండగా నిందితుడితో ప్రేమాయణం

భర్త అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్‌

ఈవినింగ్‌ వాక్‌ చేస్తుండగా రాడ్‌తో తలపై మోది పరారైన ప్రియుడు

నిందితులు ఇద్దరు అరెస్ట్‌

ముడివీడిన పీఎంపాలెం హత్యకేసు మిస్టరీ


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ప్రియుడి మోజులో పడి భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. పోలీసుల కళ్లు కప్పేందుకు తన భర్త దుబాయ్‌లో ఉండగా వేరొకరితో ఆర్థిక విభేదాలు తలెత్తాయని, అతనే హత్య చేసి ఉంటాడని కట్టుకథ అల్లింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు అంగీకరించడంతో ఆమెతోపాటు ప్రియుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకి పంపారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను డీసీపీ-1 గౌతమీశాలి వెల్లడించారు.


పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకి చెందిన కోనె సతీశ్‌(32)కు పీఎంపాలెంకు చెందిన పరపతి రమ్యతో 2015లో వివాహం జరిగింది. సతీశ్‌ దుబాయ్‌లోని నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రస్‌ ఆల్‌ఖైమాలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. దీంతో పెళ్లైన వెంటనే భార్య రమ్యను తీసుకుని దుబాయ్‌ వెళ్లిపోయాడు. 2017లో ఒక పాప జన్మించింది. 2018లో ఉద్యోగం పోవడంతో అక్కడే బ్యాంకు లోన్‌లు ఇప్పిస్తూ కమీషన్‌ ఏజెంట్‌గా పనిచేసేవాడు. 2019లో రమ్య రెండో డెలివరీ కోసం ఇండియా వచ్చేసి పీఎంపాలెంలోని తల్లిదండ్రుల వద్ద ఉండేది. 2020 జనవరిలో బాబుకి జన్మనివ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సతీశ్‌ ఇండియా వచ్చేశాడు. మధురవాడ దుర్గానగర్‌లోని జీకేకోజీ అపార్టుమెంట్‌లో ఒక ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు.


ఎప్పటిలాగే ఈ నెల 13న రాత్రి ఏడు గంటల సమయంలో సతీశ్‌, రమ్య తమ ఇద్దరు పిల్లలను తీసుకుని ఎన్‌జీవో కాలనీలో ఈవినింగ్‌ వాక్‌ చేస్తున్నారు. రమ్య తన కుమారుడిని ఎత్తుకుని ముందు నడుస్తుండగా, సతీశ్‌ తన కుమార్తెను వీల్‌చైర్‌లో తోసుకుంటూ వెనుక నడుస్తున్నాడు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు రాడ్‌తో సతీశ్‌ తలపై బలంగా కొట్టి పరారయ్యాడు. సతీశ్‌ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. దీనిపై రమ్య అదేరోజు రాత్రి 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త దుబాయ్‌లో ఉండగానే అక్కడ లేబర్‌ సప్లయర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తితో పరిచయడం ఏర్పడిందని, వారి మధ్య నగదు లావాదేవీల విషయమై విభేదాలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనే హత్య చేయించి ఉండవచ్చునంటూ అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


సతీశ్‌తోపాటు రమ్య ఫోన్‌కాల్‌ లిస్ట్‌ను పోలీసులు తెప్పించుకుని పరిశీలించగా, రమ్య ఫోన్‌లోని ఒక నంబర్‌పై పోలీసులకు అనుమానం కలిగింది. దీని ఆధారంగా పోలీసులు కేసును విచారించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రమ్య పీఎంపాలెం  బాలజీ విద్యానికేతన్‌లో పదో తరగతి వరకూ చదువుకుంది. రమ్య, తన క్లాస్‌మేట్‌ అయిన ఆరిలోవలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన షేక్‌ బాషా ఆలూరు(29) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2012లో విషయం రమ్య ఇంట్లో తెలిసిపోవడంతో 2013లో ఇద్దరూ విడిపోయారు. 2015లో రమ్యకు ఏలూరుకి చెందిన సతీశ్‌తో పెళ్లవడంతో భర్తతో కలిసి దుబాయ్‌ వెళ్లిపోయింది. 2019లో పదో తరగతి స్నేహితులు వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేయడంతో రమ్య, షేక్‌బాషాలు తిరిగి మాట్లాడుకున్నారు. అనంతరం ఇరువురూ తరచూ కలుసుకుంటుండేవారు. గత ఏడాది సతీశ్‌ దుబాయ్‌ నుంచి తిరిగి రావడంతో వీరు కలుసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు.


అందులోభాగంగానే పథకం ప్రకారం ఈవినింగ్‌వాక్‌ సమయంలో అయితే హత్యకు బాగుంటుదని రమ్య చెప్పడంతో ఈ నెల 12న రెక్కీ చేసిన షేక్‌బాషా, 13న రాత్రి ఏడు గంటల సమయంలో రాడ్‌తో సతీశ్‌ తలపై మోది హత్య చేశాడు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ-1 తెలిపారు. కాగా నిందితుడు బాషాకు కూడా ఇదివరకే మరో మహిళతో వివాహమైందన్నారు. ఈ సమావేశంలో నార్త్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ సీహెచ్‌శ్రీనివాసరావు, సీఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-19T05:53:04+05:30 IST