పల్లె, పట్టణ ప్రగతికి ప్రణాళిక

ABN , First Publish Date - 2022-05-29T05:19:57+05:30 IST

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు 526 గ్రామ పంచాయతీల్లో నాలుగో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికను జిల్లా యంత్రాంగం రూపొందిస్తోంది.

పల్లె, పట్టణ ప్రగతికి ప్రణాళిక

- నాలుగో విడత ప్రగతి ప్రణాళికకు కసరత్తు

- జూన్‌ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

- ప్రధానంగా 5 అంశాలపై దృష్టి సారించిన అధికారులు

- జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 526 గ్రామ పంచాయతీలు


కామారెడ్డి, మే 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలతో పాటు 526 గ్రామ పంచాయతీల్లో నాలుగో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికను జిల్లా యంత్రాంగం రూపొందిస్తోంది. జూన్‌ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సారి ప్రధానంగా 5 అంశాలపై దృష్టి సారించాలని నిర్ధేశించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీల్లోని వార్డుల వారిగా, మండలాల్లోని గ్రామపంచాయతీల వారిగా అధికారులను నియమించనున్నారు. కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మున్సిపల్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. దీంతో జిల్లా అధికారులు నాలుగో విడత పట్టణ, పల్లె ప్రగతి పనులను ముమ్మరంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇండోర్‌ పర్యటనకు, క్రీడా ప్రాంగణాలు ప్రణాళికలు

జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెల్లో నాలుగో విడత ప్రగతి ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం పురపాలిక సంఘాల అధ్యక్షులతో పాటు కమిషనర్‌లు, ఇతర అధికారులను ఆదర్శ మున్సిపాలిటీగా పేరుగాంచిన ఇండోర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ప్రగతి పనులను పరిశీలించేందుకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో గ్రామ పంచాయతీల వారిగా క్రీడా ప్రాంగణాలను గుర్తించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 10, ఎల్లారెడ్డిలో 1, బాన్సువాడలో 3 చొపున నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి శుభ్రం చేస్తున్నారు. వార్డు స్థాయి క్రీడా కమిటీలు ఏర్పాటు చేసి వారితో క్రీడల నిర్వహణ చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

పారిశుధ్యం, వైకుంఠ రథాలు, శ్మశానవాటికల నిర్మాణం

పట్టణ ప్రగతిలో ప్రభుత్వం నిర్ధేశించిన ఐదు అంశాలలో పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. వార్డుకో అధికారి ఆధ్వర్యంలో మెరుగుపరచాలని ఆదేశించారు. పాఠశాలలను శుభ్రం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మృతదేహాల తరలింపునకు మున్సిపాలిటీల తరుపున వైకుంఠ రథాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైకుంఠధామాల నిర్మాణాలకు అక్టోబరు నాటికి పూర్తి చేయడంతో పాటు వీటి పరిసరాల్లో మూత్రశాలలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. మిషన్‌భగీరథ నీరు నిత్యం సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

గ్రీన్‌ బడ్జెట్‌ వినియోగం, సమీకృత మార్కెట్‌లు

పట్టణాల్లో ఒకేచోట కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు జరిగేలా సమీకృత మార్కెట్‌ నిర్మాణాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కామారెడ్డి మున్సిపాలిటీలో రూ.4.50 కోట్లతో నిర్మాణం చేపడుతుండగా బాన్సువాడలో రూ.2.50కోట్లతో ప్రారంభించారు. ఎల్లారెడ్డిలోనూ ఏర్పాటు చేస్తున్నారు. స్థల కేటాయింపుతో పాటు ఇతరత్రా సమస్యలు ఉంటే రెవెన్యూ, ఇంజనీరింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం నిర్ధేశించిన నేపథ్యంలో మున్సిపాలిటీల బడ్జెట్‌లను 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు కేటాయిస్తున్నారు. ఆ నిధులను ప్రస్తుతం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పూర్తిగా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరిన్ని బృహత్‌ పట్టణ ప్రకృతి వనాల పెంపునకు అవసరమైన స్థలాలు గుర్తించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధం చేసిన నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను వార్డు అధికారుల ఆధ్వర్యంలో వర్షాలు కురవగానే నాటనున్నారు.

Updated Date - 2022-05-29T05:19:57+05:30 IST