కర్నూలు నగర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2021-03-05T07:04:37+05:30 IST

‘అభివృద్ధి చేయడానికి పది పాయింట్లతో ప్రణాళిక సిద్ధం చేశాం.

కర్నూలు నగర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ కూడలిలో..

  1. వైసీపీని గెలిపిస్తే ఊడిగం చేయాల్సి వస్తుంది
  2. మేం ఎయిర్‌పోర్టు, సోలార్‌ పార్కు తీసుకువచ్చాం
  3. వైసీపీ వచ్చి రెండేళ్లయినా జిల్లాకు ఏం తెచ్చారు?
  4. వక్ఫ్‌ భూముల ఆక్రమణలు.. ఎన్నో అరాచకాలు
  5. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు


కర్నూలు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘అభివృద్ధి చేయడానికి పది పాయింట్లతో ప్రణాళిక సిద్ధం చేశాం. టీడీపీకి ఓట్లేసి గెలిపించండి. వైసీపీని గెలిపిస్తే వారికి ఊడిగం చేయాల్సి వస్తుంది’ అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం నగరంలో రోడ్‌ షో నిర్వహించారు. కింగ్‌ మార్కెట్‌ కూడలి వద్ద ఆయన మాట్లాడుతూ వైసీపీని గెలిపిస్తే ప్రశ్నించే హక్కును ప్రజలు కోల్పోతారని, ఇప్పటికే జగన్‌రెడ్డి ప్రజల మాట వినడం మానేశారని అన్నారు. కార్పొరేషన్‌ను కూడా అధికార పార్టీకి అప్పజెప్పితే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరన్నారు. దేశం అంతటా అంబేద్కర్‌ రాజ్యాంగం అమలవుతుంటే, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. జిల్లాలో పులివెందుల రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో నడిచే రాజ్యాంగం కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని కోరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు గుండ్రేవుల, ఎల్‌ఎల్‌సీ, వేదవతి వంటి సాగునీటి ప్రాజెక్టులను తీసుకువచ్చా మని, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, క్యాన్సర్‌ ఆసుపత్రి, సోలార్‌ ప్రాజెక్టు, మెగా సీడ్‌ పార్కు, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తీసుకువచ్చామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా జిల్లాకు ఇలాంటి ఒక్క గొప్ప ప్రాజెక్టు కూడా తేలేదన్నారు. తాను గోదావరి, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించానని, వైసీపీ హయాంలో తుంగభద్ర పుష్కరాల్లో ఒక్కరైనా స్నానం చేయగలిగారా? అని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడమంటే జిల్లాకు చెందిన పిట్టకథల మంత్రి, బెంజ్‌ కారు మంత్రి, బుల్లెట్‌ మంత్రులు ఏవేవో మాట్లాడుతున్నా రన్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వీరందరినీ బజారులో నిలబెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆర్థిక మంత్రి ఇలాకాలో 32 వార్డులకు 25 వార్డులు ఏకగ్రీవం చేయించుకున్నారని, ఆయన ఏం పీకారని ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులను అభివృద్ధి చేసి చూపించమంటే వక్ఫ్‌ బోర్డు భూములను ఆక్రమించుకోవడం, అరాచకాలు చేయడం, పోలీసులను అడ్డు పెట్టుకుని ఇళ్లలో ఉన్న వారిపై కేసులు బనాయించడం వంటి దుర్మార్గాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలు కార్పొరేషన్‌ బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.  



Updated Date - 2021-03-05T07:04:37+05:30 IST