Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మానవతకూ మహమ్మారి!

twitter-iconwatsapp-iconfb-icon
మానవతకూ మహమ్మారి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విపత్తుకు, కొన్ని విషయాలలో , భూకంపం లేదా తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యంతో సారూప్యమున్నది. హఠాత్తుగా వచ్చి, అనూహ్యంగా ప్రబలిపోయిన ఈ భయంకర అంటు వ్యాధిని చురుగ్గా కట్టడి చేయగల సంసిద్ధతలో రాజ్య వ్యవస్థ, సమాజమూ రెండూ లేవు. సంక్షోభ తీవ్రత అర్థమైన తరువాత మన ప్రతిస్పందన వివేక పూరితంగానూ, మరింత మానవోచితంగానూ వుండాలి. మరి మన ప్రజాస్వామ్య ప్రభుత్వం పేదల పట్ల నిరంకుశ బ్రిటిష్ వలస పాలకుల వలే దయారహితంగా వ్యవహరించింది. మన నవీన నాగరిక సమాజం మధ్యయుగాల ఐరోపా మాదిరిగా మత మైనారిటీలపై విద్వేష వైషమ్యాలను వెళ్ళగక్కింది.


మహమ్మారులు ఇప్పుడూ అప్పుడూ ఎప్పుడైనా భయానక విపత్తులే. క్రీ.శ. 14వ శతాబ్దిలో ఒక ప్లేగు వ్యాధి ఐరోపా, ఆసియాలలో మరణ మృదంగాన్ని మోగించింది. అసంఖ్యాక ప్రజలను బలిగొన్నది. బతికి బయటపడిన వారిని మహాయాతనలకు గురి చేసింది. మరింత విషాదమేమిటంటే ఆ మహమ్మారి మానవ మనస్తత్వంలోని ఆటవికతను పురిగొల్పింది. మానవత మరణించింది. మహమ్మారి నీడలో మనిషి మనుగడ వర్ధిల్లదు; మనిషి మానవత వికసించదు. ప్రముఖ చరిత్రకారుడు సైమన్ షామ ఇటీవల ఇలా రాశారు: ‘ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమాజాలు ఎవరో ఒకరిని లేదా ఏదో ఒక సామాజిక సమూహాన్ని బలిపశువు చేయడానికి తప్పక ప్రయత్నిస్తాయి. యూదులు 


ఈ అనివార్య శిక్షకు ఎప్పుడూ లక్ష్యంగా వుంటున్నారు. 14వ శతాబ్ది ప్లేగు ప్రళయ కాలంలో యూదులు మంచి నీటి బావుల్లో విషం కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు క్రైస్తవుల పట్ల ద్వేషం వల్లే యూరోప్‌లో ప్లేగు మహమ్మారి ప్రబలిపోవడానికి మూల కారకులయ్యారనే అపప్రథకు కూడా యూదులు గురయ్యారు’.

ఆయన ఇంకా ఇలా రాశారు: ‘మధ్యయుగాల ఐరోపాలో యూదులపై క్రైస్తవుల దాడులకు మహమ్మారులు దారి తీసేవి. అయితే మహమ్మారులు విజృంభించిన సందర్భాలలో దుర్భల మైనారిటీ వర్గాల వారిపై అధిక సంఖ్యాక వర్గాలు దాడులు జరపడమనేది చరిత్రలో ఒక సాధారణ విషయంగా వున్నది’. అమెరికా తూర్పు తీర రాష్ట్రాలలో 19వ శతాబ్దిలో అతిసార వ్యాధి ప్రబలినప్పుడు ఇంగ్లండ్ మూలాలు గల ప్రొటెస్టెంట్ అమెరికన్లు, ఐరిష్ మూలాలుగల కేథలిక్ అమెరికన్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ‘ఐరిష్ వలసకారులు ప్రొటెస్టెంట్ ఆంగ్లో-అమెరికాకు రెండు విధాల ముప్పుగా పరిణమించారని’ ఇంగ్లాండ్ మూలాలు వున్న వారు నిరసించారు. ‘ఐరిష్ వలసకారులు అమెరికాలో పోప్ పాలనా వ్యవస్థ విలసిల్లడానికి, అతిసార వ్యాధి ప్రబలడానికి కారకులని’ ప్రొటెస్టెంట్ అమెరికన్లు విశ్వసించారు. 


ఐరోపా, అమెరికాలో మహమ్మారుల చరిత్రపై సైమన్ షామ విపుల వ్యాసం ఇటీవల లండన్ ‘పైనాన్షియల్ టైమ్స్’లో వెలువడింది. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో అంటు వ్యాధుల గురించిన రెండు అధ్యయనాలను ప్రస్తావిస్తాను. బొంబాయి నగరంపై 1896 నాటి ప్లేగు వ్యాధి ప్రభావం గురించి చరిత్రకారుడు ప్రశాంత్ కిడాంబి 2002లో ‘అర్బన్ హిస్టరీ’ అనే జర్నల్‌లో ఒక పరిశోధనా వ్యాసాన్ని ప్రచురించారు. వలసపాకుల ప్లేగు నిరోధక విధానాలు వర్గ పక్షపాతానికి తార్కాణాలని ప్రశాంత్ అభిప్రాయపడ్డారు. నగరంలోని పేదలపై దాడులకు అవి విశేషంగా కారణమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని మురికివాడల నివాసుల వల్లే ప్లేగు వ్యాధి ప్రబలిపోయిందని బ్రిటిష్ అధికార వర్గాలూ, భారతీయ కులీనులూ విశ్వసించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలపై పదే పదే దాడులు జరిగాయి. వేలాది గుడిసెలను దగ్ధం చేయడం జరిగింది. ఫలితంగా సంఖ్యానేక ముంబై వాసులు నిరాశ్రయులయిపోయారని ప్రశాంత్ రాశారు.


1918లో భారత్‌లో ప్రబలిన ఇన్‌ఫ్లూయెంజా (విష పడిశం) అంటు వ్యాధి గురించి చరిత్రకారుడు డేవిడ్ ఆర్నాల్డ్ పరిశోధనా వ్యాసంగత ఏడాది ‘ది ట్రాన్సాక్షన్స్‌ ఆఫ్ ది రాయల్ హిస్టారికల్ సొసైటీ’లో వెలువడింది. ఆ ఫ్లూ మహమ్మారికి ఉపఖండంలో మొత్తం 120 లక్షల మంది బలయ్యారు. ఈ అభాగ్యులలో అత్యధికులు పేదలే అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలా? సెంట్రల్ ప్రావిన్సెస్ శానిటరీ కమిషనర్ తన నివేదికలో ఇలా రాసినట్టు డేవిడ్ తన వ్యాసంలో ఉటంకించారు: ‘ఫ్లూ విధ్వంసకాండ గ్రామాలలో చాలా తీవ్రంగా వున్నది. గ్రామీణ ప్రజలు నిస్సహాయులైపోయారు. దీనికి తోడు ఆహారం, బట్టలు కూడా కరువవడంతో ఫ్లూ సృష్టించిన అపార నష్టం మాటల్లో వర్ణించలేనివిధంగా వున్నది’.


సరే– ఇప్పుడు మనలను అతలాకుతలంచేస్తున్న కొవిడ్ -19, 14వ శతాబ్ది ఐరోపా, బ్రిటిష్ వలసపాలనలో మన దేశంలో ప్రబలిన అంటు వ్యాధులను గుర్తుకు తెచ్చింది. ఈ సంక్షోభ వేళ మన దేశంలో మత మైనారిటీల పట్ల అహేతుక వ్యతిరేకత ప్రబలిపోగా, సమాజపు అంచుల్లో దుర్బల జీవితాలను గడుపుతున్న శ్రామిక జనావళి అపారంగా నష్టపోయింది. అసంఖ్యాక ప్రజలు హృదయ విదారకంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం అనివార్యమా? మధ్యయుగాల ఐరోపా వలే కాకుండా ఆధునిక భారతదేశం లౌకిక రాజ్యం. ఆనాటి ఐరోపా దేశాలు క్రైస్తవ మతాధిక్యతను నెలకొల్పేందుకు అంకితమయ్యాయి. బ్రిటిష్ రాజ్‌లో పూర్తిగా నిరంకుశ పాలన జరుగుతుండేది. అందుకు భిన్నంగా స్వతంత్ర భారతదేశం ఒక ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రస్తుత పాలకులు ఓటర్లు, పేదలు, ఇతర దుర్బల వర్గాలకు జవాబుదారీగా వుండి తీరాలి. 


కొవిడ్ 19ను ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వ వర్గ పక్షపాతం ప్రధానమంత్రి బహిరంగ ప్రకటనలలో స్పష్టంగా ప్రతిబింబించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పనిసరి. అయితే దాని అమలుకు ముందుగా పటిష్ఠ ప్రణాళిక నొకదాన్ని ఎందుకు రూపొందించలేదు? దక్షిణాఫ్రికానే చూడండి. మన ఆర్థిక వ్యవస్థ వలే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూడా నగరాలకు వలసవచ్చిన గ్రామీణ శ్రామికులపై ఆధారపడివున్నది. ఇక్కడ చెప్పవచ్చిన దేమిటంటే ఆ వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళేందుకు మూడురోజుల వ్యవధినిచ్చిన తరువాతనే లాక్‌డౌన్‌ను దక్షిణాఫ్రికా ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. మరి మన దేశంలో అలా ఎందుకు జరగలేదు? అలా జరిగివున్నట్టయితే మన నగరాలలోని లక్షలాది వలస కార్మికులు అందుబాటులో ఉన్న రైళ్ళు, బస్సుల ద్వారా లాక్‌డౌన్ అమలులోకి వచ్చేలోగా తమ స్వస్థలాలకు వెళ్ళిపోయేవారు కాదూ? 

పట్టణ మధ్యతరగతి ప్రజలు చాలా మందికి ప్రభుత్వ ఆసరాతో ప్రమేయం లేకుండా భద్రమైన జీవనం వున్నది. మదుపులు, పొదుపులు, ఆదాయాలు, పెన్షన్లు, గృహాలు మొదలైనవి వారికొక జీవన భద్రతనిస్తున్నాయి. తాము అదుపు చేయలేని అనూహ్య సంక్షోభాలను సైతం వారు ధైర్యంగా ఎదుర్కోగల పరిస్థితి వున్నది. మరి కోట్లాది వలసకూలీలకు జీవన భద్రత లేదు కదా. కాయకష్టంపై ఆధారపడిన ఆ అభాగ్యులు లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా ఉపాధిని కోల్పోయారు. పనిలేకపోతే ఆదాయముండదు. ఆదాయం లేకుండా జీవించేది ఎలా? అందుకే స్వగ్రామాలకు వెళ్ళిపోయేందుకు వారు నిర్ణయించుకున్నారు. అక్కడ ఉపాధి లభించకపోయినా కుటుంబ మద్దతు, ఆదరణ లభిస్తాయి. ప్రధానమంత్రి తన ప్రసంగాలు, ప్రకటనలలో పదే పదే బాల్కనీల గురించి ప్రస్తావించడం గమనార్హం.. ఆ ప్రస్తావనలను బట్టి ఆయన మధ్యతరగతి ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని విశదమవుతున్నది. మరి శ్రామిక జనావాళి శ్రేయస్సు మాటేమిటి? పేదల బాగోగులను ఉపేక్షించడం దిగ్భ్రాంతికరంగా వున్నది. నిజానికి, వందల కిలో మీటర్ల దూరంలో వున్న స్వగ్రామాలకు నడిచివెళ్ళుతున్న వలసకూలీలపై పోలీసుల దౌర్జన్యాలు కొవిడ్ -19 విలయపు శాశ్వత దృశ్యమాన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయనడంలో సందేహం లేదు. 


లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన తరువాత ఉత్తరాఖండ్‌లోని గుజరాతీ యాత్రికులు స్వరాష్ట్రానికి తిరిగివచ్చేందుకు లగ్జరీ బస్సులు సమకూర్చడం రాజ్యవ్యవస్థ వర్గ పక్షపాతానికి మరొక ఉదాహరణ. అలాగే భారతదేశపు కోచింగ్ క్యాపిటల్ (రాజస్థాన్‌లోని) కోట నుంచి మధ్యతరగతి కుటుంబాల పిల్లలను ఉత్తరప్రదేశ్, బిహార్‌లోని స్వస్థలాలకు పంపించేందుకు కూడా ప్రత్యేక బస్సుల నేర్పాటు చేశారు. మరి వలస కూలీలకు ఇటువంటి ప్రయాణ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? నగరాలలోని వలసకూలీలు సుదూర స్వరాష్ట్రాలలోని స్వస్థలాలకు వెళ్ళేందుకు ప్రత్యేక రైళ్ళ నేర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అభ్యర్థించినప్పటికీ కేంద్రం పట్టించుకోనేలేదు. ఇప్పటికీ ఈ విషయమై తగు చర్యలు చేపడుతున్న సూచనలు కన్పించడం లేదు.


ఇదిలా వుండగా భారతీయ సమాజంలోని అధిక సంఖ్యాకతా వాద వర్గ పక్షపాతం పలు విధాల వ్యక్తమయింది. నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో తబ్లిఘి జమాత్ మత సమ్మేళనం అసాధారణ బాధ్యతారాహిత్యానికి ఒక నిండు తార్కాణం. ఆ సమావేశ నిర్వహణకు అనుమతినిచ్చిన వారిని, ప్రోత్సహించిన వారిని చట్టం ప్రకారం శిక్షించి తీరాలి. బాధ్యులను జవాబుదారీగా చేయడానికి బదులు భారతీయ ముస్లింలనందరినీ అప్రతిష్ఠ పాలుచేసేందుకు, వారి పట్ల విద్వేషాన్ని పెంపొందించేందుకు తబ్లీఘ్ ఉదంతాన్ని వినియోగించుకున్నారు. పాలకపక్షం ఎంపీలు తబ్లీఘ్ గురించి అన్యాపదేశంగా మాట్లాడారు. అనుచిత భాషలో వ్యాఖ్యలు చేశారు. కొంత మంది చేసిన తప్పుకు ఒక మతసమూహాన్ని పూర్తిగా దుర్భాషలాడడం నాగరీకమేనా? కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం తమ రోజువారీ విలేఖర్ల సమావేశాల్లో మతపరమైన ప్రస్తావనలు చేశారు. కొవిడ్ మహమ్మారి బాధితుల గురించి మత పరమైన గుర్తింపుతో మాట్లాడ కూడదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాన్ని పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం ఆలస్యంగా అయినప్పటికీ అలా మాట్లాడవద్దని ఆదేశించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దేశ వ్యాప్తంగా ముస్లిం విక్రేతలు, కూలీలు, చేతివృత్తుల వారిని కేవలం వారి మత విశ్వాసాల కారణంగా బాయ్‌కాట్ చేయడం ప్రారంభమయింది.


ఈ ముస్లిం వ్యతిరేక ఉన్మాదానికి ప్రధాన మంత్రి ప్రతిస్పందన ఆయన స్వాభావిక వైఖరికి అనుగుణంగా వున్నది. తన మౌనం, బాధ్యత నుంచి తప్పించుకోవడం ద్వారా ఆ ఉన్మాదం మరింతగా పెచ్చరిల్లడానికి ఆయన దోహదం చేశారు. జాతినుద్దేశించి చేసిన ఒక ప్రసంగంలో భారతీయులు త్వరలో జరుపుకోనున్న హిందూ పండుగల గురించి ప్రస్తావించారు గానీ, రంజాన్, ఈద్ మొదలైన వాటిని విస్మరించారు. ఈ విస్మరణ యాదృచ్ఛికమైనదని భావించడానికి ఆస్కారం లేదు. తబ్లీఘ్ ఉదంతం మిషతో భారతీయ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న విద్వేషాన్ని నిరసిస్తూ పశ్చిమాసియాలోని కొన్ని చమురు దేశాల అధికార ప్రముఖుల ట్వీట్లకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ‘కోవిడ్ మహమ్మారి కుల మతాలు, జాతి వర్గాల మధ్య ఎటువంటి అంతరాన్ని పాటించదని’ వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా నగరాలు, గ్రామాలలోని లక్షలాది ప్రజలకు మతోన్మాద వైరస్ సంక్రమించింది. 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విపత్తుకు, కొన్ని విషయాలలో, భూకంపం లేదా తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యంతో సారూప్యమున్నది. హఠాత్తుగా వచ్చి, అనూహ్యంగా ప్రబలిపోయిన ఈ భయంకర అంటు వ్యాధిని చురుగ్గా కట్టడి చేయగల సంసిద్ధతలో రాజ్య వ్యవస్థ, సమాజమూ రెండూ లేవు. సంక్షోభ తీవ్రత అర్థమైన తరువాత మన ప్రతిస్పందన వివేకపూరితంగానూ, మరింత మానవోచితంగానూ వుండాలి. మరి మన ప్రజాస్వామ్య ప్రభుత్వం పేదల పట్ల నిరంకుశ బ్రిటిష్ వలస పాలకుల వలే దయారహితంగా వ్యవహరించింది. మన నవీన నాగరిక సమాజం మధ్యయుగాల ఐరోపా మాదిరిగా మత మైనారిటీలపై విద్వేష వైషమ్యాలను వెళ్ళగక్కింది.
రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.