త్వరలో మంత్రివర్గంలో మార్పులు

ABN , First Publish Date - 2022-05-23T14:39:20+05:30 IST

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి వర్గంలో మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సిద్ధమవుతున్నారు. అదే సమయంలో తమ విధులను సక్రమంగా

త్వరలో మంత్రివర్గంలో మార్పులు

త్వరలో మంత్రివర్గంలో మార్పులు

ఉదయనిధికి స్థానం.. నలుగురికి ఉద్వాసన? 

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): 

రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి వర్గంలో మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సిద్ధమవుతున్నారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించని నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకడంతో పాటు కొంతమంది మంత్రుల శాఖలను కూడా మార్పు చేయనున్నట్టు సమాచారం. అదే సమయంలో డీఎంకే యువజన విభాగం నాయకుడు, స్టాలిన్‌ తనయుడు ఉదయనిధికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారని తెలిసింది. ఊటీ పర్యటన ముగించుకుని నగరానికి తిరిగి రానున్న స్టాలిన్‌ త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని డీఎంకే సీనియర్‌ నేతలు చెబుతున్నారు. రాష్ట్రమంత్రివర్గంలో 34 మంది మంత్రులున్నారు. అసెంబ్లీలో మొత్తం పార్టీ సభ్యుల్లో 15 శాతం మందికి మంత్రి పదవులు కల్పించవచ్చనే ప్రాతిపదికపె 34 మందికి మంత్రి పదవులిచ్చారు.. డీఎంకే ప్రభుత్వం ఇటీవలే యేడాది పాలనను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం పనితీరుపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టి సారించారు. మంత్రుల పనితీరు తెలుసుకునేందుకు ఆయన ప్రత్యేక నిఘా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా మంత్రులు తమకు కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.  ఇదే రీతిలో ప్రతి మంత్రిత్వ శాఖలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ కమిటీ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ నెల ఏడున డీఎంకే ప్రభుత్వం యేడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కొందరు మంత్రులను తన ఛాంబర్‌కు పిలిచి వారి పనితీరును మెచ్చుకున్నారు.  అదే సమయంలో కొందరు మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పథకాల అమలులో మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టి చురుకుగా వ్యవహరించి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి  అభిప్రాయం వ్యక్తం చేశారని సచివాలయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. నిఘా కమిటీ అందించిన సమాచారం మేరకు నలుగురు మంత్రుల పనితీరుపై స్టాలిన్‌ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు చేయాలని భావించిన ఆయన కొంతమంది మంత్రుల శాఖలను కూడా మార్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా నీలగిరి జిల్లా పర్యటనలో ఉన్న స్టాలిన్‌ మంత్రివర్గంలో మార్పులు చేసే విషయమై తన సన్నిహితులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. ఊటీ పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఆయన నగరానికి తిరిగి వచ్చాక వారం రోజుల్లోగా మంత్రివర్గం మార్పులపై తుది నిర్ణయం తీసుకుంటారని డీఎంకే సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. సచివాలయంలోని సీనియర్‌ అధికారులు కూడా త్వరలో మంత్రి వర్గంలో మార్పులు జరగడం ఖాయమంటున్నారు. మంత్రి వర్గం మార్పుల సమయంలోనే అసంతృప్తుల జాబితాలో ఉన్న నాలుగు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది.అదే జరిగితే కొత్తగా ఆ నాలుగు మంత్రిపదవులను యువకులకు కేటాయించే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యమంత్రి తనయుడు, డీఎంకే యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రి పదవిని కేటాయించాలంటూ మూడొంతుల మంది మంత్రులు గత కొద్దినెలలుగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై కొందరు సీనియర్‌ మంత్రులు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చలు కూడా జరిపారు. పార్టీ సభలలోనూ ఉదయనిధికి త్వరలో మంత్రి పదవి లభిస్తుందని ఈ మంత్రులు పదే పదే ప్రకటిస్తున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు కూడా ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హాయంలో స్టాలిన్‌ తొలిసారిగా చేపట్టిన పురపాలక శాఖను ఉదయనిధికి కేటాయించాలని సీనియర్‌ నేతలు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర మంత్రి వర్గంలో త్వరలోనే మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.


స్టాలిన్‌ పాలనపై ప్రశంసలు

సర్వేలో 85 శాతం మంది మద్దతు

అడయార్‌, మే 22: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే ప్రభుత్వ యేడాది పాలన పట్ల రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ వ్యవహారశైలిని 85 శాతం ప్రజలు మెచ్చుకున్నారు. గత యేడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యేడాది పాలనపై ఐఏఎన్‌ఎ్‌స సీ-ఓటరు అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. సీఎం స్టాలిన్‌ పనితీరుపట్ల 85 శాతం మంది ప్రజలు సంతృప్తితో పాటు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 40.72 శాతం పూర్తి సంతృప్తి ని, 43.85 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తంమీద సీఎం పనితీరును 85 శాతం మంది మెచ్చుకున్నారు. అదేవిధంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రభుత్వ పనితీరుపై 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా విపక్ష నేతల పనితీరుపై కూడా సర్వే నిర్వహించగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పనితీరుపై 35.28 శాతం మంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయగా, 41.71 మంది మంది ఫర్వాలేదని అభిప్రాయపడ్డారు. 


 



Updated Date - 2022-05-23T14:39:20+05:30 IST