కాంగ్రెస్‌లో పీకే పరేషాన్‌

ABN , First Publish Date - 2022-04-26T07:46:32+05:30 IST

న్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకునే అంశం జాతీయ స్థాయిలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్‌లో పీకే పరేషాన్‌

జాతీయ స్థాయిలో భిన్నాభిప్రాయాలు.. నాయకుల్లో అత్యధికులు అనుకూలం


చేరికను అడ్డుకునేందుకు కొందరి యత్నం

అధిష్ఠానం మొగ్గు ప్రశాంత్‌ కిశోర్‌ వైపే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకునే అంశం జాతీయ స్థాయిలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనను పార్టీలో చేర్చుకోవాలని మెజారిటీ నేతలు భావిస్తుండగా, చేరకుండా అడ్డుకునేందుకూ కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం ఈ విషయంపై సోమవారం కూడా పెదవి విప్పలేదు. అయితే పార్టీపరంగా రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సోనియా ఏర్పాటు చేసిన సాధికారిక కార్యాచరణ బృందానికి ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యం వహించే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎనిమిది మంది సభ్యులు సమర్పించిన నివేదిక ఆధారంగా సోనియాగాంధీ ఈ బృందాన్ని ఏర్పాటు చేశారని, 2024 ఎన్నికలకు ఈ బృందం టాస్క్‌ఫోర్స్‌గా పనిచేస్తుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ప్రకటించారు. కానీ,  టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో చేరే విషయంలో జాతీయ స్థాయిలో ప్రియాంకాగాంధీ, అంబికా సోనీ తదితరులు సుముఖంగా ఉండగా, దిగ్విజయ్‌సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్‌ వంటివారు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 


ఐప్యాక్‌ను మూసుకోవాల్సిందే..

కాంగ్రె్‌సలో చేరాలంటే ప్రశాంత్‌ కిశోర్‌ తన సంస్థ ఐప్యాక్‌ను మూసివేసుకోవాలని, ఇతర పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని కొందరు నేతలు అంటున్నారు. సోమవారం సోనియాకు నివేదిక సమర్పించిన ఎనిమిది మంది సభ్యుల బృందంలోని కొందరు సీనియర్లు ఈ విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సతోపాటు పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో కాంగ్రె్‌సకు ప్రత్యర్థులైన పార్టీలతో ఆయనకు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్‌ పట్ల ఆయన అంకితభావంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరికకు ముందే ప్రశాంత్‌ కిశోర్‌ నుంచి స్పష్టత కోరాలని సోనియాకు వారు సూచించినట్లు తెలిసింది. అయితే తాను ఐప్యాక్‌ నుంచి తెగదెంపులు మాత్రమే చేసుకుంటానని, ఆ సంస్థ టీఆర్‌ఎ్‌సతోపాటు మిగతా పార్టీల కోసం పనిచేస్తుందని ప్రశాంత్‌ కిశోర్‌ చెబుతున్నారు. ఈ అంశంపైనే  కాంగ్రె్‌సలో తర్జన భర్జనలు మొదలయ్యాయి. ప్రత్యేకించి ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరుపుతూనే మధ్యలో హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంతనాలు జరపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ బహిరంగంగానే తన అభ్యంతరాన్ని వెల్లడించారు. ‘‘శత్రువుకు మిత్రులైన వారిని ఎప్పుడూ నమ్మవద్దు’’ అంటూ ఠాగూర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తెలంగాణలోని పలువురు కాంగ్రెస్‌ నేతలకు ఠాగూర్‌ ఫోన్లు చేస్తూ.. ప్రశాంత్‌ కిశోర్‌ను వ్యతిరేకించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. 


టీఆర్‌ఎ్‌సతో ఐప్యాక్‌ను వ్యతిరేకించని అధిష్ఠానం?

ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ ఐప్యాక్‌.. టీఆర్‌ఎ్‌సకు పనిచేయడం పట్ల కాంగ్రెస్‌ అధిష్ఠానం అంత సీరియ్‌సగా ఏమీ పరిగణించడంలేదని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఇటీవలి కాలంలో బీజేపీని వ్యతిరేకిస్తుండడాన్ని కాంగ్రెస్‌ పెద్దలు గమనిస్తున్నారని, నిజానికి కేసీఆర్‌ ఏనాడూ సోనియాను విమర్శించలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కేసీఆర్‌ ఢిల్లీలో బస చేసి, తెలంగాణ భవన్‌ వద్ద రైతుగర్జన సభ నిర్వహించిన సమయంలోనే కాంగ్రెస్‌ నేతలకు సంకేతాలు అందాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. వారి మనోభావాలకు అనుగుణంగానే ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నారని చెబుతున్నాయి. పైగా కాంగ్రె్‌సలో ప్రశాంత్‌ కిశోర్‌ చేరికను కోరుకుంటున్నవారు.. పార్టీకి ఆయన ఆచరణీయమైన సలహాలు ఇస్తారని అంటున్నారు. భవిష్యత్తులో టీఆర్‌ఎ్‌సతో సంబంధాలు ఏర్పరచుకుని.. బలమైన బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే దిశగానే ఇటు కాంగ్రె్‌సతో, అటు కేసీఆర్‌తో చర్చలు జరుపుతుండవచ్చునని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో టీఆర్‌ఎ్‌సతో సమాన ప్రాతిపదికన పొత్తు కుదుర్చుకున్నా కాంగ్రె్‌సకు ప్రయోజనకరమేనని ఆ నేత అన్నారు. పీకే రంగప్రవేశం చేస్తే తమ ఆటలు సాగవని తెలిసిన నేతలే ఆయనను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కాగా, పీకే విషయంలో సోనియాగాంధీ ఒకటి రెండురోజుల్లో నిర్ణయం తీసుకుంటారని, పార్టీలో ఏకాభిప్రాయం లేకున్నా ఆమె నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. 

Updated Date - 2022-04-26T07:46:32+05:30 IST