గుంతను పరిశీలిస్తున్న తహశీల్దారు
- ఆందోళనలో రైతులు
పాణ్యం, జనవరి 26: మండలంలోని ఆలమూరు గ్రామంలోని రైతు శ్రీనివాసరెడ్డి పొలంలో బుధవారం ఆరడుగుల మేర గుంత ఏర్పడింది. దీంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వరిమడిలో నాట్లు వేసినపుడు ఎటువంటి గుంత లేదని రైతు తెలిపాడు. గుంత ఏర్పడి వరిమడికి వదలిన నీరు గుంతలోకి వెళ్లింది. ఈవిషయం తెలుసుకున్న తహసీల్దారు శివప్రసాదరెడ్డి, వీఆర్వో మనోహర్, వ్యవసాయ సిబ్బంది అక్కడికి వెళ్లి గుంతను పరిశీలించారు. గుంతను చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పొలంలోకి ప్రజలు, పశువులు వెళ్లకుండా వరి మడి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంత ఏర్పడటానికి గల కారణాలను తెలుసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.