చేపపిల్లల విడుదలకు ఆటంకాలు

ABN , First Publish Date - 2021-12-01T05:55:51+05:30 IST

భారీ వర్షాలకు జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రిజర్వేయర్ల గేట్లను ఎత్తి మరీ.. నీటిని దిగువకు వదులుతున్నారు.

చేపపిల్లల విడుదలకు ఆటంకాలు
నిండిన ఎంపీఆర్‌

‘మీన’మేషాలు..!

మత్స్యశాఖ అధికారుల వింత పోకడ

ఫారంలలో మూడున్నర 

ఇంచుల సైజుకు చేరుకున్న పిల్లలు

నిండిన రిజర్వాయర్లు, చెరువులు

ఎన్నికలు ముగిసినా కోడ్‌ 

సాకు చూపుతున్న అధికారులు

చేపలను వదలాలని కలెక్టర్‌ నుంచి 

మౌఖిక ఆదేశాలు

ప్రజాప్రతినిధులతోనే సమస్య

సబ్సిడీ చేపపిల్లల కోసం 

సొసైటీ సభ్యుల ఎదురుచూపులు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, నవంబరు 30: భారీ వర్షాలకు జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రిజర్వేయర్ల గేట్లను ఎత్తి మరీ.. నీటిని దిగువకు వదులుతున్నారు. ఎక్కడ చూసినా.. నీళ్లే ఉన్నాయి. ఇంత అనుకూల పరిస్థితుల్లోనూ చేపపిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు తటపటాయిస్తున్నారు. వెంటనే రిజర్వాయర్లు, చెరువుల్లో చేపపిల్లలు వదలాల్సిందిపోయి.. సాకులు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారు. చేపపిల్లలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఓవర్‌సైజు అవుతున్నాయి కూడా. అయినా.. మత్స్యశాఖ అధికారుల్లో చలనం లేదు. చేపపిల్లలు వదిలేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల అభివృద్ధి కమిటీల్లో ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉండడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారు అందుబాటులోకి రాకపోతుండడంతో వారికి తెలపకుండా చేపపిల్లలు వదిలితే.. ఇబ్బందులు పడాల్సి వస్తుందని మత్స్యశాఖ అధికారులు సందిగ్ధంలో ఉన్నట్లు తెలిసింది.

జిల్లాలో వరుస వర్షాలతో రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నా... వాటిలో చేపపిల్లల విడుదలపై సందిగ్ధం నెలకొంది. మత్స్యశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ బూచి చూపుతూ చేపపిల్లలను నెలల తరబడి మత్స్యకేంద్రాల్లోనే మగ్గనిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న చెరువుల అభివృద్ధి కమిటీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటూ చేపపిల్లల విడుదలకు అడ్డంకిగా మారినట్లు విమర్శలున్నాయి. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈపాటికి ఆ పిల్లలను రిజర్వాయర్లలో వదిలి పెంపకం చేపట్టాల్సి ఉండేది.  వంద హెక్టార్లకుపైగా ఉన్న చెరువుల సొసైటీల నుంచి సబ్సిడీ చేపపిల్లలు కావాలని అర్జీలు అందుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం పూర్తికాకుండానే... సొసైటీలకు పిల్లలు ఎలా పంపిణీ చేయాలో అర్థం కాని పరిస్థితి అధికారులుది. ఈదశలో చేపపిల్లల విడుదలకు బాలరిష్టాలు చుట్టుముట్టాయి.


సొసైటీ భ్యుల ఎదురుచూపులు 

ఈఏడాది కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండిపోయాయి. మత్స్యశాఖ కింద ఉన్న సొసైటీలు ఆయా చెరువులకు సంబంధించి సబ్సిడీతో చేపపిల్లలను ఇవ్వాలని అధికారులకు అర్జీలు పెట్టుకుంటున్నారు. పీఎంఎంవై స్కీమ్‌ కింద సబ్సిడీ చేపపిల్లలు ఇవ్వాలంటే టెండర్‌దారులు ముందుకు రావాలని, ఆ మేరకు ఒక రేటు నిర్ణయించి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంతవరకు టెండర్‌దారులను పిలుస్తున్నప్పటికీ రాకపోవడంతో సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  రిజర్వాయర్లలో చేపపిల్లలను వదలడంపై సందిగ్ధం... సొసైటీ సభ్యుల నుంచి సబ్సిడీ పిల్లలు కావాలని ఒత్తిళ్లతో అధికారులు సతమతమవుతున్నారు. 


మూడున్నర ఇంచుల సైజుకు చేరుకున్న పిల్లలు 

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 8 కోట్ల చేపగుడ్లను ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. అందులో నుంచి 80 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సకాలంలో నీటి సరఫరా లేకపోవడంతో 80 లక్షల్లో 50 శాతం అంటే, 40 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేసినట్లు అదికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని ఫారం, మిడ్‌ పెన్నార్‌ డ్యాం, పీఏబీఆర్‌, బీటీ ప్రాజెక్టులలో నిర్మించిన ఫారంలలో చేపిపిల్లలను పెంచుతున్నారు. ఇందులో కట్ల, రోహు, మృగాల జాతులకు చెందిన చేపప్లిలలను వృద్ధి చేశారు. సాధారణంగా పిల్లలు రెండు నుంచి మూడు ఇంచుల సైజు ఉన్న సమయంలోనే లైసెన్సడ్‌ రిజర్వాయర్లలో వదలాలి.  జిల్లాలో అప్పర్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌ (పేరూరు), బీటీ ప్రాజెక్టు (గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామం), మిడ్‌ పెన్నార్‌ (గార్లదిన్నె)లు ఉన్నాయి. వీటిలో సొసైటీలకు ఈ చేపపిల్లలను ఇవ్వకూడదన్నది ప్రభుత్వ నిబంధన. అయితే అధికారులు ఎలక్షన కోడ్‌ వచ్చిన నేపథ్యంలోనే ఆలస్యమవుతోందని చెబుతున్నారు. కానీ ఎలక్షన కోడ్‌ రాకమునుపే ఆయా ఫారంలలో మూడు ఇంచులకుపైగానే చేపపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అధికారులు అనుకున్న సమయంలో చేపపిల్లలను వదలడంలో నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టంమవుతోంది. ఆయా ఫారంలలో మాత్రం చేపపిల్లలు ఇప్పటికే మూడున్నర ఇంచులు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబరు నెల కూడా దాటిపోతుండటంతో ఆ పిల్లలను వదులుతారా..? లేదా అన్న సందిగ్ధం నెలకొంది.


ప్రజాప్రతినిధులే సమస్యా...?

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లతో పాటు చెరువులు నీటితో నిండాయి. మత్స్యశాఖ కింద ఉన్న లైసెన్డ రిజర్వాయర్లు అయిన పేరూరు (అప్పర్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌), గుమ్మఘట్ట మండలం తాళ్లికెర గ్రామంలోని బీటీ ప్రాజెక్టు, గార్లదిన్నె మండలం ఎంపీడీ డ్యాం గ్రామంలోని మిడ్‌పెన్నార్‌ రిజర్వాయర్‌లు నీటితో నిండుకుండను తలపిస్తున్నాయి. చేప పిల్లలను వదలడంపై ఇంతకాలం ఎలక్షన కోడ్‌ను అధికారులు సాకుగా చూపుతూ వచ్చారన్న విమర్శలు లేకపోలేదు. అయితే ప్రస్తుతం జిల్లాలో వాయిదా పడ్డ ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిశాయి.  అధికారులు మాత్రం చేపపిల్లల విడుదలపై ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. మరోవైపు ఆయా రిజర్వాయర్ల పరిధిలోని కమిటీలలో స్థానిక ప్రజాప్రతినిధులు మెంబర్లుగా ఉండడమూ అధికారులకు తలనొప్పిగా మారింది. అనుకున్న సమయానికి ఆయా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడం, వారిని కాదని చేపపిల్లలు వదిలితే ఎక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతుందోననే ఆందోళన అధికారుల్లో నెలకొన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కలెక్టర్‌ నుంచి చేపపిల్లలను వదలాలని మౌఖికంగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అయినా అధికారులు స్థానికంగా ప్రజాప్రతినిధులను కాదని పిల్లల విడుదలపై వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేప పిల్లల విడుదలకు కమిటీ మెంబర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులూ ఓ సమస్యగా మారారనే చెప్పవచ్చు. 






అధికారులతో చర్చిస్తున్నాం

ఫారంలలో మూడు ఇంచుల చేపపిల్లలు ఉన్న మాట వాస్తవమే. ఎన్నికల కోడ్‌ రావడంతోనే ఆలస్యమవుతోంది. ఈవిషయంపై అధికారులకు విన్నవించాం. కలెక్టర్‌తోనూ చర్చిస్తున్నాం. కమిటీ మెంబర్లుగా ఎమ్మెల్యేలు ఉండటం, ఎలక్షన ఉండటంతోనే ఆలస్యమవుతోంది. మరోసారి అధికారులతో చర్చించి చేపపిల్లలను విడుదల చేస్తాం. సొసైటీ సభ్యులకు సబ్సిడీ చేపపిల్లల పంపిణీకి టెండర్‌దారులను పిలుస్తున్నాం. టెండర్‌దారులు ఎవరైనా ముందుకువస్తే చేపపిల్లకు రేటు నిర్ణయించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

- శాంతి, మత్స్యశాఖ డీడీ

Updated Date - 2021-12-01T05:55:51+05:30 IST