ఫిర్యాదుదారుడిపైనే పోలీసుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-12-09T04:40:16+05:30 IST

తన పొలంలో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి వైసీపీ నాయకుడు కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పనులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు కుంచి శ్రీనివాసులు యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

ఫిర్యాదుదారుడిపైనే పోలీసుల దౌర్జన్యం
బీజేపీ నాయకుడు శ్రీనివాసులుతో వాగ్వాదానికి దిగిన ఎస్‌ఐ శివనాంచారయ్య

స్టేషన్‌కు పిలిపించి మరీ ఎస్‌ఐ బెదిరింపు

బీజేపీ నేత శ్రీనివాసులుకు చేదు అనుభవం

వైసీపీ నాయకుడు కోర్టు ధిక్కరణ

ఈ విషయం ఫిర్యాదు చేసినందుకే!


వెంకటాచలం, డిసెంబరు 8 : తన పొలంలో కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి వైసీపీ  నాయకుడు కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పనులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు కుంచి శ్రీనివాసులు యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెంకటాచలం ఎస్‌ఐ శివ నాంచారయ్య స్టేషన్‌కు పిలిపించి మరీ బెదిరింపులకు  పాల్పడ్డాడని బాధితుడితోపాటు బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ మండలాధ్యక్షుడు కుంచి శ్రీనివాసులు మాట్లాడుతూ నిడిగుంటపాళెంకు చెందిన వైసీపీ నాయకుడు కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 2019లో అక్రమంగా సింగరెడ్డి డ్రైన్‌ కాలువ, తమ పట్టా పొలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించారని, అప్పట్లో తాము హైకోర్టును ఆశ్రయించగా తమకు కోర్టు స్టేటస్కో ఇచ్చిందన్నారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి శ్రీధర్‌రెడ్డి కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పనులు చేపట్టారని, దీనిపై మంగళవారం రాత్రి వెంకటాచలం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, ఇరిగేషన్‌ అధికారులు స్పందించి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.


సాయంత్రం వరకు స్టేషన్‌లోనే..

అయితే, బుధవారం మధ్యాహ్నం శ్రీనివాసులును స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ శివ నాంచారయ్య అసభ్యకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగినట్లు బాధితుడితోపాటు బీజేపీ నేతలు ఆరోపించారు. ఫిర్యాదుదారుడు అయిన తనపై  బెదిరింపులకు దిగడం ఏమిటని శ్రీనివాసులు ప్రశ్నించగా ఎక్కువ మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించినట్లు ఆవేదన చెందారు. అంతటితో ఆగని ఎస్‌ఐ ‘‘నీ మీద 2020లో అప్పటి తహసీల్దారు కేసు పెట్టి ఉన్నారని, నీకు 41ఏ నోటీసులు ఇవ్వాలి.’’ అంటూ శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని సాయంత్రం 5 గంటలపాటు కూర్చోబెట్టారు. ఆ కేసుకు సంబంధించి తాను అప్పట్లోనే యాంటీస్పెటరీ బెయిల్‌ ఇచ్చానని, ఇప్పుడు తనను నిర్బంధించడం ఏమిటని బాధితుడు ప్రశ్నించారు. దీనిపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.  నెల్లూరు రూరల్‌ సీఐ జగన్‌మోహన్‌రావు సమక్షంలోనే ఇదంతా జరగడం కొసమెరుపు.  విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు గడ్డం విజయకుమార్‌, షఫీ ఉల్లా తదితరులు స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ ఓబీసీ మండలాధ్యక్షుడు హసనాపురం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పిల్లిపాకుల పెంచలయ్య, జుంజు వీరభద్రయ్య, సుధాకర్‌, రమణయ్య తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-12-09T04:40:16+05:30 IST