పైరవీల పోస్టింగ్‌లు!

ABN , First Publish Date - 2022-07-02T05:38:13+05:30 IST

కొత్తవలస మండల పరిషత్‌ అధికారిని ఎస్‌.కోట మండల పరిషత్‌ అధికారిగా బదిలీ చేశారు. ఇంతవరకు ఎస్‌.కోట మండల పరిషత్‌ అధికారిగా పనిచేసిన మహిళకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

పైరవీల పోస్టింగ్‌లు!

ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కోరుకున్న చోటుకు..
సాయంత్రం వరకు తేలని సెక్రటరీ, వీఆర్వోల బదిలీలు

శృంగవరపుకోట జూలై 1:

 కొత్తవలస మండల పరిషత్‌ అధికారిని ఎస్‌.కోట మండల పరిషత్‌ అధికారిగా బదిలీ చేశారు. ఇంతవరకు ఎస్‌.కోట మండల పరిషత్‌ అధికారిగా పనిచేసిన మహిళకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.
 దత్తిరాజేరు ఉప తహసీల్దార్‌ లక్కవరపుకోట ఉప తహసీల్దార్‌గా వెళ్లాలనుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి సిఫార్సు కోసం యత్నించారు. అప్పటికే మరో ప్రజాప్రతినిధి సిఫార్సుతో వేరే అధికారి లక్కవరపుకోట ఉప తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు.
 ఐదేళ్లు నిండకపోవడంతో కొంతమంది అధికారులు బదిలీలకు దరఖాస్తు చేసుకోలేదు. అయితే ప్రజా ప్రతినిధుల సిఫార్సు ఉన్నవారి కోసం వీరిని కదపడం గమనార్హం. లక్కవరపుకోట మండల స్థాయి రెవెన్యూ అధికారి కోసం గంట్యాడ మండలంలో పనిచేస్తున్న అధికారిని వేపాడ తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలీ చేశారు.


ప్రజా ప్రతినిధుల సిఫార్సులున్న అధికారులకు కోరుకున్న చోట పోస్టింగ్‌లు దక్కుతున్నాయి. ఎటువంటి సిఫార్స్‌లు లేని అధికారులకు స్థానం చూపించకపోవడం లేదంటే ఎవరూ అడగని మండలాలకు బదిలీ చేసేయడం జరుగుతోంది. రెవెన్యూ శాఖలో సినియర్‌ అసిస్టెంట్‌లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లకు తహసీల్దార్‌ కార్యాలయాలకు బదిలీ జరిగినప్పటికీ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల్లో డిప్యూటేషన్‌లో పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళను కొత్తవలస ఆర్‌ఐ-2గా బదిలీ చేసి కలెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటేషన్‌ వేసినట్లు ఉత్తర్వుల్లో చూపించారు. ఇదే విధంగా కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ను బొండపల్లి ఆర్‌ఐ-2గా బదిలీ చేసి కలెక్టర్‌ కార్యాలయానికి డిప్యూటేషన్‌ వేశారు. జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళను డెంకాడ ఆర్‌ఐ-2గా బదిలి చేసిన అధికారులు ఆమెను కూడా కలెక్టర్‌ కార్యాలయానికి డిప్యూటేషన్‌లో పంపిస్తున్నారు.

జూనియర్‌ అసిస్టెంట్‌ బదిలీల్లోనూ..
జూనియర్‌ అసిస్టెంట్‌ల బదిలీల్లో కూడా ఇదే రకమైన చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసిన మహిళను గరివిడి తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలి చేసి కలెక్టర్‌ కార్యాలయంలోనే డిప్యూటేషన్‌ వేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని నెల్లిమర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలీ చేసి కలెక్టర్‌ కార్యాలయంలోనే డిప్యూటేషన్‌ వేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసిన మరో వ్యక్తిని ఎస్‌.కోట తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలీ చేసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటేషన్‌ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్‌ను భోగాపురం తహసీల్దార్‌ కార్యాలయానికి బదిలీ చేసి తిరిగి ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటేషన్‌ వేశారు. ఈ విధంగా అధికారుల బదిలీల్లో పెద్దఎత్తున సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వడం కనిపించింది. చాలా మంది అధికారులు తమకు కావాల్సిన కార్యాలయాల్లో కొలువుదీరారు.

సాయంత్రం వరకూ..
జీవో ప్రకారం గురువారం రాత్రికే బదిలీల పక్రియ ముగించాలి. కానీ శుక్రవారం సాయంత్రం వరకు పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేసే కార్యదర్శులు, రెవెన్యూ శాఖలో పని చేసే గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలు తేల్చలేదు. దీంతో కోరుకున్న స్థానం దొరుకుతుందో లేదోనని వారంతా టెన్షన్‌ పడ్డారు. వాస్తవానికి ఒకే స్థానంలో ఐదేళ్లు పూర్తయిన గ్రామ స్థాయి అధికారులే బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. తమకు అనుకూలమైన స్థానం కోసం ప్రజాప్రతినిధుల సిఫార్స్‌ల కోసం తపించారు. వారి ఆశీస్సులు లభించిన వారంతా ధీమాగా ఉండగా, మిగిలిన వారు ఎక్కడకు బదిలీ చేసేస్తారోనన్న ఆందోళనతో ఉండేవారు. ఇదిలా ఉండగా తమకు సహకారంగా ఉండే అధికారులను తెచ్చుకునేందకు ప్రజా ప్రతినిధులు ఇటీవల కాలంలో చేరిన ఉద్యోగులను కూడా బదిలీ చేసేందుకు చూశారు. శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి ఆరు నెలల క్రితం చేరారు. ఇతన్ని కొత్తవలస మేజర్‌ పంచాయతీకు బదిలీ చేయాలని ఓ ప్రజా ప్రతినిధి పట్టుబట్టారు. మరో ప్రజాప్రతినిధి ఇక్కడే వుంచాలన్న పంతంతో అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇలా పంచాయతీ కార్యదర్శుల బదిలీల కోసం ప్రజా ప్రతినిధుల మధ్య పోటీ నడిచింది. దీంతో జిల్లా స్థాయి అధికారులు శుక్రవారం సాయంత్రం వరకు ఎటూ తేల్చలేకపోయారు. రాత్రి కల్లా కథ సుఖాంతం అయింది. ఎట్టకేలకు బదిలీల ప్రక్రియను ముగించారు.
--------------

Updated Date - 2022-07-02T05:38:13+05:30 IST