జక్కంపూడి పిన్ని

ABN , First Publish Date - 2022-05-18T06:35:00+05:30 IST

ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు.

జక్కంపూడి పిన్ని

కాలనీ మొత్తానికి కిక్‌

  చిరు వ్యాపారాల ముసుగులో గంజాయి అమ్మకాలు

  స్థానిక యువకులే కొరియర్లు

  రూ.10 - 20 వేల పెట్టుబడి

  సరుకు ఇక్కడికి రాగానే ప్యాకెట్లలో అమ్మకాలు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు. చూసే వారికి మాత్రం చిరువ్యాపారుల్లా కనిపిస్తారు. చుట్టుపక్కల వారికి చాప కింద నీరులా మత్తు మజాను రుచి చూపిస్తారు. కొన్నాళ్లుగా జక్కంపూడి కాలనీలో సాగుతున్న కిక్‌ కథ ఇది. కాలనీలో ఉన్న యువకులను కొరియర్లుగా మార్చుకుని, వారికి పెట్టుబడి పెట్టి మన్యంలో పండిన గంజాయిని కాలనీకి రప్పించుకుంటున్నారు. యామినేని వెంకటేశ్వరమ్మ జక్కంపూడి కాలనీలో 183 బ్లాక్‌లో ఉంటోంది. ఈమెను కాలనీలో యువకులు మొత్తం ముద్దుగా గంజాయి పిన్ని అని పిలుచుకుంటారు. వెంకటేశ్వరమ్మ చెల్లెలు గాలమ్మ అలియాస్‌ కుమారి అదే బ్లాక్‌ వద్ద చిరు వ్యాపారాలు చేస్తుంది. ఉదయం టిఫిన్‌, సాయంత్రం చికెన్‌ పకోడి వ్యాపారం చేస్తోంది. ఇక్కడికి వచ్చే యువకులను, మత్తుబాబులను అక్క వెంకటేశ్వరమ్మ వద్దకు పంపుతోంది. ఈ కాలనీలో ఉండే కొంతమంది యువకులను అక్క కొరియర్లుగా ఏర్పాటు చేసుకుంది. వారికి పెట్టుబడి పెట్టి విశాఖ జిల్లాకు పంపుతోంది. వారికి ముందస్తుగా రూ.10-20 వేలు సమకూర్చుతుంది. ఒకేసారి ఐదారు కిలోల సరుకును రప్పించుకుంటుంది. ఇలా వచ్చిన సరుకును గ్రాముల లెక్కన ప్యాకెట్లలో తయారు చేస్తుంది. ఒక్కో ప్యాకెట్‌ను రూ.500 నుంచి రూ.800ల వరకు అమ్ముతోంది. ఈ ప్యాకెట్లను చెల్లెలు చేసే వ్యాపారాల వద్ద పెడుతుంది. మత్తు బాబులు ఇక్కడికి వచ్చి టిఫిన్‌ చేస్తున్నట్టుగా, చికెన్‌  పకోడి తింటున్నట్టు నటించి సరుకును తీసుకెళ్తున్నాయి. ఈవిధంగా గంజాయి మత్తును మొత్తం కాలనీలో వెదజల్లినట్టు సమాచారం. వెంకటేశ్వరమ్మ కుమారుడు లక్ష్మీనారాయణపై కొత్తపేట పోలీ్‌సస్టేషన్‌లో రౌడీషీట్‌ ఉంది. అతడూ చాలామందికి గంజాయి కిక్‌ను రుచి చూపించాడు. ఇటీవల ఒక కేసు విషయంలో విచారణ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు గంజాయి పిన్ని సమాచారం అందింది. మొత్తం తీగ లాగితే డొంక కదిలింది. కొన్ని సంవత్సరాలుగా వెంకటేశ్వరమ్మ జక్కంపూడి కాలనీలో గంజాయి వ్యాపారం చేస్తున్నా పోలీసులకు చిక్కలేదు. పోలీసులు పలుమార్లు చేసిన తనిఖీల్లో గంజాయి బ్యాచ్‌ను అరెస్టు చేశారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందన్న ప్రశ్నలోనూ వెంకటేశ్వరమ్మ పేరు వెలుగులోకి మాత్రం రాలేదు. పోలీసులకు తన సమాచారం తెలిసిపోయిందని భావించిన ‘పిన్ని’ పరారీలోకి వెళ్లింది. తాజాగా రెండు రోజులక్రితం పిన్ని చేతికి సంకెళ్లు వేసి జైలుకు పంపారు. వేలల్లో పెట్టుబడి పెట్టి గంజాయిపై వెంకటేశ్వరమ్మ భారీగా సంపాదించినట్టు తెలుస్తోంది. జక్కంపూడి కాలనీలో ఒక్కో బ్లాక్‌లో ఒక బ్యాచ్‌ వెంకటేశ్వరమ్మకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. ఈ కొరియర్లంతా బైక్‌లపైనే గంజాయి సరుకును తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆ కొరియర్లను వేటాడే పనిలో పోలీసులు ఉన్నాయి. జక్కంపూడి కాలనీలోని పిన్ని ద్వారా నగరంలో పలు ప్రాంతాలకు సరుకు సరఫరా అవుతున్నట్టు సమాచారం. ఈ లింక్‌ను చేధించడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.


Updated Date - 2022-05-18T06:35:00+05:30 IST