బెంగుళూరుకు గులాబీ దండు

ABN , First Publish Date - 2021-11-28T05:22:43+05:30 IST

రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకునేందుకు సంపూర్ణ సంఖ్యాబలం ఉన్నా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన సభ్యులందరినీ బెంగుళూరు క్యాంపునకు తరలించింది.

బెంగుళూరుకు గులాబీ దండు
క్యాంపునకు తరలుతున్న వారికి సూచనలు చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

 - ఎమ్మెల్సీ ఎన్నికల వరకు అక్కడే క్యాంపు

- కుటుంబ సభ్యులతోపాటు విహార యాత్ర

- క్రాస్‌ ఓటింగ్‌పై రవీందర్‌సింగ్‌ ఆశలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకునేందుకు సంపూర్ణ సంఖ్యాబలం ఉన్నా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన సభ్యులందరినీ బెంగుళూరు క్యాంపునకు తరలించింది. నామినేషన్ల ఉపసంహరణ వరకు శామీర్‌పేటలోని లియోమెరిడియన్‌ రిసార్ట్స్‌లో క్యాంపు వేసిన అధికార పక్షం ఇప్పుడు వెయ్యి మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను సకుటుంబ సపరివారంగా బెంగుళూరుకు తరలించింది. ప్రత్యేక బస్సుల్లో వారందరూ శనివారం సాయంత్రం క్యాంపునకు తరలివెళ్లారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతోపాటు క్యాంపుల నిర్వహణ కోసం అవసరమైన ముఖ్య నాయకులను కూడా బెంగుళూరుకు పంపించారు. బెంగుళూరులో వీరందరి కోసం 1600 రూములు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మంత్రి గంగుల కమలాకర్‌ స్థానిక సంస్థల ప్రతినిధులను క్యాంపులకు తరలించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించారు. 

- ఈటల వ్యాఖ్యల కలకలం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒక స్థానాన్ని కోల్పోవడం ఖాయమని పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి రెబల్‌గా పోటీ చేసిన రవీందర్‌సింగ్‌ ఇక్కడ గెలుస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించడం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో కలకలం రేకెత్తించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలుండగా మూడోసారి టి భానుప్రసాదరావుకు అవకాశం కల్పించారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌ రమణను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్సీ అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ స్థానంపై కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ఆశలు పెంచుకున్నారు. తనకు అవకాశం దక్కకపోవడంతో ఆయన రెబల్‌గా నామినేషన్‌వేసి పోటీలో నిలిచారు. రవీందర్‌సింగ్‌ పోటీలో దిగడం ఈటల రాజేందర్‌ ఆయనకు మద్దతు ప్రకటించడంతో గెలవడానికి సంపూర్ణ బలం ఉన్నా టీఆర్‌ఎస్‌ పార్టీ క్రాస్‌ ఓటింగ్‌ జరిగే ప్రమాదం ఉందని గమనించి తన సభ్యులందరిని బెంగుళూరు క్యాంపునకు తరలించింది. ఈటల రాజేందర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడగానే పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో మాట్లాడారని, రవీందర్‌సింగ్‌ పోటీలో దిగడంతో ఆయనకు మద్దతు ప్రకటించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి కోసం వ్యూహం పన్నారని చెబుతున్నారు. ఆర్థికంగా రవీందర్‌సింగ్‌కు అండదండలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. అధికార పక్షం కూడా తన సభ్యులు ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా చూసేందుకు ఆర్థిక నజరానాను ప్రకటించి క్యాంపునకు తరలించిందని ప్రచారం జరుగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన సభ్యుల ఓట్లతోపాటు టీఆర్‌ఎస్‌లో ఉన్న అసంతృప్తివాదులు రవీందర్‌సింగ్‌కు ఓటు వేసే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతున్నది. తొలి నుంచి ఉద్యమంలో ఉన్న రవీందర్‌సింగ్‌ను కాదని ఉద్యమం తొలినాళ్లలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన భానుప్రసాదరావుకు మూడుసార్లు అవకాశం కల్పించడం, ఇటీవలి వరకు టీడీపీలోనే ఉన్న ఎల్‌ రమణకు పార్టీలో చేరిన కొద్ది నెలల్లోనే ఎమ్మెల్సీగా టికెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు రవీందర్‌సింగ్‌వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ అధిష్టానవర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని, ఈటలను ఈ విషయంలో భంగపాటుకు గురిచేయాలనే లక్ష్యంతో క్యాంపు రాజకీయాలకు తెరతీసిందని ప్రచారం జరుగుతోంది. రవీందర్‌సింగ్‌ను గెలిపించి ఈటల బీజేపీలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటారా.. లేక టీఆర్‌ఎస్‌ ఇద్దరు ఎమ్మెల్సీను గెలిపించుకొని కరీంనగర్‌లో తన కోట చెక్కు చెదరలేదని నిరూపించుకుంటుందా.. అన్న చర్చ ఇప్పుడు ఉమ్మడి జిల్లా పరిధిలో జోరుగా సాగుతోంది. 

Updated Date - 2021-11-28T05:22:43+05:30 IST