శ్రీలంకతో పింక్ బాల్ టెస్ట్.. బెంగళూరు ఆతిథ్యం

ABN , First Publish Date - 2022-02-03T23:55:18+05:30 IST

భారత్-శ్రీలంక మధ్య జరగనున్న పింక్‌బాల్ టెస్టుకు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ ..

శ్రీలంకతో పింక్ బాల్ టెస్ట్.. బెంగళూరు ఆతిథ్యం

న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య జరగనున్న పింక్‌బాల్ టెస్టుకు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనున్నట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఫిబ్రవరి-మార్చి మధ్య శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటించనుంది. బెంగళూరులో పింక్‌బాల్ టెస్టు జరగనుండగా, మిగతా వేదికలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నట్టు గంగూలీ తెలిపాడు. ఇది భారత్‌లో జరిగే మూడో డే/నైట్ టెస్టు కాగా, టీమిండియాకు ఇది నాలుగోది. 


భారత్‌లో తొలి పింక్‌బాల్ టెస్టు 2019లో కోల్‌కతాలో జరిగింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫిబ్రవరి 2021లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‌భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. బెంగళూరులో జరగనున్న మ్యాచ్ మూడోది. కాగా, డిసెంబరు 2020లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

 

శ్రీలంతో సిరీస్‌కు ముందు భారత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ తన 1000వ వన్డేను ఆడనుంది. విండీస్‌తో వన్డే సిరీస్ అహ్మదాబాద్‌లో ఖాళీ స్టేడియంలో జరగనుంది.


భారత జట్టు 500వ వన్డే ఆడినప్పుడు తాను కెప్టెన్‌గా ఉన్నానని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. 4 జులై 2002న చెస్టర్ లీ స్ట్రీట్‌లో ఇంగ్లండ్‌తో ఆ మ్యాచ్ జరిగినట్టు ‘దాదా’ గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు వెయ్యో వన్డే ఆడడం నిజంగా అపురూప క్షణమని పేర్కొన్నాడు. అయితే, దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా జరుగుతుందని అన్నాడు. సిరీస్ మొత్తానికి ప్రేక్షకులను అనుమతించడం గంగూలీ పేర్కొన్నాడు.

Updated Date - 2022-02-03T23:55:18+05:30 IST