పింగళి వెంకయ్యను గుర్తించకపోవడం బాధాకరం

ABN , First Publish Date - 2021-08-03T07:07:38+05:30 IST

భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య అని ప్రముఖ రచయిత, హాస్యావధాని శంకరనారాయణ అన్నారు.

పింగళి వెంకయ్యను గుర్తించకపోవడం బాధాకరం
సమావేశంలో మాట్లాడుతున్న శంకరనారాయణ

చిక్కడపల్లి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): భారత జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య అని ప్రముఖ రచయిత, హాస్యావధాని శంకరనారాయణ అన్నారు. సోమవారం త్యాగరాయగానసభలో పింగళి వెంకయ్య జయంతి సభ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శంకరనారాయణ మాట్లాడుతూ.. పింగళి వెంకయ్య ఏనాడూ పదవి ఆశించలేదన్నారు. ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమన్నారు. ఇతర దేశాల్లో జాతీయ పతాకాల రూపకర్తలను ఆ ప్రభుత్వాలు గౌరవిస్తాయని, వారికి కావాల్సిన వసతులు ఉచితంగా సమకూరుస్తాయన్నారు. మన ప్రభుత్వం పింగళి వెంకయ్యను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. జాతీయపతాకం గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో మన పతాకం నిర్మాత తెలుగు వాడని రాశారే తప్ప పింగళి వెంకయ్య పేరును సూచించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో భమిడి ఉష, జీవీఆర్‌ ఆరాధన సంస్థ అధినేత గుదిబండి వెంకటరెడ్డి, చిక్కా రామదాసు, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T07:07:38+05:30 IST