పింఛనో.. చంద్రశేఖరా

ABN , First Publish Date - 2022-05-27T08:51:23+05:30 IST

రాష్ట్ర ఖజానా కటకట ప్రభావం ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్ల పైనే కాదు..

పింఛనో.. చంద్రశేఖరా

  • రాష్ట్రంలో చెల్లింపులు నెలన్నరపైగా ఆలస్యం
  • 3 నెలల నుంచి ఆసరా పెన్షన్‌ల తీరిది
  • 37 లక్షలమంది లబ్ధిదారుల ఎదురుచూపు
  • పింఛనుపైనే ఆధారపడినవారు లక్షలమంది
  • నెలకు విడుదల చేయాల్సినది 870 కోట్లు
  • ఖజానా కటకటతో మంజూరులో జాప్యం
  • జూన్‌ నుంచి కొత్త పింఛన్లు అనుమానమే
  • పెండింగ్‌లో 11 లక్షలకుపైగా దరఖాస్తులు!


హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానా కటకట ప్రభావం ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్ల పైనే కాదు.. పేద వర్గాలకు చెందిన ఆసరా లబ్ధిదారుల మీద కూడా పడుతోంది. నిధుల లేమితో ఆసరా పింఛన్ల మంజూరు నెలన్నర పైగా ఆలస్యమవుతోంది. ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కాస్త ఆలస్యమైనా ఆర్థికంగా తట్టుకోగలిగే స్థితిలో ఉంటారు. కానీ, ఆసరా లబ్ధిదారుల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.2,016 మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నవారు లక్షల మంది ఉన్నారు. నిరుపేదలు నిత్యావసరాలు కొనుక్కునేందుకు, వృద్ధులు మందుల ఖరీదుకు ఈ సొమ్మే ఆధారం. ఇలాంటివారంతా రోజూ తపాలా శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్లు పొందుతున్నవారు 37 లక్షలమంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు వీరిలో ఉన్నారు. వీరికి రూ.2,016 వస్తుండగా, దివ్యాంగులకు రూ.3,016 ఇస్తున్నారు. నెలకు రూ.870 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రతి నెల మొదటి వారంలోనే అందాల్సిన పింఛను 3 నెలలుగా ఆలస్యం అవుతోంది. నెల ఆఖరుకైనా వస్తుందేమోనని ఆశ పెట్టుకుంటే అదీ తీరడం లేదు. మార్చి నెల పింఛనును ఏప్రిల్‌ చివరన అందజేయగా.. ఏప్రిల్‌ పింఛను ఇంకా చెల్లించాల్సి ఉంది. ఇక మే నెల పింఛను కోసం జూన్‌ ఆఖరు వరకు వేచి చూడాల్సిందే. ఎప్పుడూ లేని స్థాయిలో ఆలస్యం అవుతుండడంతో ఏమైందోనని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఆసరా పెన్షన్‌పై ధీమాతో.. ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు మరింత కలవరం చెందుతున్నారు. కాగా, అధికార వర్గాలు మాత్రం బడ్జెట్‌ విడుదల చేశామని చెబుతున్నాయి. కానీ, అది 20 జిల్లాలకేనని తెలుస్తోంది.


కొత్త దరఖాస్తుల కథ తేల్చేదెప్పుడు?

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మంజూరు అనుమానమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 10,94,553 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ప్రస్తుత బడ్జెట్లో ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు కేటాయించామని, జూన్‌ నుంచి కొత్త పింఛన్లు ఇస్తామంటూ మార్చి నుంచి మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌ తదితరులు చెప్పారు. కానీ, ఈ మేరకు ఎటువంటి కసరత్తు జరగడం లేదు.

Updated Date - 2022-05-27T08:51:23+05:30 IST