రామాలయంపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం కాదు : పినరయి విజయన్

ABN , First Publish Date - 2020-08-06T03:34:37+05:30 IST

కాంగ్రెస్ పార్టీ మెతక హిందుత్వాన్ని అనుసరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

రామాలయంపై ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు ఆశ్చర్యకరం కాదు : పినరయి విజయన్

తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ మెతక హిందుత్వాన్ని అనుసరిస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆరోపించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. 


ఆలయం తలుపులు ఎవరు తెరిచారో, కర సేవను ఎవరు అనుమతించారో మనకు తెలుసునన్నారు. ఇవన్నీ కలిసి మసీదు కూల్చివేతకు దారి తీసిందని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ మెతక హిందుత్వాన్ని ప్రదర్శిస్తోందని, అందువల్ల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నేతల స్టేట్‌మెంట్లు తనకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. 


మన దేశం ప్రస్తుతం మహమ్మారిని ఎదుర్కొంటోందని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవలసిన సమయమిదని, పండుగలు చేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు.


ప్రియాంకను తప్పుబట్టిన మిత్ర పక్షం

కేరళలో కాంగ్రెస్‌కు ప్రధాన మిత్ర పక్షంగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై ప్రియాంక గాంధీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె స్టేట్‌మెంట్ సరైనది కాదని తెలిపింది. కాంగ్రెస్ నేతలు తమ లౌకికవాద విశ్వసనీయతను నిర్వీర్యం చేసుకోవద్దని హెచ్చరించింది. 


Updated Date - 2020-08-06T03:34:37+05:30 IST