మహాత్ముడు నాటిన అంకురం పినాకిని ఆశ్రమం

ABN , First Publish Date - 2021-04-07T05:33:38+05:30 IST

అసలే వేసవి. తూర్పు నుంచి భానుడు హాజరై మూడు గంటలు దాటింది. రైల్వే స్టేషన్ కిట కిట లాడుతుంది. ప్లాట్ ఫామ్ మీదే హడావిడిగా తిరుగుతున్న...

మహాత్ముడు నాటిన అంకురం పినాకిని ఆశ్రమం

1921 ఏప్రిల్ 7...

అసలే వేసవి. తూర్పు నుంచి భానుడు హాజరై మూడు గంటలు దాటింది. రైల్వే స్టేషన్ కిట కిట లాడుతుంది. ప్లాట్ ఫామ్ మీదే హడావిడిగా తిరుగుతున్న అభిమానులు కార్యకర్తలు. స్టేషన్ బయట, లోపల మార్మోగుతున్న వందేమాతరం నినాదాలు. దూరంగా వినిపిస్తున్న పొగబండి కేక. విజయవాడ నుంచి వచ్చి ఫ్లాట్‌ఫారం మీద ఆగిన మెయిల్ బండి. అంతా నిశ్శబ్దం. మహాత్మా గాంధీ బోగీలో నుంచి కనిపించారు. మరుక్షణంలోనే స్టేషనులో హోరెత్తిన నినాదాలు. పొణకా, చతుర్వేదుల, బెజవాడ, తిక్కవరపు, దువ్వూరు లాంటి అనేక కుటుంబాలకు చెందిన నాయకులు వారిని స్వాగతించారు. స్టేషన్ బయట సిద్ధం చేసిన ఎద్దులబండిలో గాంధీని ఎక్కించారు. ముందూ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాయకుల ఎద్దులబండ్లు కూడా కదిలాయి.


అదే రోజు నూతన ఆశ్రమ భవనాన్ని గాంధీజీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. పల్లెపాడుకు వెళ్లాలంటే మూడు మైళ్లు నడిచి పోవాల్సిందే. అప్పటికి పల్లెపాడుకు వెళ్ళేందుకు రస్తాలు లేవు, కార్లు లేవు. అందువల్ల జగదేవిపేటలోని ప్రముఖ రైతు, గాంధీ భక్తుడు తిక్కవరపు వెంకట రెడ్డి ఏర్పరిచిన రెండెడ్ల బండిలో ఆ మూడు మైళ్లు ప్రయాణించవలసి వచ్చింది. ఆ బండి రథసారధి కనకమ్మ భర్త సుబ్బరామరెడ్డి. కానీ ఆ బండిని లాగలేక ఎద్దులు పెడముఖం పెట్టసాగాయి. పక్కనే నడుస్తున్న గాంధీ అభిమానులు చక్రాలకు ఊతమిచ్చారు. కానీ అవి నడవలేకపోయాయి. ఎందుకంటే మూడడుగుల లోతున ఉండే ఇసుక రహదారి అది. ఎద్దుల తోకలను మెలి వేశారు, దెబ్బలు కొట్టారు. గాంధీజీ చివాలున బండినుంచి కిందకు దిగారు. ఎద్దులు నా వల్ల దెబ్బలు తింటున్నాయి అని చేతి కర్ర తీసుకున్నారు. పంచ బిగించి నడక ప్రారంభించారు. మైపాడు రోడ్డు వరకు నడిచి అక్కడ సేద తీర్చుకుని ఆలస్యంగా ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పటికే దాదాపు 30వేలమంది పైగా పరిసర గ్రామాల జనం పల్లెపాడుకు చేరుకుని ఉన్నారు. బహుశా ఇది పట్నమేమో అన్న భ్రాంతికి కారణమైంది ఆ పల్లె.


అదే రోజు పల్లెపాడు గ్రామస్థులు గాంధీజీని గ్రామంలోకి ఆహ్వానించారు. అప్పటికే గ్రామ సమాచారాన్ని అందుకున్న గాంధీజీ- తనతో పాటు హరిజనులకు గ్రామ ప్రవేశం కల్పిస్తేనే రాగలనని ఖరాఖండీగా చెప్పారు. శోత్రీయ గ్రామ ప్రజలు తర్జనభర్జన పడి గాంధీజీతో పాటు హరిజనులను కూడా గ్రామంలోకి ఆహ్వానించారు. అలా 1921లోనే పల్లెపాడు గ్రామంలో హరిజనుల గ్రామ ప్రవేశంతో జిల్లాలో కొత్త అధ్యాయం మొదలైంది. 


భరత మాత దాస్యశృంఖలాలను చేధించేందుకు జరిగిన స్వాతంత్ర్య సమరంలో ప్రతి ఉద్యమంలోనూ నెల్లూరు వాసులు ముందుకురికి కదంతొక్కారు. గ్రంథాలయ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, ఖద్దరు ధారణ, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, జమీందారీ వ్యతిరేక ఉద్యమం, క్విట్ ఇండియా, హరిజన ఉద్ధరణ, హరిజన ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ, జాతీయ భాష ప్రచారం వంటి అనేక ఉద్యమాల్లో జిల్లా వాసులు తన ప్రత్యేకతను చాటుకున్నారు. వీటి వెనక తొలి స్ఫూర్తి మహాత్మా గాంధీ నెల్లూరు జిల్లాలో ఐదుసార్లు పర్యటించడమైతే, మరొకటి పల్లెపాడు గ్రామంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ ప్రారంభానికి స్వయంగా విచ్చేయటం. దక్షిణ భారత దేశానికి ఉద్యమ స్ఫూర్తి నింపిన ఈ ఆశ్రమం సరిగ్గా నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. జాతిపిత మహాత్మాగాంధీ 1921 ఏప్రిల్ 7న స్వహస్తాలతో ప్రారంభించిన ఈ పినాకిని ఆశ్రమం రెండవ సబర్మతి ఆశ్రమంగా పేరు గడించింది. కానీ నేడు ఈ ఆశ్రమాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఇది ఇప్పడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచింది.


ఆంధ్రలో సత్యాగ్రహ ఆశ్రమం నెలకొల్పితే బాగుంటుందని మహాత్మాగాంధీ తలచినప్పుడు పినాకినీ నదీ తీరంలో పల్లెపాడు వద్ద ఆశ్రమ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించారు. పెన్నానది ఒడ్డున గల పల్లె పాడు 400 గడప ఉన్న కుగ్రామం. అక్కడ 20 ఎకరాలు కలిగిన కొంజేటి కుటుంబం నెల్లూరుకు తరలిపోతూ సర్వే నెంబర్ 224/3, 225/3, 226W/8లో గల ఆ భూమిని అమ్మచూపారు. అదే గ్రామానికి చెందిన రావిప్రోలు, దువ్వూరు కుటుంబాలు కొనుగోలు చేశారు. అప్పటికే స్వాతంత్ర సమర ఉద్యమం వైపు బలంగా అడుగులు వేస్తున్న పొణకా కనకమ్మ 1918లో రూ.600కి దీన్ని కొనుగోలు చేశారు. అప్పటికే తుపాకులు కొనుగోలు చేసిన కనకమ్మ సవక చెట్లు, తోటలు బలంగా ఈ 20 ఎకరాల స్థలాన్ని తుపాకీ పేల్చే తర్ఫీదుకోసం అనువైన స్థలంగా భావించారు. 


పల్లెపాడు వాసులు దిగుమర్తి హనుమంత రావు, చతుర్వేదుల వెంకట కృష్ణయ్యలు పెన్నానది తీరంలో ఆశ్రమాన్ని నిర్మించాలనే సూచనను గాంధీకి ఇచ్చారు. గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి వచ్చిన వారిరువురూ అదే స్ఫూర్తితో వెంటనే పల్లెపాడులో ఆశ్రమం ఏర్పాటుకు నడుం బిగించారు. కనకమ్మ తాను కొనుగోలు చేసిన ఈ భూమిని ఆశ్రమ నిర్మాణానికి ఉచితంగా అందించారు. గాంధీ స్వయంగా జాతీయ మహాసభ నుండి పది వేల రూపాయలు సేకరించి ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన గాంధీ స్నేహితులు రుస్తుంజీ మరో పది వేల రూపాయల విరాళమిచ్చారు. ఇంకా పలువురు స్వాతంత్ర్య సమర యోధుల సహకారంతో భవన నిర్మాణం పూర్తయింది. 


1921 నవంబర్ 25న ఈ భవనాన్ని ట్రస్ట్ ఆస్తిగా రిజిష్టర్ చేయించారు. ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతను మహాత్ముడు స్థానికంగా ఉండే వెంకటకృష్ణయ్య, హనుమంతరావులకు అప్పగించారు. ఆశ్రమ నిర్వహణ ఏ కారణంగానైనా ఆగిపోతే ఈ ఆస్తులు ఆంధ్రలో ఏర్పాటయ్యే ఏ ఇతర సత్యాగ్రహ ఆశ్రమాలకు గాని, అలాంటి ఆశ్రమాలు ఆంధ్రలో లేకపోతే సబర్మతి ఆశ్రమానికిగాని సంక్రమింప జేయాలని ట్రస్ట్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. ట్రస్ట్ జీవితకాల సభ్యులుగా దిగుమర్తి హనుమంతరావు, చతుర్వేదుల వెంకటకృష్ణయ్య, కె. పున్నయ్య, పొణకా కనకమ్మ నియమితులయ్యారు. సభ్యుల సంఖ్య ఆరుకు మించరాదని బాపూజీ షరతు విధించారు. 


జిల్లాలో హరిజనోద్ధరణకు మొట్టమొదటగా నడుంకట్టిన ఘనత పినాకినీ సత్యాగ్రహాశ్రమానికే దక్కుతుంది. అందువలన కమిటీలో తప్పని సరిగా ఒక హరిజన సభ్యులు ఉండాలని కూడా తీర్మానించుకున్నారు. ఆ ఆశ్రమ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో తిక్కవరపు రామిరెడ్డి, ఆయన సతీమణి సుదర్శనమ్మ, బెజవాడ గోపాలరెడ్డి, పొణకా కనకమ్మ, మైపాడుకు చెందిన వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన మేనకూరు, బెజవాడ కుటుంబీకులు, పలువురు జాతీయ వాదులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రకృతి చికిత్సలో పేరున్న ఓరుగంటి వెంకట సుబ్బయ్య, నెల్లూరు వెంకట్రామానాయుడు, ఖాసా సుబ్బారావు, ఇస్కా చెంచయ్య, రేబాల కృష్ణయ్య దంపతులు గాంధీజీ కోరిక మేరకు ఆశ్రమ విధులు నిర్వహించేవారు. 1924లో దొంగలుపడి ఆశ్రమ వాతావరణంలో భయబ్రాంతులు సృష్టించారు. కిటికీలు తలుపులు ఎత్తుకెళ్లారు. దీనితో కొందరు ఆశ్రమవాసులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నా- మరికొందరు ఆశ్రమవాసులు అది గాంధేయవాదానికి వ్యతిరేకమని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈ ఆశ్రమం ఇక జరగదని కొంతమంది ఆశ్రమం నుంచి తప్పుకొని వదిలిపోవడం ప్రారంభించారు. 1926 మార్చిలో హనుమంతరావు మృతిచెందడంతో ఆశ్రమానికి గుండె నిలిచిపోయినంత పని అయింది. అప్పటి నుంచి ఆశ్రమం స్ఫూర్తి దెబ్బతింటూ వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా లాంటి కార్యక్రమాలకు ఈ ఆశ్రమమే స్ఫూర్తిగా నిలిచింది. ఐతే ఆశ్రమ నిర్వాహకులు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైనందున 1968లో ఈ ఆశ్రమాన్ని తిరుపతికి చెందిన గ్రామ స్వరాజ్యసంఘం వారు అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వగా వారికి లీజుకు ఇచ్చారు. అయితే, ఆశ్రమాభివృద్ధి ఏమాత్రం జరగనందున 1976లో పల్లెపాడుకు చెందిన స్వాతంత్ర సమరయోధులు స్వర్ణ వేమయ్య, ఆ తరువాత కాలంలో సర్పంచ్ వేదాచలం, ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి శిష్యులు మంచిరెడ్డి శివరాంలు ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ వచ్చారు. శివరాం ఇక్కడ పాఠశాల స్థాపించి సామాజిక నేపథ్యంలో చదువు చెప్పటం జిల్లాలో విశేషంగా ఆకట్టుకుంది. కానీ అప్పటికే ఈ భూములను కొంత ఆక్రమించుకొన్న గ్రామస్థులు ఆశ్రమాన్ని పూర్తిగా కైవసం చేసుకోవాలనే ఎత్తుగడతో అనేక దాడులు చేసిన నేపథ్యంలో శివరాం పాఠశాల కూడా దీర్ఘకాలం కొనసాగించలేక పోయారు. ఆ తర్వాత కాలంలో వేదాచలం ఆశ్రమ భూములు ఆక్రమించినవారిని అడ్డుకొని అదే గ్రామ హరిజనులకు ఎకరా చొప్పున లీజుకు ఇప్పించారు. 


ప్రకృతి వైపరీత్యాల వల్ల లీజుదార్లు నష్టపోయి వారు మరలా సబ్ లీజుకు ఇచ్చుకుంటూ ఆరుగురి చేతులు మారాయి. 1989లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశ్రమాన్ని సందర్శించి, దీన్ని ఢిల్లీలోని అభివృద్ధి ఆశ్రమాల జాబితాలో చేర్పించి అభివృద్ధికి కృషిచేస్తానని ఆ గ్రామస్థులకు వాగ్దానం చేశారు. తమిళనాడు గవర్నరుగా రోశయ్య పనిచేస్తున్న కాలంలో ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీ ఆశయాలకు, సిద్ధాంతాలకు ఈ ఆశ్రమం కేంద్రంగా రూపుదిద్దుకొనేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు. జిల్లాకు చెందిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఎంతోమంది గత నాలుగైదు దశాబ్దాలుగా సందర్శించడం హామీలు ఇచ్చినా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. కలెక్టర్ రాంగోపాల్ కాలంలో, ఐఏఎస్ అధికారి సౌరభ్‌గౌర్ కాలంలో విశేషమైన కృషిచేసి ఆక్రమణదార్ల కబంధ హస్తాలనుంచి ఆశ్రమాన్ని విడిపించిన అప్పటి తహశీల్దారు దంపూరు రామకృష్ణ కృషి గొప్పది. కలెక్టర్ రాంగోపాల్ హయాంలోనే కోట్లరూపాయల నిధులు విడుదల కాగా ముఖద్వారము, అతిథి గృహాన్ని నిర్మించారు. గాంధీజీ ప్రారంభించిన భవనాన్ని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నిలబెట్టగలిగారు. ఆ తరువాత కాలంలో రెడ్‌క్రాస్ కు దీని బాధ్యతలు అప్పజెప్పటంతో కొంతకాలం సర్వమత ప్రార్ధనలు లాంటి కార్యక్రమాలతో కాలక్షేపం జరిగింది. జిల్లాలోని రెడ్‌క్రాస్‍కు ప్రముఖ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు పోటీలు పడి ఆ పదవులు దక్కించుకోవడంతో గాంధీ ఆశ్రమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది జిల్లాలోని విద్యార్థులందరికీ ఇక్కడ ప్రత్యేక తరగతులను నిర్వహించాలని టూరిజం శాఖ రూ.96 లక్షల నిధులను విడుదల చేసినా నామమాత్రంగా ఆరేళ్ల క్రితం ఓపన్ ఆడిటోరియం, టెన్నిస్ కోర్టు, ఫుడ్‌కోర్టు, మీటింగ్ హాలు లాంటివి ప్రారంభించి నిలువెత్తు గోడలను లేపి పూర్తికాకుండానే వదిలేశారు. ఇప్పటికైనా గాంధీజీ ఆదర్శాలకు ప్రతీక అయిన ఈ ఆశ్రమం పునరుద్ధరణకు అధికారులు, రాజకీయ నాయకులు చొరవ చూపాలని గాంధేయవాదులు, అభిమానులు, చరిత్రకారులు కోరుతున్నారు.

ఈతకోట సుబ్బారావు

‍(పినాకిని ఆశ్రమ స్థాపనకు నేటితో వందేళ్ళు)

Updated Date - 2021-04-07T05:33:38+05:30 IST