పులిపిర్లు, మచ్చలు క్యాన్సర్లు కావచ్చు

ABN , First Publish Date - 2022-07-19T16:52:29+05:30 IST

చర్మం మీద కొత్తగా తలెత్తే పులిపిర్లు, పుట్టుమచ్చల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అవి

పులిపిర్లు, మచ్చలు క్యాన్సర్లు కావచ్చు

చర్మం మీద కొత్తగా తలెత్తే పులిపిర్లు, పుట్టుమచ్చల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అవి క్యాన్సర్లుగా పరిణమించే ప్రమాదం ఉంది. 


పులిపిర్లు ఉంటే...

పులిపిర్ల వల్ల ఇబ్బంది లేకపోయినా, పెద్దవిగా ఉంటే, వాటిని తొలగించుకోవడం అవసరం. పెసర గింజంత పరిమాణంలో ఉండే ఈ పులిపిర్లు కొన్ని సందర్భాల్లో గోల్ఫ్‌ బాల్‌ సైజుకు కూడా పెరగవచ్చు. అరుదుగా వీటి రంగులో మార్పులు, రక్తం కారడం లాంటివీ కనిపించవచ్చు. ఈ తరహా పులిపిర్లు (స్కిన్‌ ట్యాగ్స్‌) క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చు. పుట్టుకతో వచ్చే మచ్చలు కాకుండా, 20 ఏళ్ల తర్వాత మచ్చలు ఏర్పడి, అవి సరైన ఆకారం లేకుండా, రంగు మారుతూ, రక్తం కారుతూ, ఉబ్బెత్తుగా ఉంటే స్కిన్‌ క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే!


ఈ గడ్డలను కూడా అనుమానించాలి

శరీరంలోని అనేక ప్రాంతాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఇవి అక్కడక్కడా లేదా శరీరమంతా ఉండవచ్చు. అయితే ఇవే గడ్డలు అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది. చర్మం అడుగున లేదా రొమ్ములో గడ్డలు ఏర్పడి మెత్తగా, కదులుతూ ఉంటే భయపడవలసిన అవసరం లేదు. చేతితో తాకినప్పుడు గట్టిగా రాయిలా ఉండి, గడ్డ కదలకుండా ఉన్నా, గడ్డలో మార్పులు కనిపించినా దాన్ని క్యాన్సర్‌ గడ్డగా అనుమానించాలి.


ఈ మార్పులు కనిపిస్తే..

గడ్డ లేదా పుట్టుమచ్చ మార్పులకు గురవుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. లైపోమాలు నొప్పిని కలిగించవు. అలాగే క్యాన్సర్‌ కణుతులు కూడా తొలి దశలో నొప్పి కలిగించవు. కానీ పెరిగేకొద్దీ నరాలు, ఇతర వ్యవస్థల మీద ప్రభావం పడడం వల్ల తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. పైగా చికిత్సకు స్పందించని స్థితికి చేరుకుంటాయి.


స్కిన్‌ క్యాన్సర్‌ ప్రమాదం తక్కువే!

మన దేశస్తుల చర్మంలో మెలనిన్‌ ఎక్కువ కాబట్టి చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువ. పూర్తిగా నయం చేయదగిన క్యాన్సర్‌ ‘బేసల్‌ సెల్‌ కార్సినోమా’, ‘స్క్వామ్‌ సెల్‌ కార్సినోమా’. చర్మ క్యాన్సర్లలో 90% బేసల్‌ సెల్‌ కార్సినోమా రకానికి చెందినవి కావు.

 

అల్ట్రావయొలెట్‌ కిరణాల వల్ల..

50 ఏళ్లు దాటిన తర్వాత నాన్‌ మెలనోమాస్కన్‌ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలా్ట్రవయొలెట్‌ కిరణాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో శరీరాన్ని ట్యాన్‌ చేయడానికి ఉపయోగించే ట్యాన్‌ బాత్స్‌ వల్ల, బాగా తెల్లగా ఉండే వారిలో, నీలి రంగు కళ్లు కలిగిన వారిలో, పురుషుల్లో ఈ క్యాన్సర్లు కనిపిస్తూ ఉంటాయి.


ఈ మార్పు కనిపిస్తే...

ఎండకు బహిర్గతమయ్యే ప్రదేశాల్లో చర్మం రంగు మారినా, మానిపోయిన పుండు స్కిన్‌ ప్యాచ్‌లా ఉండిపోయి, రక్తస్రావం జరుగుతున్నా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. 


100 శాతం నయం చేయవచ్చు

చర్మ క్యాన్సర్లను నూటికి నూరు శాతం నయం చేయవచ్చు. క్యాన్సర్‌ సోకిన ప్రదేశాన్ని సర్జరీతో తొలగించడంతో పాటు, మిగిలి ఉన్న క్యాన్సర్‌ కణాలను కూడా లేజర్‌ చికిత్సతో నాశనం చేయవచ్చు. రేడియేషన్‌, కీమో థెరపీలు అవసరానికి తగ్గట్టు ఇవ్వడం జరుగుతుంది. చర్మ కేన్సర్లలో కేవలం వ్యాధి సోకిన ప్రదేశానికే అందేలా కీమో థెరపీని ఆయింట్‌మెంట్‌ రూపంలో అందించే సౌలభ్యం ఉంది. క్యాన్సర్‌ సోకిన చర్మ ప్రదేశం పెద్దదిగా ఉన్నప్పుడు, సర్జరీతో తొలగించిన తర్వాత, ఇతర భాగాల నుంచి చర్మాన్ని తీసి, తొలగించిన చోట గ్రాఫ్టింగ్‌ చేస్తారు.


-డాక్టర్ సీహెచ్. మోహన వంశీ

చీఫ్ం సర్జికల్ ఆంకాలజిస్ట్

ఒమేగా హాస్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

ఫోన్: 98480 11421



Updated Date - 2022-07-19T16:52:29+05:30 IST