పైలట్‌ రాజీ!

ABN , First Publish Date - 2020-08-11T07:33:49+05:30 IST

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సంక్షోభం ఎట్టకేలకు ముగింపునకు వచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్‌ పైలట్‌ చివరికి రాజీకి వచ్చారు...

పైలట్‌ రాజీ!

  • రాహుల్‌, ప్రియాంకతో సమావేశం
  • కాంగ్రెస్‌తోనే కొనసాగుతారన్న ఏఐసీసీ
  • సచిన్‌ వర్గం లేవనెత్తిన అభ్యంతరాలపై
  • త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటన
  • రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ముగిసిన సంక్షోభం!
  • వసుంధర వల్లే పైలట్‌ ‘ఘర్‌ వాపసీ’!

న్యూఢిల్లీ/జైపూర్‌, ఆగస్టు 10: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ సంక్షోభం ఎట్టకేలకు ముగింపునకు వచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్‌ పైలట్‌ చివరికి రాజీకి వచ్చారు. సోమవారం పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం.. పైలట్‌ కాంగ్రె్‌సతోనే కొనసాగుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఢిల్లీలోని రాహుల్‌ నివాసంలో జరిగిన సమావేశంలో పైలట్‌ పలు సమస్యలను వారి ముందు ఉంచారని, వాటిపై కూలంకషంగా చర్చ జరిగిందని పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, గెహ్లోత్‌ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సిన సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలోని ఈ పరిణామంతో రాజస్థాన్‌ కాంగ్రె్‌సలో సంక్షోభం ముగిసినట్లేనని భావిస్తున్నారు. అయితే పైలట్‌ గతంలో నిర్వహించిన ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవులను తిరిగి చేపట్టే అవకాశాలు లేవని, ఆయనకు రాజస్థాన్‌ వెలుపల పార్టీ పదవి అప్పగించవచ్చని తెలుస్తోంది.


అశోక్‌ గెహ్లోత్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న ప్రస్తావనే ఇక ఉండబోదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి సచిన్‌ పైలట్‌ కొద్దిరోజుల క్రితమే అధిష్ఠానంతో తిరిగి టచ్‌లోకి వచ్చినట్లు, రెండు వారాల క్రితం ప్రియాంకతో సమావేశమైనట్లు సమాచారం. దానికి కొనసాగింపుగానే సోమవారం భేటీ జరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆదివారం సీఎం గెహ్లోత్‌ నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని సూచించారు.  


వసుంధర రాజే విముఖత వల్లే..! 

సచిన్‌ పైలట్‌ రాజీ పడడానికి కారణం.. రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే సింధియా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైలట్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆమె ఆసక్తి చూపకపోవడంతో ఆయన వెనకడుగు వేయక తప్పలేదని అంటున్నారు.  ౅ తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం అశోక్‌ గెహ్లోత్‌ హీరో కావాలని ప్రయత్నించి.. విలన్‌ అయ్యారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సలో సంక్షోభంతో ప్రజలకు కలిగిన అసౌకర్యానికి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి గెహ్లోత్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో విలీనం కావడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.


Updated Date - 2020-08-11T07:33:49+05:30 IST