కనీస సౌకర్యాలు కరువు

ABN , First Publish Date - 2021-07-24T05:24:14+05:30 IST

గద్వాల మునిసిపాలిటీలోని ఏడో వార్డులో పదేళ్ల క్రితం వెలసిన పిల్లిగుండ్లకాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి.

కనీస సౌకర్యాలు కరువు
పిల్లిగుండ్ల కాలనీ

- సమస్యలతో సతమతమవుతున్న పిల్లిగుండ్ల కాలనీ 

- ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోని వైనం

గద్వాల టౌన్‌, జూలై 23 : గద్వాల మునిసిపాలిటీలోని ఏడో వార్డులో పదేళ్ల క్రితం వెలసిన పిల్లిగుండ్లకాలనీలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గద్వాల - అయిజ ప్రధాన రహదారి నుంచి మేళ్లచెరువుకు వెళ్లే రోడ్డు సమీపంలోని ఈ కాలనీలోని వెళ్లేందుకు ఇప్పటికీ సరైన రహదారి లేదు. పేరుకు మాత్రమే వేసిన ప్రధాన లింకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు నిలువ డంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాలనీలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా వేసిన పైపులైన్లు అసంపూర్తిగా ఉండడంతో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. విద్యుత్‌ సౌకర్యం కూడా సరిగా లేదు. స్థానికులు అక్కడక్కడ వేయించుకున్న విద్యుత్‌ స్తంభాలకు వీధి లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో చీకటి పడితే కాలనీ వాసులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వర్షాకాలం కావడంతో పిచ్చి మొక్కలు, కంప చెట్లు ఏపుగా పెరిగి, పాములు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీ లో అంతర్గత రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ ఎండమావిగా మారింది. ఇంటి పన్నులను క్రమం తప్పకుండా వసూలు చేస్తున్న అధికారులు, సౌకర్యాలు కల్పిం చడంలో అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 


తాగునీటి సౌకర్యం కల్పించాలి

కాలనీలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను వెంటనే పూర్తి చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. డ్రైనేజీ ఏర్పాటు చేసి ఇళ్ల ముందు మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో చేపట్టి కాలనీ అంతటా వీధి దీపాలు ఏర్పాటు చేయాలి.

- మధు, కాలనీవాసి


రోడ్డు సౌకర్యం కల్పించాలి

ప్రతి రోజు కాలనీ నుంచి పట్టణానికి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నందున ప్రధాన రోడ్డుతో పాటు కాలనీలో అంతర్గత రహదారులను ఏర్పాటు చేయాలి. రింగు రోడ్డుకు దగ్గరలోనే ఉన్నందున ఇటు మేళ్లచెరువు రోడ్డు, అటువైపు రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తూ ప్రధాన రోడ్లను అభివృద్ధి చేయాలి. 

- కేశవులు, కాలనీవాసి


అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి 

ఏడేళ్ల క్రితం మునిపాలిటీలో విలీనమైన దౌదర్‌పల్లెతో పాటు అప్పటికే వెలసిన పిల్లిగుండ్ల కాలనీలు, ఒక వార్డుగా ఉన్నందున అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టణ స్థాయి సౌకర్యాలు వస్తాయని ఆశించిన స్థానికులను పాలకులు నిరాశను మిగిల్చారు. ఈ విషయాన్ని కౌన్సిల్‌లో పలుమార్లు ప్రస్తావించాను. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్నందన అధికార పార్టీకి చెందిన వాడినైనా ఆందోళన చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

- విష్ణుప్రియ దౌలు, కౌన్సిలర్‌



Updated Date - 2021-07-24T05:24:14+05:30 IST