Abn logo
Jun 1 2021 @ 14:52PM

పైల్స్‌, కేన్సర్‌ లక్షణాలు ఒక్కటే!

ఆంధ్రజ్యోతి(1-06-2021)

జీర్ణవ్యవస్థ చివర్లో ఉండే కొలన్‌కు వచ్చే కేన్సర్‌... కొలన్‌ కేన్సర్‌! పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్‌ ఏర్పడి, వాటిలో కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే ఈ కేన్సర్‌కు కారణం. కాబట్టి కొలనోస్కోపీలో ఈ కణుతులు కనిపిస్తే తీసేయడమే మంచిది. 


మిగతా కేన్సర్ల మాదిరిగానే ఈ కేన్సర్‌కూ కచ్చితమైన కారణాలు తెలియకపోయినా, ఊబకాయం, జీన్‌ మ్యుటేషన్‌, రెడ్‌ మీట్‌ ఎక్కువగా తినడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు, పీచు పదార్థం తక్కువ తీసుకోవడం, ఇతర కేన్సర్లకు తీసుకునే రేడియేషన్‌లు ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్‌ ఎక్కువ.


కొలన్‌, కొలో రెక్టల్‌ కేన్సర్‌ లక్షణాలు

కణితి ప్రదేశం, పరిమాణం, వ్యాపించిన శరీర భాగాలు అనే అంశాలపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా అజీర్తి, విరేచనాలు, మలం, మలవిసర్జనలో మార్పులు, మలంలో రక్తం, రక్తపు చారికలు, పొత్తికడుపులో నొప్పి, పట్టేసినట్టు అనిపించడం, గ్యాస్‌ ఉండడం, మలవిసర్జన సమయంలో నొప్పి, అకారణంగా బరువు తగ్గడం, నీరసం, ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐ.బి.ఎస్‌). ఈ కేన్సర్‌ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కాలేయానికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. జీర్ణ వ్యవస్థలో సమస్యలు సాధారణ చికిత్సతో తగ్గకపోగా, ఎక్కువ అవుతున్నట్టు గమనిస్తే అప్రమత్తమై పరీక్షలు చేయించుకోవాలి.


పరీక్షలు

ఫ్యామిలీ హిస్టరీ, భౌలిక పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు కొలనోస్కోపీ, బేరియం ఎనీమా ఎక్స్‌ రే పరీక్షలు సూచిస్తారు. కొలనోస్కోపీలో కెమెరా ద్వారా మలద్వారంలోని పాలిప్స్‌ను గమనిస్తారు. కణితులు కనిపిస్తే, తొలగించి బయాప్సీ పరీక్షకు పంపిస్తారు. బేరియం ఎక్స్‌ రేలో కూడా కణితులు కనిపిస్తాయి. బయాప్సీలో కేన్సర్‌గా తేలితే దశ, గ్రేడ్‌ తెలుసుకోవడం కోసం చెస్ట్‌ ఎక్స్‌రే, అలా్ట్రసౌండ్‌, సి.టి స్కాన్‌, సి.ఇ.ఎ, అవసరమైతే పెట్‌ సి.టి స్కాన్‌ పరీక్షలు చేయవలసి ఉంటుంది. 


నివారణ

50 ఏళ్లు పైబడినవాళ్లు మల పరీక్షతో పాటు, వైద్యుల సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ చేయించుకోవాలి. మంచి ఆహారపుటలవాట్లు, జీవనశైలిని అలవరుచుకుంటే ఈ కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు. మలంలో రక్తం, పైల్స్‌ వంటివి అప్పుడప్పుడు తలెత్తే సమస్యలే అయినా, సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీలతో పాటు, వైద్యుల సలహా మేరకు ఇతరత్రా పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలాకాకుండా వేడి చేసి పైల్స్‌ వచ్చాయని నిర్ధారించుకుని సొంత వైద్యంతో సరిపెట్టుకోకూడదు. పైల్స్‌, అజీర్తి, పొట్టలో ఇన్‌ఫెక్షన్‌తో తలెత్తే లక్షణాలు కొలన్‌ కేన్సర్‌, కొలోరెక్టల్‌ కేన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు. 


చికిత్స

ప్రారంభంలో గుర్తిస్తే రాడికల్‌ సర్జరీ ఉత్తమమైనది. సర్జరీలను ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. వ్యాధి సోకిన ప్రాంతాన్ని హైడెఫినిషన్‌ కెమెరాతో గుర్తించి, కచ్చితత్వంతో సర్జరీ చేసే వీలుంది. ఓపెన్‌ సర్జరీతో పోలిస్తే, కీహోల్‌ సర్జరీతో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, కేన్సర్‌ దశ, రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా రెండు కలిపి ఇవ్వవలసి ఉంటుంది. కేన్సర్‌ను చివరి దశలో గుర్తించినా మోనోక్లోనల్‌ వంటి మందులతో రోగి జీవితకాలాన్ని పెంచే వీలుంది.


-డాక్టర్‌ సిహెచ్‌. మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

ప్రత్యేకం మరిన్ని...