సుశాంత్ మాజీ మేనేజర్ మృతిపైనా సీబీఐ విచారణ.. సుప్రీంకోర్టులో పిల్..

ABN , First Publish Date - 2020-08-06T03:38:03+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. సుశాంత్ మృతి..

సుశాంత్ మాజీ మేనేజర్ మృతిపైనా సీబీఐ విచారణ.. సుప్రీంకోర్టులో పిల్..

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. సుశాంత్ మృతి కేసులో కేంద్రం సీబీఐ విచారణకు అంగీకరించిన కొద్దిగంటలకే... అతడి మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతిపైనా సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుశాంత్ మరణానికి, దిశా మృతికి సంబంధం ఉందనీ.. రెండు కేసుల్లోనూ కోర్టు పర్యవేక్షణలో సమాంతరంగా సీబీఐ విచారణ జరగాలని పిటిషనర్ కోరారు. ఈ మేరకు వినీత్ దండా అనే న్యాయవాది సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ రెండు మరణాలకు సంబంధం ఉన్నట్టు అనుమానాలు ఉన్నందున వీటిపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించేలా ముంబై పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అలాగే బీహార్ పోలీసులు జరుపుతున్న విచారణకు సహకరించేలా ముంబై పోలీసులను ఆదేశించాలని కూడా ఆయన విన్నవించారు. దిశా కేసు ఇప్పటికే మిస్ కావడమో, డిలీట్ కావడమో జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 8న దిశ ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా.. అదే నెల 14న సుశాంత్ తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కనిపించాడు. 

Updated Date - 2020-08-06T03:38:03+05:30 IST