పందుల బెడదతో బెంబేలు

ABN , First Publish Date - 2021-01-19T05:52:30+05:30 IST

పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పందుల సంచారం విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పందుల బెడదతో బెంబేలు
దొనకొండలో సంచరిస్తున్న పందులు

దొనకొండలో విపరీతమైన పందుల సంచారం

ప్రమాదాలకు నిలయంగా ప్రదాన రహదారి

దొనకొండ, జనవరి 17 : పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పందుల సంచారం విపరీతంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పందుల బెడద ఇంకెనాళ్లు ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పాలకులు ప్రజల నుంచి పన్నులు వసూళ్లు చేస్తున్నారేగాని పందులను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోవటం లేదంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.  కొందరు పెంపకం దారులు దొనకొండ-దర్శి ప్రధాన రహదారి పక్కనే పందుల నివాసం ఏర్పాటు చేయడంతో అవి రహదారికి ఇరువైపులా సంచరిస్తూ, వాహనాలకు అడ్డుపడుతున్నాయి. వీటివలన ఈ రహదారిపై ఇప్పటికే మూడు ఆటోలు పల్టీకొట్టాయి. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనాలకు సడన్‌గా పందులు అడ్డుపడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్రామం నుంచి దూరంగా పందులను తరలించాలని పంచాయతీ పాలకులు గతేడాది పెంపకందారులకు నోటీసులు జారీ చేశారు. అయితే పెంపకందారులు పట్టించుకోలేదు. దీంతో పంచాయతీ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి పందులను పట్టుకునే వారిని పిలిపించి పందులను పట్టించే చర్యలు చేపట్టారు. అయితే పెంపకందారులు ఆగ్రహించి పంచాయతీ కార్యదర్శి, సిబ్బందిపై దాడి చేశారు. దీనిపై అధికారులు తదిపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే అందుకు అధికారులు సిద్ధ పడలేదు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని పంచాయతీ అధికారులు గతంలోనే తెలిపారు. అయినప్పటికీ స్పందన రాలేదు. నేరుగా పంచాయతీ అధికారులపైనే దాడికే యత్నిస్తేనే అధికారులు పట్టించుకోకపోతే, తాము ఫిర్యాదు చేసినా ఏమి ప్రయోజనమని సామన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించే పరిస్థితి ప్రస్తుతం లేని తరుణంలో ఉన్నతాధికారులైనా స్పందించి బందోబస్తు నడుమైనా పందులను పట్టించాని గ్రామస్థులు కోరుతున్నారు. పెను ప్రమాదాల భారిన పడి ప్రాణ నష్టం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతారట..!

దీనిపై ఎంపీడీవో కేజీఎస్‌.రాజును వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి పోయి పోలీసుల రక్షణ తీసుకొనైనా పందులను పట్టిస్తామన్నారు. అయితే పంచాయతీ సమస్యల పరిష్కారంలో కార్యదర్శిపైన ఈవోపీఆర్‌డీ, ఆ పైన ఎంపీడీవో బాధ్యతలు చూస్తారు. ఎంపీడీవో కూడా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోతానని పేర్కొనడం ఇక్కడ గమనార్హం. పంచాయతీ పరిధిలోని పందులను పట్టించడానికి పై నుంచి ఉన్నతాధికారులు ఎప్పుడు వస్తారా..? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-01-19T05:52:30+05:30 IST