మనిషికి పంది గుండె అమర్చిన అమెరికా వైద్యులు

ABN , First Publish Date - 2022-01-12T09:14:25+05:30 IST

ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు ఒక వ్యక్తి కి పంది గుండెను విజయవంతంగా అమర్చారు. ‘‘మనిషికి పంది గుండెను అమర్చడం మూడేళ్లలో సాధ్యం’’ అని బ్రిటన్‌లో తొలి గుండె మార్పిడి చేసి న ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ టెరెన్స్‌ మాటలను 6 నెలలు తిరక్కుండానే నిజం చేశారు...

మనిషికి పంది గుండె అమర్చిన అమెరికా వైద్యులు

న్యూయార్క్‌, జనవరి 11: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు ఒక వ్యక్తి కి పంది గుండెను విజయవంతంగా అమర్చారు. ‘‘మనిషికి పంది గుండెను అమర్చడం మూడేళ్లలో సాధ్యం’’ అని బ్రిటన్‌లో తొలి గుండె మార్పిడి చేసి న ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ టెరెన్స్‌ మాటలను 6 నెలలు తిరక్కుండానే నిజం చేశారు. మనిషికి పంది మూత్రపిండాలను అమర్చిన (2021 అక్టోబరు) 4 నెలల్లోపే డేవిడ్‌ బెన్నెట్‌ (57) అనే హృద్రోగికి పంది గుండెను అమర్చి సత్తా చాటారు.


జనవరి 7న డాక్టర్‌ బార్‌ట్లే నేతృత్వంలోని వైద్యుల బృందం 7 గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్‌ పూర్తి చేసింది. సోమవారానికి బెన్నెట్‌ కోలుకున్నారని, 6 వారాలుగా యంత్ర సహాయంతో జీవిస్తు న్న ఆయన ప్రస్తుతం తనంత తాను శ్వాసించగలుగుతున్నారని వారు వెల్లడించారు. 1984లోనూ బేబీ ఫే అనే చిన్నారికి అమెరికా వైద్యులు బబూన్‌ (ఒక రకం కోతి) గుండెను అమర్చగా.. ఆ పాప 21 రోజుల తర్వాత చనిపోయింది. దీనికి కారణం వేరే జీవి గుండెను అమర్చడమే. ఇలా ఒక జీవి  గుండెను మరో జీవికి అమర్చడాన్ని జీనో ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా గుండె మార్పిడి అవసరమైన వారికి బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్ల గుండెను అమర్చుతారు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయాల్సి వస్తుంది. బెన్నెట్‌ విషయంలో అదే జరిగింది. పలు ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మానవ గుండె మార్పిడికి అనర్హుడు కావడంతో పంది గుండెను అమర్చడం తప్ప వైద్యులకు మరో మార్గం లేకపోయింది. ఇది పని చేస్తే ఆయన జీవిస్తాడు. లేదా మరణిస్తాడు అనే పరిస్థితి(డూ ఆర్‌ డై సిచ్యువేషన్‌)లో వైద్యులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ చికిత్స చేశారు. అదీ నేరుగా బెన్నెట్‌పైనే వారు ఈ ప్రయోగం చేయలేదు. ఆయనకన్నా ముందు 50 బబూన్లకు పంది గుండెను అమర్చి చూశారు. ‘ఇది పనిచేస్తుంది’ అన్న నమ్మకం వచ్చాకే బెన్నెట్‌ విషయంలో ముందడుగు వేశారు. బెన్నెట్‌ రోగనిరోధక శక్తి పంది గుండెపై దాడి చేయకుండా పంది శరీరంలోని 10 జన్యువుల్లో మార్పులు చేయించారు. అలాగే.. ఆ గుండెను బెన్నెట్‌ శరీరం అంగీకరించేలా 6 కొత్త జన్యువులను జోడించారు.

Updated Date - 2022-01-12T09:14:25+05:30 IST