పీఠం..ఆరాటం!

ABN , First Publish Date - 2021-04-12T04:55:09+05:30 IST

పరిషత్‌ పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు ఏకపక్షంగా రానున్నాయి. అధికార పార్టీకి సునాయస విజయం దక్కనుంది.

పీఠం..ఆరాటం!



ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతల చుట్టూ ప్రదక్షణలు

సీనియార్టీకి అవకాశమివ్వాలని వేడుకోలు

ఎటువంటి హామీ లభించకపోవడంతో నిట్టూర్పులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

‘వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నాను. పదేళ్ల పాటు వ్యయప్రయాసలకు గురయ్యాను. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశాను. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని తిరిగాను. మీ గెలుపు కోసం కష్టపడ్డాను. నాకు ఒక్క అవకాశమివ్వండి. ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోండి.’...ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల చుట్టూ ఎంపీటీసీ అభ్యర్థులు తిరుగుతున్నారు. వారి మద్దతు కోసం పరితపిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తమ మనసులో మాట బయటకు చెప్పడం లేదు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు. మొన్నటి వరకూ మీకు సముచిత స్థానం అంటూ చెప్పుకొచ్చారని..తీరా ఆ సమయం వచ్చినప్పుడు ముఖం చాటేస్తున్నారని ఆశావహులు నిట్టూరుస్తున్నారు. 

పరిషత్‌ పోరు ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాలు ఏకపక్షంగా రానున్నాయి. అధికార పార్టీకి సునాయస విజయం దక్కనుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికల బరిలో లేకపోవడమే కారణం. బలమున్నచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో దిగారు. కొన్నిచోట్ల గెలుపొందే అవకాశమున్నా...మిగిలిన అన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులే గెలుపొందనున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా అధికార పార్టీలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి చేరిన వారు సైతం ఆశ పెట్టుకున్నారు. రిజర్వేషన్‌ కలిసిరాని మండలాల్లో వైస్‌ ఎంపీపీ పదవి కోసం పావులు కదుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లాస్థాయి నేతలను కలుస్తున్నారు. తమ సీనియార్టీని గౌరవించి పదవులు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. 


కౌంటింగ్‌ తరువాత స్పష్టత

 జిల్లాలోని 34 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 8న ఎన్నికలు జరిగాయి. 10న కౌంటింగ్‌కు తొలుత ఎస్‌ఈసీ నిర్ణయించింది. కానీ న్యాయస్థానం తీర్పుతో కౌంటింగ్‌ వాయిదా పడింది. 15 తరువాతే స్పష్టత రానుంది. గతంలో పరిషత్‌ పోరు అంటే క్యాంపు రాజకీయాలు నడిచేవి. కొన్ని మండలాల్లో అయితే అధికార, విపక్షానికి సమాన బలం ఉండేది. అటువంటి చోట్ల పిరాయింపులు, నేతల కప్పదాట్లు ఉండేవి. కానీ ఈ పరిషత్‌ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి లేదు. అధిష్టానం, స్థానిక ఎమ్మెల్యేల మాటే శిరోధార్యం. వారి సిఫారసులతోనే పదవులు దక్కనున్నాయి. దీంతో నేతలు కీలక నేతల చుట్టూ క్యూ కడుతున్నారు. ఎలాగైనా పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. 


ముద్ర కోసం ఆరాటం

ఎంపీటీసీ పదవి ఉత్సవ విగ్రహము అన్న అపవాదు ఉంది. ఎటువంటి నిధులు, అధికారులు లేవని నేతలు భావిస్తుంటారు. కేవలం ఎంపీపీని ఎన్నుకునేందుకేనని వ్యాఖ్యానిస్తుంటారు. మండల పరిషత్‌ నుంచి ఎటువంటి నిధులు విడుదలైనా.. పంచాయతీల్లో సర్పంచ్‌దే పెత్తనం. ఎంపీటీసీ సభ్యుడికి నేరుగా నిధులు ఉండవు. ఈ పరిస్థితుల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ అయితనే ప్రత్యేక ముద్ర ఉంటుందని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. అందుకే పదవుల కోసం ఎక్కువగా పావులు కదుపుతున్నారు. సామాజికవర్గాల లెక్కలు కడుతున్నారు. రిజర్వ్‌ మండలాల్లో వైస్‌ ఎంపీపీ పదవి దక్కించుకొని మండల పీఠాన్ని తమ చేతుల్లో ఉంచుకోవాలని పావులు కదుపుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడా ఎవరికీ హామీ ఇవ్వడం లేదు. అంతా అధిష్టానం నిర్ణయమేనని చెప్పుకొస్తున్నారు. తమ మాట దాటని నేతలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పేరుకే అధిష్టానం కానీ స్థానిక ఎమ్మెల్యేల సిఫారసు మేరకే పదవుల కేటాయింపు ఉండనుంది. 



Updated Date - 2021-04-12T04:55:09+05:30 IST