'పుష్ప'తో ఎందుకులే.. ఒక్కడుగు ముందుకేసిన 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్'..

'పుష్ప'సినిమాతో పాటుగా రిలీజ్ కావాల్సిన హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' ఓ అడుగు ముందుకేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను 5 భాషలలో డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక అదేరోజున 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' అనే హాలీవుడ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దాంతో బన్నీ అభిమానుల్లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు భారీ చిత్రాలు ఇలా ఒకేరోజు పోటీపడితే ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తికరంగా చర్చించుకున్నారు. అయితే, ఇప్పుడు 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' కాస్త త్వరపడి ఒకరోజు ముందే వస్తున్నట్టు తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 16వ తేదీనే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్ మరియు ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు సోనీ పిక్చర్స్ వారు కొత్త డేట్‌తో పోస్టర్స్‌ను రిలీజ్ చేసి ప్రకటించారు. కాబట్టి ఈ సినిమా ప్రభావం ఇప్పుడు 'పుష్ప'పై ఉండే అవకాశాలు తక్కువని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి రెండు సినిమాల ఫలితం ఎలా ఉంటుందో. 


Advertisement