అత్యవసర సేవలకు వైద్యులు సిద్ధమవ్వాలి

ABN , First Publish Date - 2021-04-13T08:16:12+05:30 IST

అత్యవసర సేవలకు వైద్యులు సిద్ధమవ్వాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు.

అత్యవసర సేవలకు వైద్యులు సిద్ధమవ్వాలి
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

గత ఏడాది పనిచేసిన వైద్యసిబ్బంది రేపటి నుంచి కొవిడ్‌ విధుల్లోకి రండి

మాస్కు లేకుండా ఇంటి బయటకు రావద్దని ప్రజలకు సూచన

కొవిడ్‌ ఆస్పత్రుల్లో కలెక్టర్‌ తనిఖీలు


తిరుపతి (వైద్యం), ఏప్రిల్‌ 12: ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో రానున్న మూడు నెలల్లో పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉంది. అత్యవసర సేవలకు వైద్యులు సిద్ధమవ్వాలి. అలాగే గత ఏడాది పనిచేసిన వైద్య సిబ్బంది అందరూ బుధవారం నుంచి కొవిడ్‌ విధులకు హాజరుకండి’ అని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో స్విమ్స్‌, రుయా, ప్రైవేటు ఆస్పత్రులు, పద్మావతి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వైద్యులు, అధికారులతో సోమవారం కమిషనర్‌ గిరీషతో కలిసి సమీక్షించారు. స్విమ్స్‌, రుయా, చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర సేవలు మినహాయించి, కొవిడ్‌ వైద్యసేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కొవిడ్‌ సేవలకు అవసరమైన వైద్యపరికరాలు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడా కొరత రాకూడదన్నారు. మైల్డ్‌ కేసులు మోడరేట్‌లోకి వెళ్లకుండా, మోడరేట్‌వి సివియర్‌కు మారకుండా చూడాలన్నారు. మానవ తప్పిదం వల్ల మరణాలు సంభవించకూడదని స్పష్టం చేశారు. బాధితులతో తరచూ వైద్యులు మాట్లాడుతూ ఉండాలన్నారు. అదేసమయంలో ప్రజలెవరూ మాస్కుల్లేకుండా ఇంటి బయటకు రావద్దని సూచించారు. ప్రస్తుతం రుయాలో 876, స్విమ్స్‌ స్టేట్‌ కొవిడ్‌లో 450, గుర్తించిన 10 ప్రైవేటు ఆస్పత్రుల్లో 1000 వరకు, తిరుచానూరు పద్మావతి నిలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో 1000 పడకలు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ కొవిడ్‌ సేవల్లో ప్రభుత్వ నిబంధనల మేరకే చార్జీలు ఉండాలని, ఫిర్యాదులకు అవకాశం రాకూడదని హెచ్చరించారు. పద్మావతి నిలయం కొవిడ్‌ సెంటర్‌ ఇన్‌చార్జి లక్ష్మి మాట్లాడుతూ.. 500పైగా ప్రస్తుతం అడ్మిట్‌లో ఉన్నారని, వీరికి మందులు అవసరం ఉందన్నారు. కాగా.. తిరుపతి కేంద్రంగా కొవిడ్‌ వైద్యసేవలు అందిస్తున్న, అందించనున్న పలు ఆస్పత్రులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు రైల్వేస్టేషన్‌ సమీపంలోని విష్ణు నివాసాన్ని పరిశీలించారు. అక్కడ 1100 పడకల వరకు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన 408 గదులు, 24 డార్మిటరీలు, కిచెన్‌ సదుపాయాలపై ఆరా తీశారు. టీటీడీ డిప్యూటీవో భారతి, ఏఈవో సీతామహాలక్ష్మి, మేనేజరు శంకర్‌, డీఈ జాతయ్య, అర్బన్‌ తహసీల్దార్‌ వెంకటరమణలు గత ఏడాది అందించిన కొవిడ్‌ సేవల వివరాలను తెలిపారు. సాయత్రం 4.15 గంటలకు స్విమ్స్‌కు వెళ్లిన కలెక్టర్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ వెంగమ్మ, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామ్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రిలో బంధువులకు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వివరించే కౌంటర్‌ను, ఆరోగ్యశ్రీ సేవల కౌంటర్‌ వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. అనంతరం స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో బెడ్లు పెంచడానికి ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన 150 పడకలను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో జేసీ వీరబ్రహ్మం, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామ్‌, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, నోడల్‌ అధికారి డాక్టర్‌ హరికృష్ణ, స్టేట్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ శ్రీహరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T08:16:12+05:30 IST