Sri Lanka అధ్యక్షుడి నివాసం వద్ద యువతి ఫొటోలు వైరల్.. ప్రత్యేకత ఏంటంటే?

ABN , First Publish Date - 2022-07-16T21:34:44+05:30 IST

పొరుగుదేశం శ్రీలంక (Sri Lanka) గత ఏడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగునంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా

Sri Lanka అధ్యక్షుడి నివాసం వద్ద యువతి ఫొటోలు వైరల్.. ప్రత్యేకత ఏంటంటే?

కొలంబో: పొరుగుదేశం శ్రీలంక (Sri Lanka) గత ఏడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగునంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా దేశ ప్రజలు పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలైన బియ్యం, పాలు, కూరగాయల ధరలు ఆకాశంలో సంచరిస్తున్నాయి. ఇక పెట్రోలు, డీజిల్ దొరకడం లేదు. ఉన్నా కొనలేంత ధర. దేశం ఎదుర్కొంటున్న ఈ దుస్థితికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే (Gotabaya Rajapaksa) కారణమంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆయన నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన దేశం విడిచి తొలుత మాల్దీవుల(Maldives)కు అక్కడి నుంచి సింగపూర్‌ (Singapore)కు పరారయ్యారు. తాజాగా, ఆయన రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.


అధ్యక్షుడి నివాసాన్ని ఆక్రమించుకున్న ప్రజలు కొన్ని రోజులపాటు అక్కడే మకాం వేశారు. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ మురిసిపోయారు. అధ్యక్షుడి నివాసంలో ప్రతీగదిని పర్యవేక్షిస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోయారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 


తాజాగా, మధుహన్సి హసిన్‌తారా అనే యువతి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అధ్యక్షుడి నివాసాన్ని సందర్శించిన ఆమె కొన్ని ఫొటోలు తీసుకుంది. అధ్యక్షుడి భవనంలోకి దూసుకెళ్లిన ప్రజలు ఆందోళనకు దిగుతుంటే మధుహన్సి మాత్రం ఓ టూరిస్టులా అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుకుంది. ఈ నెల 12న ఆ ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసింది. వాటికి ‘కొలంబోలో అధ్యక్షుడి నివాసం వద్ద’ అని క్యాప్షన్ కూడా తగిలించింది. మొత్తం 26 ఫొటోలను పోస్టు చేసింది. అధ్యక్షుడి భవనంలోని బెడ్‌పైన, కుర్చీలు, సోఫాల మీద కూర్చుని, కారు ముందు నిల్చుని, లాన్‌లోనూ.. ఇలా ఇల్లంతా తిరిగి తీసుకున్న ఫొటోలు అందులో ఉన్నాయి. 


ఈ ఫొటోలుపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. దేశమంతా సంక్షోభంలో చిక్కుకుని ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఫొటో షూటేంటంటూ కొందరు ఆమె తీరును తప్పబట్టారు. ‘మీరు శ్రీలంక అధ్యక్షురాలు కావాలి’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. అధ్యక్షుడి నివాసం శ్రీలంక కొత్త పర్యాటక కేంద్రంగా మారిందని కొందరంటే.. సొంతదేశాన్నే అపహాస్యం చేయడం ఏమంత బాగోలేదని మరికొందరు విమర్శించారు. ఈ పోస్టుకు 20 వేల లైకులు రాగా, వేలాది కామెంట్లు వచ్చాయి. 8 వేలమందికిపైగా ఈ పోస్టును రీషేర్ చేశారు.  

Updated Date - 2022-07-16T21:34:44+05:30 IST