కరోనా పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులు బయట తిరుగుతున్నారంటూ ఫోన్ కాల్స్..!

ABN , First Publish Date - 2020-07-03T15:00:22+05:30 IST

జీహెచ్‌ఎంసీ కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌కు కరోనా అనుమానిత కేసులకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. గతంతో పోలిస్తే కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్న కాల్స్‌ తగ్గినా.. వచ్చిన వాటిలో మాత్రం కరోనా

కరోనా పాజిటివ్ వ్యక్తి కుటుంబ సభ్యులు బయట తిరుగుతున్నారంటూ ఫోన్ కాల్స్..!

పెరిగిన కరోనా కాల్స్‌..!

కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదులు

అనుమానితులు, బయట తిరుగుతున్నారని..

అంబులెన్స్‌ల కోసం కూడా...తగ్గిన ఫుడ్‌ కాల్స్‌


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : జీహెచ్‌ఎంసీ కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌కు కరోనా అనుమానిత కేసులకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. గతంతో పోలిస్తే కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్న కాల్స్‌ తగ్గినా.. వచ్చిన వాటిలో మాత్రం కరోనా సంబంధిత కేసులు ఎక్కువగా ఉండడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ పరిధిలోని కరోనాకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం, అన్నార్తులకు భోజన సరఫరాకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. గతంలో 500-600 వరకు ఫోన్‌ కాల్స్‌ వచ్చేవి. అందులో కరోనా అనుమానిత కేసులకు సంబంధించి ఆరేడు కాల్స్‌ మాత్రమే వచ్చేవి. గురువారం కంట్రోల్‌ రూమ్‌కు 125 ఫోన్‌ కాల్స్‌ రాగా.. అందులో 25 కరోనా అనుమానిత కేసులకు సంబంధించినవి ఉన్నట్లు కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ తెలిపారు.


అంబులెన్స్‌ల కోసమూ కాల్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. 33 మంది అంబులెన్స్‌ కావాలని ఫోన్‌ చేశారు. ఇంతకుముందు ఈ తరహా కాల్స్‌ 10లోపే ఉండేవి. గతంలో ఆహారం కోసం వచ్చే కాల్స్‌ 500 వరకు ఉండగా.. ఇప్పుడా సంఖ్య గణనీయంగా తగ్గింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న 46 కుటుంబాలు ఆహారం కోసం ఫోన్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కరోనాకు సంబంధించి తమ పొరుగింట్లో ఓ వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని, హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ వ్యక్తి కుటుంబ సభ్యులు బయట తిరుగుతున్నారన్న కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని ఓ అధికారి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్య సమస్యలు తీవ్రమైన వారూ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేస్తున్నారని చెప్పారు.

Updated Date - 2020-07-03T15:00:22+05:30 IST