అమరావతిపై మాస్టర్ ప్లాన్.. కరోనా కల్లోలంలోనూ వైసీపీ సర్కారు వ్యూహాం అమలు..!

ABN , First Publish Date - 2020-04-10T18:50:16+05:30 IST

పేదలకు అమరావతిలో గృహ వసతి కల్పించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిపై మాస్టర్ ప్లాన్.. కరోనా కల్లోలంలోనూ వైసీపీ సర్కారు వ్యూహాం అమలు..!

కరోనా కల్లోలంలో.. అభిప్రాయ సేకరణం..

అమరావతిలో ఆర్‌-5 జోన్‌పై అభ్యంతరాల 

నమోదు ప్రక్రియ వివాదాస్పదం!

సీఆర్డీయే ఉద్యోగుల ఫోన్లు.. రైతుల ఆగ్రహం

అధికారులను, ఉద్యోగులను అడ్డుకుంటున్న వైనం


(ఆంధ్రజ్యోతి, అమరావతి): పేదలకు అమరావతిలో గృహ వసతి కల్పించాలన్న నిర్ణయాన్ని వేగంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు దేశమంతటా లాక్‌డౌన్‌ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో సీఆర్డీయే ఉద్యోగులమంటూ కొందరు అభిప్రాయ సేకరణ పేరిట తమకు ఫోన్లు చేస్తుండడం పట్ల భగ్గుమంటున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసులను అందజేసేందుకు వస్తున్న సీఆర్డీయే అధికారులను, ఉద్యోగులను రాజధాని గ్రామాల్లో రైతులు అడ్డుకుంటున్నారు.


నాలుగు వేలకు పైగా అభ్యంతరాలు..

ఏపీసీఆర్డీయే చట్టం ప్రకారం రాజధాని విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని పేదల గృహ వసతి కల్పనకు నిర్దేశించారు. అయితే ఏ కారణం వల్లనో దీనిని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చూపలేదు. ఆ ప్లాన్‌ ప్రకారం గృహ ప్రయోజనాలకు ఉద్దేశించిన నాలుగు జోన్లలో రాజధాని రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లుగా ఇచ్చిన నివాస స్థలాలు, ఇతర గృహాలను మాత్రమే అనుమతించాల్సి ఉంది. దీంతో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఆస్కారం లేకుండా పోయింది. రాజధానికి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వేలాదిమంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను ఇవ్వాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవకాశం కల్పించేలా కొత్తగా ఆర్‌-5 అనే ప్రత్యేక జోన్‌ను మాస్టర్‌ ప్లాన్‌లో జొప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీయే గత నెలలో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నూతన జోన్‌ ఏర్పాటుపై ఎవరికైనా అభ్యంతరాలున్నట్లయితే తెలియజేయాలని గత నెల 10 నుంచి 24వ తేదీ వరకు గడువునిచ్చింది. నాలుగు వేల మందికిపైగా రాజధాని రైతులు తమకు అభ్యంతరాలున్నాయని సీఆర్డీయేకు సమాచారమిచ్చారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో, ఆ గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. 


సీఆర్డీయే వైఖరిపై రాజధాని రైతుల్లో సందేహాలు 

ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై రైతుల అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నాలను సీఆర్డీయే అధికారులు చేపట్టారు. రైతుల అభ్యంతరాలను ఆడియో, లేదా వీడియో కాన్ఫరెన్స్‌ల రూపంలో తమకు తెలియజేయాలని ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో కొందరు ఉద్యోగులు, ఫోన్లు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా కోరుతున్నారు. నోటీసు లిచ్చేందుకూ ప్రయత్నిస్తున్నారు. అయితే తమకు ఫోన్లు చేస్తూ వివరాలడుగుతున్న వారిని ‘మీరెవరు? సీఆర్డీయేలో మీ ఉద్యోగ హోదా ఏమిటి?’ అని రైతులు ప్రశ్నిస్తున్నా వారు చెప్పడం లేదు. దీంతో రాజధాని రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించిన పలు అంశాల్లో అనుసరించిన వివాదాస్పద వైఖరి ద్వారా రాజధాని రైతుల విశ్వసనీయతను కోల్పోయిన సీఆర్డీయే, పారదర్శక విధానాల్లో కాకుండా వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌లు అంటుండడంతో రైతులు మరింతగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా కరోనా వ్యాప్తితో అంతటా భయాందోళనలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సీఆర్డీయే చేస్తున్న ఈ హడావిడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఎటువంటి దురుద్దేశాలూ లేవు.. సీఆర్డీయే ఉన్నతాధికారుల వివరణ 

ఈ అంశంపై సీఆర్డీయే ఉన్నతాధికారులను ప్రశ్నించగా రైతుల అభిప్రాయ సేకరణ ప్రయత్నాల వెనుక ఎలాంటి దురుద్దేశాలూ లేవన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఒకచోట చేరే అవకాశం లేనందునే అభ్యంతరాలను ఆడియో, వీడియోల రూపంలో తెలియజేయాలని నోటీసులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని రైతుల్లో కొందరు ఇప్పటికే తమ అభ్యంతరాలను, సూచనలను తెలియజేశారని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T18:50:16+05:30 IST