కాల్ వస్తే.. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారో మీ అకౌంట్ ఖాళీ!

ABN , First Publish Date - 2021-06-03T14:04:44+05:30 IST

వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే..

కాల్ వస్తే.. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారో మీ అకౌంట్ ఖాళీ!

హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌ : వైఫై, ఆన్‌లైన్‌ సేవలను పొందేందుకు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోమని సూచించిన సైబర్‌ నేరగాడు అతడి ఖాతాను ఖాళీ చేశాడు. మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్‌ ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్‌ చేశాడు. వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్‌ ట్యూబ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ముందుగా రూ. 10తో మొబైల్‌ నెంబర్‌కు రీచార్జ్‌ చేయాలని సూచించగా అదే విధంగా చేశాడు. కొంత సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ. 3.94 లక్షలు వేరే ఖాతాకు బదిలీ కావడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.


ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ పేరుతో.. 

సైఫాబాద్‌కు చెందిన శ్రీనివాసులు ఎస్‌బీఐ కార్డును వినియోగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ చేసిన వ్యక్తి మీ కార్డుకు ఇంటర్‌నెట్‌ బ్యాకింగ్‌ సదుపాయం లేదు. అది కావాలంటే కొత్తకార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటూ కార్డు వివరాలు తీసుకున్నాడు. వారం రోజుల వ్యవధిలో బ్యాంకు నుంచి కొత్త కార్డు వచ్చింది. ఎలాంటి ఓటీపీ రాకుండా కార్డును పిన్‌నెంబర్‌తో యాక్టివేషన్‌ చేసేలోపే తన ఖాతా నుంచి రూ.2.48 లక్షలు పోయాయంటూ సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాలను తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-06-03T14:04:44+05:30 IST