ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో ఏముంది...? నెట్టింట్లో వైరలవుతున్న వీడియో.!

ABN , First Publish Date - 2020-03-09T18:46:48+05:30 IST

సాంకేతికత ప్రపంచ దశ దిశను మారుస్తోంది. యువత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా

ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో ఏముంది...?   నెట్టింట్లో వైరలవుతున్న వీడియో.!

సాంకేతికత ప్రపంచ దశ దిశను మారుస్తోంది. యువత టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతోందో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటోంది. అయితే.. కొంతమంది సోషల్‌ మీడియాను ఆసరాగా చేసుకొని అసత్యాలను ఎక్కువగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫొన్‌ బ్యాక్‌ కవర్‌ గురించి ఒక వార్త నెట్‌లో చక్కర్లు కొడుతోంది. యువతను తప్పుదోవ పట్టిస్తున్న వైరల్ వీడియో గురించి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...


టెక్నాలజీ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ల విప్లవంతో యువత అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తోంది. తగ్గిన ఇంటర్నెట్ ఛార్జీల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. మితిమీరిపోతున్న సోషల్ మీడియా సైట్లకు అలవాటు పడిన యూత్.. నిజమేదో.. అబద్ధమేదో.. తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నోఅసత్యాలు, తప్పుడు వార్తలు అతి తక్కువ సమయంలో ప్రజల్లోకి వెళ్లి.. వారిలో లేనిపోని సందేహాలను కలిగిస్తున్నాయి. దీనివల్ల ప్రజల్లో ఎన్నో అపోహలు, భయాలు నెలకొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన నిరాధార వార్తలను, ప్రచారాలను నమ్మొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌గా అవుతోంది. ఫోన్ బ్యాక్ కవర్ పై ఉన్న ఇక చిప్ మీ వ్యక్తిగత విషయాలు, అకౌంట్ వివరాలు.. పాస్ వర్డ్‌లు తీసుకొని ఫోన్లు తయారు చేసే సంస్థకు చేరవేస్తుందనేది ఆ వీడియో సారాంశం. ఆ సెల్ ఫోన్ కంపెనీ మీ వివరాలన్నీ తెలుసుకుంటోందనేది వీడియోలోని వ్యక్తి చెప్తున్న మాట. ఈ వీడియోని చూసిన కొంత మంది అదంతా నిజమే కాబోలు అనుకుంటున్నారు. కానీ అదంతా అసత్యమని నిపుణులు చెబుతున్నారు. ఆ చిప్ లాంటి అమరికను ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీ యాంటీనా అని పిలుస్తారు. ఆ యాంటీనా... దగ్గర దగ్గరగా ఉన్న రెండు ఫోన్లను ఒకదానితో మరొకటి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ.. డేటా మార్పిడి.. డివైజ్ పెయిరింగ్.. మొబైల్ పేమెంట్స్ వంటివి చేయడానికి ఉపయోగపడుతుంది. 



ఇక బ్యాక్‌కవర్‌పై కనిపిస్తున్న చిప్ లాంటి యాంటీనాను ఎన్‌ఎఫ్‌సీ అంటారు. ఎన్‌ఎఫ్‌సీ అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అని అర్థం. అతి సమీపంలో ఉన్న రెండు ఫోన్లు రేడియో కమ్యూనికేషన్ ద్వారా కనెక్ట్ అయ్యే టెక్నాలజీ. ఇది కొన్ని ఫోన్లకు బ్యాక్ కవర్లలో ఉంటే.. మరికొన్ని ఫోన్లలో వైర్‌లెస్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. ఫోన్‌లో ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ యాక్టివేట్ అవుతుంది. దీంతో డేటాను షేర్‌ చేసుకోవడంతో పాటు నగదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ టెక్నాలజీ కొన్ని ఫోన్లలో బ్యాక్ కవర్‌పై ఉంటే.. మరి కొన్నింటిలో బ్యాటరీపై ఉంటుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి..వైర్‌లెస్‌ సెట్టింగ్స్‌లో ఈ టెక్నాలజీని ఎనేబుల్ చేసుకోవచ్చు. 



ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ గురించి కొంత మందికి అవగాహన లేక లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. సమాచారమంతా ఫోన్‌ విక్రయ సంస్థలకు చేరుతోందని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. అలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధారాలు లేకుండా పోస్ట్‌ చేసే వీడియోలను పట్టించుకోవద్దని.. సోషల్‌ మీడియాలో అన్ని వాస్తవాలు ఉండవని చెబుతున్నారు.

 

Updated Date - 2020-03-09T18:46:48+05:30 IST