దార్శనిక పురోగామి

ABN , First Publish Date - 2021-05-24T09:56:24+05:30 IST

కె.కె.ఆర్‌. సారస్వత పరిషత్తులో, కేంద్రీయ విశ్వవిద్యా లయంలో ఎందరో శిష్యులకు సాహిత్య జీవన మార్గదర్శి. వారి పుస్తకాల పఠన నేపథ్యంతో ఎందరికో అలౌకిక సాంగత్యం....

దార్శనిక పురోగామి

కె.కె.ఆర్‌. సారస్వత పరిషత్తులో, కేంద్రీయ విశ్వవిద్యా లయంలో ఎందరో శిష్యులకు సాహిత్య జీవన మార్గదర్శి. వారి పుస్తకాల పఠన నేపథ్యంతో ఎందరికో అలౌకిక సాంగత్యం. ఉద్యమాలపరంగా మరెందరికో హార్థిక సాన్నిహిత్యం. పాత తరానికి, కొత్తతరానికి ఆయన విమర్శ, పరిశోధన గ్రంథాలు ‘తెలుగు సాహిత్యం మరోచూపు’, ‘చారిత్రక భూమిక’, ‘ఆధునిక సాహిత్యం విభిన్న ధోరణలు’ వంటివి వారధులు. ఈనాటికీ విమర్శనారంగంలో చారిత్రక దృక్కోణానికి దిక్సూచులు. 


కె.కె.ఆర్‌. పాఠం చెప్పినా, ఉపన్యాసం చేసినా వైవిధ్యం గానే ఉంటుంది. ముఖం మీద చిరునవ్వు. కళ్లల్లో ఏదో తెలియని ఆకర్షణ. చిన్నచిన్న కాగితాల మీద నోట్స్‌ రాసుకొని వస్తారు. ఆ కాగితాల్లో ఆయన రెఫెర్‌ చేసిన పుస్తకాల ఫుట్‌ నోట్స్‌లు, విద్యార్థులకు చెప్పాల్సిన ముఖ్యమైన వాక్యాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు పాత జ్ఞానానికి, కొత్త ఆవిష్కర ణలను జోడిస్తారు. ద్రవిడ భాషలకు తెలుగులో పి.ఎస్‌. సుబ్రహ్మణ్యం పుస్తకం ప్రామాణికంగా భావిస్తారు అందరూ. కానీ కె.కె.ఆర్‌. ఆ తర్వాత వచ్చిన మార్పులను, భాషాశాస్త్ర పరిణామాన్నీ వివరిస్తారు. సమాంతర సాహిత్యాన్ని, సమకాలీన భావజాలాన్ని తరగతిగదిలోకి తీసుకొస్తారు. ఆధునికోత్తరవాదాన్ని, దానిపై ఎలా పరిశోధనలు చేయాలో... 1999లోనే పాఠ్యాం శంగా బోధించిన ఘనత వారిది. ఎక్కడా తడబాటు, తొట్రు పాటు లేకుండా నది నిశ్చలంగా మున్ముందుకు ప్రవహించే తీరులా సాగుతుంది వారి బోధన. ఒక్కోసారి వారు చెప్పిన పాఠాల లోతులు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తిరగేసినా దొరకవు. 


పరిశోధనలు చేయించే విధానంలో ఆయన- అభిలాష, ప్రభావాల కన్నా పరిశోధకుని ప్రతిభ, ఇష్టాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడా కల్పించుకోరు. కేవలం సూచనలు, సలహాలు మాత్రం చేస్తారు. అవసరమైన మార్గాలను పరిశోధకులకు సుగమం చేస్తారు. కొత్త ఆవిష్కరణవైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. బలవంతం చేయడం, ఇదే రాయి, ఇలా రాయమని ఒత్తిడి చేయడం అసలు ఉండదు. ప్రతి వాక్యాన్ని, పదాన్ని చదువుతారు. అవసరమైతేనే దిద్దుతారు. విద్యార్థి స్థాయిని బట్టే పరిశోధనాంశాన్ని ఎన్నుకునేందుకు సాయం చేస్తారు. పరిశోధకుడు కాపీలు చేస్తే... ఇది పలానా వాళ్ల వాక్యం, పలానా పుస్తకంలోనిది అని చెప్పగల పఠనానుభవం వారిది.


కె.కె.ఆర్‌. వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని స్వీకరించే విశాలత్వం మనకు ఉండాలి. ఉబుసు పోని కబుర్లు వారి దగ్గర దొరకవు. ప్రపంచ పోకడల నుంచి, తాత్విక సిద్ధాంతాల నుంచి, ఉద్యమాల నుంచి, వర్తమాన పరిస్థితుల నుంచి, సాహిత్యం, భాషా విషయాల గురించి స్పష్టంగా మాట్లాడతారు. ఎప్పటికప్పుడు తననుతాను అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటారు. సార్‌ ఈ పుస్తకం చదివారేమో అన్న అను మానం అక్కర్లేదు. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఆయన నిత్య పఠనశీలురే. హైదరా బాదులో దొరకని పుస్తకాలను, ఇతరదేశాల నుంచి తెప్పిం చుకుని చదవేవారు. 


‘‘ఆధునిక సాహిత్యం అర్థంకావాలంటే, ఆధునిక సమా జాన్ని అర్థం చేసుకోవాల’’ని పదేపదే చెప్పేవారు. ‘‘సాహి త్యాన్ని సాహిత్యంగా కాదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక కోణాల నుంచి చూడాల’’ని గుర్తు చేసేవారు. వర్గం, కులం, మతాలపై సార్‌కు తీవ్రమైన నిరసన. అలాగని ఆదర్శాలు చెప్తూ, పాటించని వారిపై ఏహ్యభావనాన్ని ప్రకటించేవారూ కాదు. తన భావజాలాన్ని బయపెట్టేవారు కాదు. పాఠాన్ని పాఠంగా చెప్పేవారు. కాళి దాసు మేఘసందేశం అయినా, ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలైనా, సాహిత్య చరిత్ర అయినా దార్శనికతతో, ఆధునికంగా వాటిని ఎలా అర్థం చేసు కోవాలో ఇట్టే విద్యార్థులకు తెలిసిపోయేది. వారికున్న సాహిత్య ఉద్యమకారుల పరిచయాలు, సిద్ధాంతాల వెలుగులు బయటపడని చ్చేవారు కాదు. కానీ, నాలుగు తరాల కవులు, కథకులు, విమర్శకులతో వారికి పరిచయాలు ఉండేవి. వారి రచనల్లో తార్కికమైన చూపు ఉండేది. ముఖ్యంగా 1970ల తర్వాత వచ్చిన సాహిత్యకారులు, రచనలు, ఉద్యమాలపై సార్‌కు నిర్దిష్టమైన తాత్విక సిద్ధాం తాలతో కూడిన అవగాహన ఉంది. అది కేవలం చారిత్రకమైందే కాదు, అన్ని దృక్కోణాలకు సంబంధించినది. అందుకే ఉద్యమం, ధోరణి, వాదం... వీటి మధ్య ఉన్న భేదాలను వాటికి అన్వయించి చూపారు. ‘‘ఈ రోజుల్లో రాయాలన్నా, మాట్లాడాలన్నా లోలోపలే సెన్సార్‌ చేసుకొని మరీ బయటకు వ్యక్తీకరించాల’’ని వర్తమానంలోని భావప్రకటనా స్వేచ్ఛ గురించి అన్నారు.  


జీవించడం అంటే ఎవరూ చెరపలేని కొన్ని గుర్తులను ఇక్కడ పదిలపరిచడం. ఆ పని కచ్చితంగా కె.కె.ఆర్‌. సార్‌ చేశారు. 80 ఏళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏమి నిర్ణయించుకున్నారో, ఎలా జీవించాలనుకున్నారో అలాగే బతక డానికి ప్రయత్నించారు. వారి వ్యక్తిత్వం నుంచి, మాటల నుంచి, రాతల నుంచి ఎంతో ఇచ్చారు. ఇప్పటికీ వారి రచనలు కరెక్టుగా విప్పగలిగితే అమూల్యమైన జ్ఞాన నిధులెన్నో దొరుకు తాయి. ఇప్పుడు వాటి లోతులు తవ్వాల్సి ఉంది. ఖాళీలు పూరించాల్సి ఉంది. 

ఓ శిష్యుడు

ఎ. రవీంద్రబాబు

80086 36981


ఎంతమందికో తెలియని మహావ్యక్తి

ఆయన్ని ఇంకా పిలుద్దామ నుకుం టున్నాను. కాని ఇక్కడ నేనున్న పల్లెటూళ్లో సెల్‌ ఫోన్లు సరిగ్గా పనిచెయ్యవు. ఇంటర్నెట్‌ దొరకదు. అవి అలావుంచి ఆయన టెలిఫోను నంబరు నాకు తెలియదు. ఎవర్ని అడిగితే తెలు స్తుందా అని ఆలోచిస్తున్నాను. ఆయనతో మాట్లాడాలి. ఇలా కాలం గడిపెయ్యకూడదు. ఇవాళ ఏమైనా ఆయన నంబరు పట్టుకుని ఆయనతో మాట్లాడాలి. - అనుకుంటూ ఆంధ్రజ్యోతి తెరిచాను. మొదటి పేజీలో ఎడంపక్క ఆయన బొమ్మ. కన్నీళ్లు ఆపుకో లేకపోయాను. నేను ఇవాళో రేపో పిలిచి మాటా ్లడదామనుకునే ఆయన అకస్మాత్తుగా వెళ్లిపోవడం ఏమిటి! లేదు ఇందులో ఏదో తప్పుంది. అను కుంటూ మళ్లీ మళ్లీ చదివాను. కన్నీళ్లు కష్టం మీద ఆపుకుని పడుకుని ఆలోచించడం మొద లుపెట్టాను. 


కె.కె.ఆర్‌ తన రచనల్లో కన్నా మాటల్లో ఎక్కువ కనిపిస్తాడు. తెలుగులో, సంస్కృతంలో ఆయన చదవని పుస్తకం లేదు. వాటిని గురించి తన ఆలోచ నలు చాలా క్లుప్తంగా, అంత తేలికగా దొరకని వాక్యాలలో రాస్తారాయన. ఎక్కడా ఇది నేను చేసిన విశ్లేషణ, ఇది నా సిద్ధాంతం అని అనరా యన. కాని మాటల్లో ఇంకా హాయిగా మాట్లాడతారాయన. అందుకే హైదరాబాదు వచ్చినప్పుడల్లా పనిగట్టుకుని ఆయన ఇంటికెళ్లి, కనీసం ఒక గంటసేపైనా మాట్లాడే వాణ్ణి. 


ప్రమిదలో దీపం పెట్టినప్పుడు అది గాలికి ఆరిపోతుందే మోనని రెండు అరచేతులూ అడ్డంపెట్టడం మనకు తెలుసు. కాని ఆయన తన అరచేతుల్లోని దీపం ఇతరులకి కనిపిస్తుం దేమోనని అడ్డంపెట్టినట్టు అనిపిస్తాయి ఆయన రాసిన వాక్యాలు. 


కాని ఆయన మాట్లాడేటప్పుడు విశ్రాంతిగా, విశేషంగా, సంతోషంగా మాట్లాడేవారు. అందుకే వీలు దొరికినప్పుడల్లా ఆయనతో మాట్లాడేవాణ్ని. ఆయన మార్క్సిస్టు అని చాలామంది అనడం నేను విన్నాను. ఆయనకి మార్క్సిజమ్‌ ఎంత తెలుసో నాకు తెలియదు. కాని ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలలో పసిరిక పాత్ర గురించి ఎంతో ఆలోచనతో మాట్లాడడం వింటే ఆయన ఏ పుస్తకాన్ని గురించైనా ఎంత సూక్ష్మంగా విశ్లేషణతో చదువుతారో నాకు బోధపడేది. కాని ఆయనలో మార్క్సిస్టు భావాలు ఉన్నాయి. వాటిని ఆయన తన తొలి సమాజ కవులని గురించి రాసిన వ్యాసంలో కన్నా మాటల్లో ఎక్కువ బాగా చెప్తారు. ఆయన ఏ సిద్ధాంతాన్ని చెక్కపడిగా అర్థం చేసుకోలేదు, అమలు చెయ్యలేదు. 


ఆయన దగ్గర చదువుకుని, ఆయనతో అను బంధాన్ని చదువు అయిపోయిన తరువాత కూడా కొనసాగిస్తున్న ‘‘విద్యార్థులు’’ ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రభావం స్నేహంగా మారడానికి ఆయనే అవకాశం ఇచ్చారని వాళ్ల మాటలు వింటే తెలుస్తుంది. 


కె.కె.ఆర్‌ తన గొప్పతనాన్ని పైకి కనిపించనీ కుండా గుంభనగా ఉంచుకుని ఎవరికి ఎంత అందించాలో అంతే అందించిన ప్రజ్ఞావంతుడు. ఆయన అద్దంలో కొండలాంటి మనిషి. ఎవరూ తనని పట్టించుకోకపోతే, అంతకన్నా తనకి కావలిసిందేముందని హాయిగా జీవించిన జ్ఞానఖని. తెలుగు దేశంలో ఆయనలాంటివాళ్లు ఎవరూ లేరు. ఆయనొక్కడే ఉన్నారు. / ఇప్పుడు ‘‘ఉండేవాడు’’ అని రాయవలసి రావడం నాకు మనస్కరించడం లేదు. 


అంత నిరాడంబరంగా, ఎప్పుడూ తెరవెనకే ఉండే తెలివైనవాడుగా ఆయన్ని గుర్తించగలిగే వారు ఆయనతో కావాలని సన్నిహితంగా మెలిగిన వారే. ఆయన తనకి దగ్గరికి వొచ్చేవాళ్లని దూరమూ చేసుకోలేదు. దూరంగా వుండేవాళ్లని దగ్గరికీ తీసుకోలేదు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి నేను ఏమీ ఎరగను కాని, ఆయనకి తను జీవిస్తున్న వ్యవస్థ మీద ఏ గౌరవమూ లేదు. దాన్ని ఆయన నిశ్శబ్దంగా నిరాకరించాడు. నిరా కరించాడని ఆయన మాటల్లో తెలుస్తుంది. చేతల్లో ఇంకా స్పష్టంగా తెలియొచ్చుకాని, వాటిని గురించి నాకెక్కువ తెలియదు. తెలిసిందల్లా ఆయన మాటల్లో వెచ్చదనం. అందుకోసమే ఆయనతో మాట్లాడడానికి ఆరాటపడేవాణ్ణి. ఇప్పటికీ హైదరా బాదు వెళ్తే ఆయన ఇంటికి వెళ్తాననే ఉద్దేశ్యం. ఆయన మాటలు వింటాననే ఆశ. 

వెల్చేరు నారాయణరావు


Updated Date - 2021-05-24T09:56:24+05:30 IST