అమెరికాలో మరో నల్లజాతీయుడిని హతమార్చిన పోలీసులు

ABN , First Publish Date - 2020-10-28T06:36:38+05:30 IST

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు కొద్ది నెలల క్రితం పోలీసుల చేతిలో మరణించిన విషయం విధితమే. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికా అట్టుడికిపోయింది. అమెరికానే కాకుండా ప్రపంచదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనను ఇంకా మరువక ముందే అమెరికాలో మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు..

అమెరికాలో మరో నల్లజాతీయుడిని హతమార్చిన పోలీసులు

ఫిలాడెల్ఫియా: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడు కొద్ది నెలల క్రితం పోలీసుల చేతిలో మరణించిన విషయం విధితమే. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికా అట్టుడికిపోయింది. అమెరికానే కాకుండా ప్రపంచదేశాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనను ఇంకా మరువక ముందే అమెరికాలో మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. పెన్సిల్‌వేనియాలోని ఫిలాడెల్ఫియాలో వాల్టర్ వాలస్ అనే నల్ల జాతీయుడిని పోలీసులు నడిరోడ్డుపై కాల్చి చంపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవడంతో దక్షిణ ఫిలాడెల్ఫియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. 


వాల్టర్ వాలస్ హత్యను ఖండిస్తూ అనేక మంది రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్లకు, పోలీస్ కార్లకు, దుకాణాలకు నిప్పంటిస్తున్నారు. పోలీసులపై నిరసనకారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు 30 మందికి పైగా పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడులకు కారణమైన దాదాపు వంద మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అసలేం జరిగిందంటే..

ఫిలాడెల్ఫియాలోని లోకస్ట్ స్ట్రీట్‌లో ఓ వ్యక్తి ఆయుధంతో తిరుగుతున్నాడంటూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చేతిలో కత్తితో ఉన్న వాల్టర్‌ను గమనించారు. కత్తి కింద పడేయమంటూ హెచ్చరించారు. వాల్టర్ వాలస్ కత్తిని కింద పడేయకపోవడంతో.. ఇద్దరు పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నల్ల జాతీయుడు వాల్టర్ వాలస్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కాల్పులు జరిపడంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే స్థానికులు రోడ్డెక్కి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 


సోమవారం సాయంత్రం నుంచి ఫిలాడెల్ఫియాలో పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. సోమవారం అర్థరాత్రికి ఈ నిరసనలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే అనువుగా అనేక మంది దుకాణాల్లోకి దూరి దోపిడీకి పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసులపై నిరసనకారులు వ్యక్తిగత దాడికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఫిలాడెల్ఫియా పోలీస్ కమిషనర్ డేనియల్ ఔట్లా తెలిపారు. ఘటనకు చెందిన వీడియోను చూస్తుంటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. స్థానికుల్లో ఏర్పడ్డ ప్రతి ఒక్క ప్రశ్నకు దర్యాప్తు ద్వారా సమాధానమిస్తామని ఆమె చెప్పారు. 

Updated Date - 2020-10-28T06:36:38+05:30 IST