సైకిల్ రైడ్: బట్టలు అక్కర్లేదు.. మాస్క్ మాత్రం తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-06-14T23:08:44+05:30 IST

ఫిలడెల్ఫియాలో ప్రతి యేటా జరిగే `నేక్‌డ్ బైక్ రైడ్` అమెరికా వ్యాప్తంగా సూపర్ పాపులర్.

సైకిల్ రైడ్: బట్టలు అక్కర్లేదు.. మాస్క్ మాత్రం తప్పనిసరి!

ఫిలడెల్ఫియాలో ప్రతి యేటా జరిగే `నేక్‌డ్ బైక్ రైడ్` అమెరికా వ్యాప్తంగా సూపర్ పాపులర్. ఈ రైడింగ్‌లో పాల్గొనేవారు నగ్నంగా సైకిల్ తొక్కాలి. ఈ ఏడాది ఆగస్ట్ 28న ఈ రైడింగ్ జరగనుంది. అయితే నిర్వాహకులు ఈ ఏడాది ఓ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు. అదేంటంటే.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. 


అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ఫిలడెల్ఫియా నగరం గతేడాది కరోనా వైరస్ కారణంగా వణికిపోయింది. దాంతో కరోనా ప్రోటోకా‌ల్లో భాగంగా మాస్క్‌ను తప్పనిసరి చేశారు. ఆ సమయంలోనే ఈ రైడింగ్‌కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. దీనిలో పాల్గొనేవారందరూ మాస్క్ ధరించాలని షరతు విధించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పెరగడం, కేసులు తగ్గడం వంటి కారణాలతో ఫిలడెల్ఫియాలో మాస్క్ నిబంధనను సడలించారు. అయినా ఈ నిర్వాహకులు మాత్రం గతంలో ప్రకటించిన నిబంధనతోనే ముందుకు వెళుతున్నారు. 


ప్రతి యేటా జరిగే ఈ రైడింగ్‌లో వేల మంది పాల్గొంటారు. ఒక పార్క్‌లో చేరి బట్టలు విప్పేసి పెయింటింగ్ వేసుకుని రైడింగ్ ప్రారంభిస్తారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడకూడదని చెప్పడం, సైక్లిస్టుల భద్రత గురించి ఆలోచించాలని సూచించడం, శరీరం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పడం ఈ రైడింగ్ ముఖ్య ఉద్దేశాలు. నగ్నంగానే ఫిలడెల్ఫియా నగర వీధుల్లో గుంపులుగా రైడింగ్ చేస్తారు. 

Updated Date - 2021-06-14T23:08:44+05:30 IST