దృగ్విషయం స్త్రీ

ABN , First Publish Date - 2021-06-28T06:33:56+05:30 IST

నా రహస్యం ఎక్కడ దాగుందా అని సొగసైన స్త్రీలూ విస్మయపడతారు నేనంత ఆకర్షణీయంగా ఉండను...

దృగ్విషయం స్త్రీ

నా రహస్యం ఎక్కడ దాగుందా అని 

సొగసైన స్త్రీలూ విస్మయపడతారు 

నేనంత ఆకర్షణీయంగా ఉండను 

సొగసుగత్తెల కొలతలకు తగ్గ శరీరమూ లేదు 

కానీ ఇవేమీ లేవని నేను చెప్పడం మొదలుపెడితే 

నేను అబద్ధాలు చెబుతున్నానని వారనుకుంటారు 

అప్పుడు చెపుతాను నేను 

ఆ రహస్యం... 

నా బాహువులకి చేరువలో 

నా జఘనాల విస్తృతిలో

అంగల్లాంటి నా నడక రీతిలో 

నా పెదవుల వంపులో ఉందని!

ఎందుకంటే 

దృగ్విషయంగా 

నేనొక మహిళని 

విలక్షణమైన మహిళ ఎవరంటే...

అది నేనే!


నీకున్నంత నిబ్బరంతో 

నేనా మనుషులున్న గదిలోకి అడుగుపెడతాను 

వారంతా లేచి నిలబడతారు 

లేదంటే

మోకాళ్ళపై సాగిలపడతారు 

తేనెతుట్టెలోని తేనెటీగల్లా 

నా చుట్టూ ముసురుతారు 

అప్పుడు చెపుతాను నేను 

ఆ రహస్యం... 

నా కంటి వెలుగులో 

నా పంటి మెరుపులో 

నా నడుము డోలికలో 

నా అడుగుల లయలో ఉందని! 

ఎందుకంటే 

దృగ్విషయంగా 

నేనొక మహిళని 

అసాధారణ మహిళ ఎవరంటే...

అది నేనే!


నాలో ఏమి చూశామా అని 

మగవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే ఆశ్చర్యపోతారు 

నా హృదయాంతరపు రహస్యాన్ని 

తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు 

కానీ వాళ్ళు దాన్ని తాకలేరు 

నేను చూపించడానికి ప్రయత్నించినప్పటికీ 

కనిపించలేదనే అంటారు వాళ్ళు 

అప్పుడు చెపుతాను నేను 

ఆ రహస్యం... 

విల్లులాంటి నా వెన్నులో 

సూర్యకాంతి లాంటి నా నవ్వులో 

నా ఎద యొక్క ఉన్నతిలో 

నా ప్రవర్తనలోని ఆకర్షణలో ఉందని!

ఎందుకంటే 

దృగ్విషయంగా 

నేనొక మహిళని 

అద్భుతమైన మహిళ ఎవరంటే... 

అది నేనే !


ఇప్పుడు అర్థమయ్యిందా నీకు 

నేనెందుకు ఎప్పుడూ తలవంచనో 

నేను కేకలు వేయను చిందులూ వేయను 

అసలు గట్టిగా అరచి కూడా చెప్పను 

నేను నీ ముందుగా నడచి వెళ్లడమే 

నీకు గర్వ కారణం 

అప్పుడు చెపుతాను నేను 

ఆ రహస్యం... 

నా మడమల ప్రతిధ్వనిలో 

నా కేశాల మెలికల్లో 

నా అరచేతిలో 

నాకవసరమైన సంరక్షణ దాగి ఉందని!

ఎందుకంటే 

దృగ్విషయంగా 

నేనొక మహిళని 

విలక్షణమైన మహిళ ఎవరంటే...

అది నేనే...

మూలం: మాయా ఏంజెలో

స్వేచ్ఛానువాదం: ఉమా నూతక్కి


బొమ్మలు: చారి.పి.ఎస్‌


Updated Date - 2021-06-28T06:33:56+05:30 IST