సీసీ నిఘాలో పీహెచ్‌సీలు!

ABN , First Publish Date - 2022-06-03T05:30:00+05:30 IST

క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, పీహెచ్‌సీలను పటిష్టపరిచే చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది.

సీసీ నిఘాలో పీహెచ్‌సీలు!


  • ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడేసి సీసీ కెమెరాలు
  • ఓపీ వార్డు, ల్యాబ్‌, ఫార్మసీ గదుల్లో ఏర్పాటు
  • నిర్వహణ బాధ్యతలు ఈసీఐఎల్‌కు అప్పగింత
  • ఈనెలాఖరులోగా ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు 

క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, పీహెచ్‌సీలను పటిష్టపరిచే చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది.  డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రతి పీహెచ్‌సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని  సర్కారు నిర్ణయించింది. ఈ కెమెరాలను హైదరాబాద్‌లోని  ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం  చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏ పీహెచ్‌సీలో ఎవరు ఏమి చేస్తున్నారనేది వారు ఉన్న చోటు నుంచే పర్యవేక్షించనున్నారు.

వికారాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించే వైద్య సేవలు మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాదిరిగా పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించే విధంగా ప్రయత్నాలు చురుకుగా కొనసాగుతున్నాయి. పీహెచ్‌సీలను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు సిబ్బంది నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో పీహెచ్‌సీల్లో పని చేస్తున్న సిబ్బందిలో కొందరు సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఎప్పుడు విధులకు వస్తున్నారో... ఎప్పుడు తిరిగి వెళుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో పీహెచ్‌సీల పని వేళల్లో ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టింది. ఈ సమయంలో డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ప్రతి పీహెచ్‌సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉన్నాయి. పీహెచ్‌సీలో ఔట్‌ పేషెంట్ల (ఓపీ)కు వైద్య సేవలు అందించే గది, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రూం, ఫార్మాసిస్ట్‌ గదిలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఏర్పాటు చేసే కెమెరాలను హైదరాబాద్‌లోని ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఏ పీహెచ్‌సీలో ఎవరు ఏమి చేస్తున్నారనేది వారు తాము ఉన్న చోటు నుంచే పర్యవేక్షించనున్నారు. బాగా పని చేసే వారిని ప్రోత్సహించడం, విధులను నిర్లక్ష్యం చేసే వారిని తమ పనితీరు మార్చుకునేలా హెచ్చరించనున్నారు. 

  • డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, పీవోల వాహనాలకు జీపీఎస్‌ 

వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులపై పర్యవేక్షణ పెరిగేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో డీఎంహెచ్‌వోతో పాటు తొమ్మిది మంది డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులు ఉన్నారు. వారిలోఎవరు ఎక్కడికి వెళుతున్నారో సంబంధిత జిల్లా అధికారికే తెలియకుండాపోతోంది. తమకు కేటాయించిన విభాగాలపై వారి అజమాయిషీ కొరవడి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉండాల్సిన అధికారులు హైదరాబాద్‌, తదితర దూర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నట్లు ఉన్నతాధికారులు తమ పరిశీలనలో గుర్తించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రాం అధికారులపై పర్యవేక్షణ పెంచేందుకు వారి వాహనాలకు జీపీఎస్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏ అధికారి ఏ రోజు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడ ఎంత సేపు ఉన్నారనేది జీపీఎస్‌ ద్వారా గుర్తించనున్నారు. ఫలితంగా అధికారుల్లో జవాబుదారీతనం పెరిగి ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చేరుకోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యం

జిల్లాలో ఇంతకు ముందు పలు పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపం కారణంగా చాలా వరకు పీహెచ్‌సీల్లో సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. అయితే ఈసారి పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షించే బాధ్యతలను థర్డ్‌ పార్టీకి అప్పగించారు. పీహెచ్‌సీల్లో బిగించిన మూడు సీసీ కెమెరాల్లో అన్ని కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయా, లేదా ? అనేది ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల డాక్టర్లు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజల్లో నమ్మకం పెరగడం, పీహెచ్‌సీల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఏర్పడనుంది. 

Updated Date - 2022-06-03T05:30:00+05:30 IST