ప్చ్‌.. పీహెచ్‌సీలు

ABN , First Publish Date - 2022-05-16T05:26:34+05:30 IST

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు మండల పరిధిలోని రాజేంద్రపాలెం, కంఠారం, యు.చీడిపాలెం, డౌనూరు, కృష్ణాదేవీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణకు 2020 సంవత్సరం చివరిలో నాడు- నేడు పథకం కింద రూ.3.39 కోట్లు మంజూరయ్యాయి.

ప్చ్‌.. పీహెచ్‌సీలు
మరమ్మతులు పూర్తి కాకుండా రంగులు వేసిన రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

- ఐదు పీహెచ్‌సీల ఆధునికీకరణకు రూ.3.39 కోట్లు మంజూరు

- ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభం

- మూడు నెలలుగా నిలిచిన పనులు

- డౌనూరు మినహా మిగతావి అసంపూర్తి

- వైద్య సిబ్బంది, రోగులకు తప్పని ఇబ్బందులు


కొయ్యూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) ఆధునికీకరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మూడు నెలలుగా పనులు జరగక అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం నిధులు మంజూరై పనులను ప్రారంభించగా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ఎప్పటికి ఈ పనులు పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి. దీని వల్ల వైద్య సిబ్బంది, రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.


కొయ్యూరు, మే 15: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాగా ఉన్నప్పుడు మండల పరిధిలోని రాజేంద్రపాలెం, కంఠారం, యు.చీడిపాలెం, డౌనూరు, కృష్ణాదేవీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునికీకరణకు 2020 సంవత్సరం చివరిలో నాడు- నేడు పథకం కింద రూ.3.39 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో కంఠారం పీహెచ్‌సీకి రూ.62 లక్షలు, యు.చీడిపాలేనికి రూ.71 లక్షలు, రాజేంద్రపాలేనికి రూ.38 లక్షలు, డౌనూరుకు రూ.31 లక్షలు, కృష్ణాదేవీపేట పీహెచ్‌సీకి రూ.1.37 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రన్నింగ్‌ వాటర్‌, మరుగుదొడ్ల మరమ్మతులు, అవసరమైన చోట మాతా శిశు సంరక్షణ కేంద్రాల(బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌) నిర్మాణం, విద్యుద్ధీకరణ, భవనాలకు రంగులు, ప్రహరీ గోడల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖకు అప్పగించారు. దీంతో అప్పట్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. ఇప్పటి వరకు డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మినహాయించి మిగిలిన పీహెచ్‌సీలలో పనులు ముందుకు సాగడం లేదు. మూడు నెలలుగా అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో విద్యుద్ధీకరణ, మరుగుదొడ్ల మరమ్మతులు, భవనానికి రంగులు వేశారు. శ్లాబ్‌ మరమ్మతులకు గాను పైభాగాన్ని పగులగొట్టి తిరిగి కాంక్రీట్‌ వేయకుండా వదిలేశారు. ఇది జరిగి మూడు నెలలు పూర్తికావచ్చినా పనులు చేపట్టకపోవడంతో వర్షాలు పడితే శ్లాబ్‌పై నీరు నిలిచిపోతోంది. వర్షాలు తగ్గిన  వారం, పది రోజుల వరకు శ్లాబ్‌ నుంచి నీరు కారుతూ గదులు జలమయమవుతున్నాయి. దీంతో పీహెచ్‌సీలో ఇప్పటికే మూడు ఫ్యాన్లు కాలిపోయాయి. అలాగే వ్యాక్సిన్‌ నిల్వ చేసే ఫ్రిజ్‌, ఐఎల్‌ఆర్‌, గదుల్లో నీరు చేరి సామగ్రి కిందకు వెళుతుండటంతో అవి తుప్పు పట్టి పాడవుతున్నాయి. డెలివరీ రూమ్‌ సైతం కారిపోతోంది. వర్షాలు పడితే రోగులు ఎక్కడ జారి పడతారోనని వారి సహాయకులు ఆందోళన చెందుతున్నారు. కంఠారం పీహెచ్‌సీ విషయానికి వస్తే ప్రహరీ నిర్మాణాలకు సామగ్రిని సిద్ధం చేశారు. అక్కడ స్థల వివాదం ఉండడంతో ప్రహరీ నిర్మాణాలు ఎల్‌ షేప్‌లో నిర్మించేందుకు నిర్ణయించి పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. మిగిలిన పనులు అరకొరగానే ఉన్నాయి. 

నిధులు ఉన్నా..

కృష్ణాదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణకు భవన నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ప్రహరీ గోడ పిల్లర్ల్లకే పరిమితమైంది. పీహెచ్‌సీ భవనం కొత్తది కావటంతో చిన్న, చిన్న మరమ్మతులు చేసి రంగులు వేశారు. యు.చీడిపాలెం విషయానికి వస్తే మండలానికి సుదూర ప్రాంతం కావటంతో అక్కడి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిధులు సిద్ధంగా ఉన్నా పనులు చేపట్టేందుకు ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదు. పీహెచ్‌సీల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై రోడ్లు భవనాలశాఖ నర్సీపట్నం డీఈ వేణుగోపాల్‌ను ఫోన్‌లో సంప్రతించగా పనుల పర్యవేక్షణకు అవసరమైన సిబ్బంది కొరత, కొంత కాలం పాటు సిమెంట్‌ లేకపోవడం, నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు జరగడం లేదన్నారు. యు.చీడిపాలెం, రాజేంద్రపాలెం, కృష్ణాదేవీపేట, కంఠారం పీహెచ్‌సీల మరమ్మతులను జూన్‌ నెలాఖరుకు పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-05-16T05:26:34+05:30 IST