అంచనాలు చేరడం కష్టమే

ABN , First Publish Date - 2020-04-01T06:22:49+05:30 IST

ఔషధ ఎగుమతులు, నిల్వలు తదితర అంశాలపై ఔషధ విభా గం తాజాగా భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌)తో చర్చించింది. కోవిడ్‌-19ను అరికట్టడానికి...

అంచనాలు చేరడం కష్టమే

ఔషధ ఎగుమతులు  22 బిలియన్‌ డాలర్లు చేరకపోవచ్చు 

లాక్‌డౌన్‌తో మరింత ఇబ్బంది: ఫార్మాగ్జిల్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఔషధ ఎగుమతులు, నిల్వలు తదితర అంశాలపై ఔషధ విభా గం తాజాగా భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌)తో చర్చించింది. కోవిడ్‌-19ను అరికట్టడానికి అవసరమైన ఔషధాలకు దేశీయంగా కొరత రాకూడదనే ఉద్దేశంతో మార్చి 3న పారాసిటమాల్‌, విటమిన్లు, హార్మోన్లు వంటి 26 ఔషధాల ఎగుమతులపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎ్‌ఫటీ) నిషేఽ దం విధించింది. మార్చి 3 తర్వాత, తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఔషధాల ఎగుమతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని.. దిగుమతి దేశాల నుంచి అనేక ఒత్తిళ్లు వస్తున్నాయని ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత విమానాలు నిలిచిపోవడం, లాజిస్టిక్స్‌, కార్గో సదుపాయాలు లేకపోవడం వంటి పరిణామాలు అనేక సమస్యలను కలిగిస్తున్నాయన్నారు. అమెరికా యూరప్‌ దేశాలు పరిస్థితులు చాలా విషమంగా ఉంది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే జనరిక్‌ ఔషధాల్లో 45 శాతం ఈ దేశాలకే చేస్తున్నామని అన్నారు. ఎగుమతుల కోసం తయారు  చేసిన ఔషధాలను భారత్‌ మార్కెట్లో విక్రయించడానికి పనికి రావని.. అందువల్ల కనీసం ఇప్పటికే ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఔషధాలనైనా ఎగుమతి చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. అయితే.. లాక్‌డౌన్‌తో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారినట్లు చెప్పారు. మన దేశం నుంచి అధికంగా పారాసిటమాల్‌ ఎగుమతి అవుతోంది. మన వద్ద ఈ నిల్వలు బాగానే ఉన్నాయి. ఎగుమతుల కు అనుమతించకపోవడం వల్ల కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని.. అవసరమైనప్పుడు ఔషధాలను సరఫరా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో ఆయా దేశాల్లో భారత ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని ఉదయ్‌ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి చివరి వరకూ 18.75 బిలియన్‌ డాలర్లు ఔషధాలను ఎగుమతి చేశారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. 10.75 శాతం పెరిగాయి.


2019-20 ఆర్థిక సంవత్సరానికి   ఎగుమతులు 22 బిలియన్‌ డాలర్లు (ప్రస్తుత మారకపు విలువ ప్రకారం దాదాపు రూ.1,62,800 కోట్లు) ఉండగలవని అంచనా వేస్తున్నాం. అయితే.. తాజా పరిణామాలతో మార్చిలో దాదాపు ఎగుమతులు నిలిచిపోయాయి. అందువల్ల ఎగుమతులు 22 బిలియన్‌ డాలర్ల స్థాయికి  చేరకపోవచ్చని భావిస్తున్నామని ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. 2019-20 ఏడాదికి ఎగుమతులు ఏ  మేరకు ఉంటాయో ఇప్పుడే చెప్పలేం అయితే.. గత ఏడాది కంటే ఎక్కువగానే ఉంటాయన్నారు. ఎగుమతులపై నిషేధం ప్రభావం వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఎగుమతులపై ఉండే వీలుందని చెప్పారు. 

Updated Date - 2020-04-01T06:22:49+05:30 IST