ఫార్మాసిటీ కాలుష్యంపై కన్నెర్ర

ABN , First Publish Date - 2020-10-28T16:20:08+05:30 IST

ఫార్మా సిటీలోని కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టడానికి..

ఫార్మాసిటీ కాలుష్యంపై కన్నెర్ర

ఎట్టకేలకు స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి

పరవాడ ఊరచెరువు కలుషితం కావడానికి గల కారణాలపై ‘నీరి’ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయం

రసాయన వ్యర్థాలు బయటకు విడిచిపెట్టకుండా చర్యలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఫార్మా సిటీలోని కంపెనీలు విడుదల చేస్తున్న కాలుష్యాన్ని అరికట్టడానికి కాలుష్య నియంత్రణ మండలి ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని...పరవాడ, తానాం గ్రామాల మధ్య గల ఊరచెరువు కలుషితంపై అధ్యయనం చేసే బాధ్యతను నాగపూర్‌కు చెందిన ప్రసిద్ధ సంస్థ నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌(నీరి)కు అప్పగించాలని నిర్ణయించింది. 


ఫార్మా సిటీలో కంపెనీల నుంచి వచ్చే ద్రవ వ్యర్థాలను నేరుగా రాంకీ ఎఫ్లూయింట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు పంపిస్తుంటారు. ఎగుమతి, దిగుమతి, ఇంకా ఉత్పత్తుల తయారీ సమయంలో కంపెనీల ఆవరణలో కొంతమేర రసాయనాలు కింద పడిపోతుంటాయి. వీటిని ఎఫ్లూయింట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు పంపకుండా ఫార్మాసిటీలో మురుగు కాల్వల ద్వారా బయటకు పంపేస్తుంటారు. ప్రతిరోజు కంపెనీలో చెత్తాచెదారం శుభ్రపరిచే సమయంలో వచ్చే నీటిని కూడా ఈ కాల్వల ద్వారానే వదిలేస్తుంటారు. ఇవికాకుండా కంపెనీల ఆవరణలోని వర్షం నీరంతా కాల్వల్లోకి వస్తుంది. ఈ నీరంతా నేరుగా పరవాడ ఊరచెరువులోకి వెళుతుంది. అక్కడ నుంచి కాల్వల ద్వారా పరవాడ పెదచెరువుకు చేరుతుంది. ఫార్మా సిటీ ప్రారంభం నుంచి కంపెనీల ఆవరణ నుంచి మురుగు కాల్వ ద్వారా వచ్చే నీరుతో ఊరచెరువు పూర్తిగా కలుషితమైంది. ఊరచెరువు సమీపంలోకి వెళితే ముక్కు పుటలు అదిరే దుర్గంధం వెదజల్లుతుంది.


ఊరచెరువు పరిసరాల్లో భూగర్భ జలాలు ఎప్పుడో కలుషితమయ్యాయి. దీనిపై పరిసర గ్రామాల ప్రజలు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొందరు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు ీపీసీబీ ఉన్నతాధికారులు స్పందించారు. ఊరచెరువు కలుషితానికి కారణాలను గుర్తించి ప్రక్షాళన బాధ్యత ‘నీరి’కి అప్పగించనున్నారు. అధ్యయనానికి అవసరమైన బడ్జెట్‌ కోసం ఆ సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చిన వెంటనే పీసీబీ అనుమతించనున్నది. కాగా ఈ నెలలో కురిసిన భారీవర్షాలకు ఊరచెరువు నుంచి మిగులు జలాలు పెదచెరువుకు వెళ్లడంతో అక్కడ చేపలు చనిపోయాయి.  


కంపెనీల ఆవరణలోనే ట్యాంకులు

కంపెనీలు ఇష్టానుసారంగా వ్యర్థాలను మురుగు కాల్వలోకి విడుదల చేయకుండా ప్రత్యామ్నాయం కోసం పీసీబీ ప్రతిపాదించింది. వర్షపు నీటి నిల్వకు కంపెనీల ఆవరణలో ట్యాంకులు నిర్మించుకోవాలని ఫార్మాసిటీలో అన్ని కంపెనీలను తాజాగా ఆదేశించింది. కంపెనీ ఆవరణలో రోజువారీ శుభ్రపరిచే నీరు కూడా ఆ ట్యాంకులకు మళ్లించాలని సూచించింది. ట్యాంకులు నిండిన తరువాత వాటిని రాంకీ ఎఫ్లూయింట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫార్మాసిటీ నుంచి మురుగుకాల్వల ద్వారా రసాయన వ్యర్థాల నీరు బయటకు వెళ్లకుండా చెక్‌ పడుతుందని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.

Updated Date - 2020-10-28T16:20:08+05:30 IST