పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ

ABN , First Publish Date - 2021-01-24T06:21:37+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అప్పుడే పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీలు హోరాహోరీ పోటీకి సమాయత్తం అవుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఈసీ
బండారులంక పంచాయతీ వద్ద రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేసిన దృశ్యం

జిల్లాలో పంచాయతీ ఎన్నికల కాక మొదలైంది. పల్లె పోరుకు ఢంకా మోగింది. మొత్తం నాలుగు విడతల్లో  పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరుపుతున్నట్టు వెల్లడించింది. తొలి విడత కింద ఫిబ్రవరి 5న అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 273 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత కింద కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ                డివిజన్ల పరిధిలో పంచాయతీలకు ఫిబ్రవరి 9న, అదే నెల 13న మూడోవిడత కింద రాజమహేంద్రవరం, రామచంద్రపురం  డివిజన్లు, 17న నాలుగో విడతలో రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎస్‌ఈసీ ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1,072 పంచాయతీల పరిధిలోని 11,782 వార్డులకు 12,048 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. 31 పంచాయతీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగడం లేదు. కాగా పంచాయతీ ఎన్నికలకు సహకరించకూడదని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కోడ్‌ అమల్లో ఉండడంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎస్‌ఈసీ పరిధిలో ఉండడంతో మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్‌, ఎస్పీ మాత్రం శనివారం ఎస్‌ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమీక్షకు హాజరుకాలేదు.


 ఫిబ్రవరి 5న తొలి విడత కింద అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఎన్నికలు

 మలివిడత కింద 9న కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పంచాయతీలకు

13న మూడో దశలో రాజమహేంద్రవరం డివిజన్‌, రామచంద్రపురం డివిజన్‌

17న నాలుగో విడత కింద రంపచోడవరం, ఎటపాక డివిజన్‌ పరిధిలో ఎన్నికలు

తొలి విడతకు ఈనెల 25 నుంచి నామినేషన్లు ప్రారంభం

పోలింగ్‌ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు.. 

ఆ వెంటనే ఓట్ల లెక్కింపు..  అదే రోజు ఫలితాల వెల్లడి

అటు మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్ల ముమ్మరం

ఎస్‌ఈసీ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌, ఎస్పీ డుమ్మా

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో అప్పుడే పల్లెల్లో రాజకీయ వేడి రాజుకుంది. పార్టీలు హోరాహోరీ పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఒకపక్క ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర     ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దాని ప్రకారం జిల్లాలో అమ లాపురం రెవెన్యూ డివిజన్‌కు తొలి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. 16 మండలాలు ఉన్న ఈ డివిజన్‌ పరిధిలో 273 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణకు 3,232 పోలిం గ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు. తొలి దశలో జరిగే ఈ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జనవరి 25 నుంచి ప్రారంభం అవుతుంది. నామినేషన్లకు తుది గడువు జనవరి 27, ఉపసంహరణకు తుది గడువు జనవరి 31. అభ్యర్థుల తుది జాబితా అదేరోజు మధ్యాహ్నం మూడు తర్వాత తేలుతుంది. ఫిబ్రవరి 5న పోలింగ్‌ తేదీగా ఎస్‌ఈసీ ప్రకటించింది. ఆరోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ సమయంగా వెల్లడించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇది పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. 

ఆ డివిజన్లలోనూ పక్కా ఏర్పాట్లు...

రెండో విడతలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 20 మండలాల్లో 366 పంచాయతీలుండగా, వీటి పరిధిలో 4,202 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడత కింద వచ్చే ఎన్నికలకు నామినేషన్లను జనవరి 29 నుంచి స్వీకరిస్తారు. నామినేషన్లకు తుది గడువు జనవరి 31. ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 4. అభ్యర్థుల తుది జాబితా అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తేలుతుంది. పోలింగ్‌ ఫిబ్రవరి 9న నిర్వహిస్తారు. తొలి విడత పోలింగ్‌ సమయమే అన్ని దశల ఎన్నికలకు వర్తిస్తాయి. ఫలితాలు కూడా 9నే వెలువడనున్నాయి. మూడో దశలో రాజమహేంద్రవరం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో మొత్తం 247 పంచాయతీలుండగా, 2,880 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  మూడో విడత ఎన్నికలకు నామినేషన్లు ఫిబ్రవరి 2న మొదలుకానున్నాయి. నామినేషన్లకు తుది గడువు ఫిబ్రవరి 4. ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 8. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడి ఉంటుంది. పోలింగ్‌ ఫిబ్రవరి 13న జరగనుంది. ఇక నాలుగో విడత కింద రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలోని 11 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటి పరిధిలో మొత్తం 186 పంచాయతీలుండగా, 1,734 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మరోపక్క జిల్లాలో 61 గ్రామీణ మండలాల పరిధిలో నాలుగు విడతల ఎన్నికలకు 32.52 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఎస్‌ఈసీ పరిధిలోకి రావడంతో..

ప్రకటించిన షెడ్యూలు మేరకు ఎన్నికలు జరపడానికి ఎస్‌ఈసీ ఒకపక్క ఏర్పా ట్లు ముమ్మరం చేస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సహకరించేదిలేదని పట్టుదలగా ఉంది. దీంతో ఎన్నికలపై గందరగోళం నెలకొంది. రాష్ట్రప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవనే సాకుతో జిల్లా కలెక్టర్‌ మురళీధరరెడ్డి సైతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పెద్దగా పర్యవేక్షించడం లేదు. చివరకు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌కు సైతం కలెక్టర్‌, ఎస్పీ హాజరు కాలేదు. కానీ కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ విభాగంలో వీడియోకాన్ఫరెన్స్‌కు మాత్రం ఏర్పాట్లు జరిగాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించమని చెబుతున్నప్పటికీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులంతా ఎస్‌ఈసీ పరిధిలోకి వచ్చినట్టయింది. దీంతో ఎక్కడికక్కడ గ్రామస్థాయిలో అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మర చేస్తున్నారు. శనివారం దాదాపు అన్ని మండలాల్లో పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు ఎక్కడికక్కడ పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన, మౌలిక వసతులు, పోలింగ్‌కు కావలసిన సిబ్బంది తదితర అంశాలపై కింది స్థాయి సిబ్బందితో సమీక్షించారు. బదిలీ అయిన, ఉద్యోగ విరమణ చేసిన స్టేజ్‌ 1, స్టేజ్‌2 సిబ్బంది స్థానే కొత్త వారిని తీసుకోవడం, పోలింగ్‌ బూత్‌ల వారీ సమస్యాత్మక, అతి సమస్యాత్మక పంచాయతీలకు సంబంధించి సమగ్ర సమాచారం సిద్ధం చేస్తున్నారు. ఒకరకంగా ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లలో వేగం పెంచారు. 


Updated Date - 2021-01-24T06:21:37+05:30 IST