పీఎఫ్‌ఐ హింసోన్మాదం!

ABN , First Publish Date - 2022-09-24T07:55:12+05:30 IST

ఎన్‌ఐఏ, ఈడీ అధికారుల వరుస దాడులు, అరెస్టులను నిరసిస్తూ పాపులర్‌ ఫ్రంట్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) హింసోన్మాదానికి దిగింది. పోలీసులు, ప్రయాణికుల వాహనాలే లక్ష్యాలుగా పెద్దఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.

పీఎఫ్‌ఐ హింసోన్మాదం!

అట్టుడికిన కేరళ

ఎన్‌ఐఏ అరెస్టులపై చెలరేగిన ఆందోళనకారులు 

పోలీసులతో బాహాబాహీ

బైకులు, వాహనాల ధ్వంసం

12 గంటలపాటు హర్తాళ్‌.. యథేచ్ఛగా హింస

తప్పుబట్టిన కేరళ హైకోర్టు

కోర్టు ధిక్కరణేనని హెచ్చరిక

తమిళనాడులోనూ ఉద్రిక్తతలు

కర్ణాటకలో మొదలైన పీఎఫ్‌ఐ నిషేధ ప్రక్రియ!


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఎన్‌ఐఏ, ఈడీ అధికారుల వరుస దాడులు, అరెస్టులను నిరసిస్తూ పాపులర్‌ ఫ్రంట్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) హింసోన్మాదానికి దిగింది. పోలీసులు, ప్రయాణికుల వాహనాలే లక్ష్యాలుగా పెద్దఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుతుండగానే ఆగ్రహావేశాలతో ఊగిపోతూ పీఎ్‌ఫఐ కార్యకర్తలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. సాయంత్రం వరకు భారీ నిరసన ప్రదర్శనలతో రాష్టాన్ని అట్టుడికించారు. దేశవ్యాప్తంగా ఉన్న పీఎ్‌ఫఐ కార్యాలయాలు, శిక్షణ సంస్థలపై గురువారం ఎన్‌ఐఏ, ఈడీ దాడులు జరిపి 100మందికిపై ఆ సంస్థ కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఇందులో సింహభాగం దాడులూ, అరెస్టులూ కేరళలోనే కొనసాగాయి. దీనికి వ్యతిరేకంగా పీఎ్‌ఫఐ కేరళ శాఖ శుక్రవారం హార్తాళ్లకు (ధర్నాలు) పిలుపునిచ్చింది. దాడుల భయంతో షాపింగ్‌మాల్స్‌, సినిమా హాళ్లు, ప్రైవేటు వాణిజ్య కేంద్రాలు, పౌర మార్కెట్లు చాలావరకు ముందే మూతబడ్డాయి. మరికొన్నింటిని ఆందోళనకారులు బలవంతంగా మూయించారు. రోడ్డు మధ్యలో టైర్లు వేసి కాల్చి... దారులను దిగ్బంధించారు. ప్రయాణికుల వాహనాలు, ప్రభుత్వ బస్సులపై రాళ్లవర్షం కురిపించారు. విధి నిర్వహణలోని పోలీసులను ఎక్కడికక్కడ పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో కొల్లాంలో ఇద్దరు పోలీసు అధికారులు పీఎ్‌ఫఐ శ్రేణుల దాడిలో గాయపడ్డారు. ఇదిలాఉండగా పీఎ్‌ఫఐ హార్తాళ్‌ పిలుపును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. దీన్ని కోర్టు ధిక్కరణగానే పరిగణిస్తామని జస్టిస్‌ జయశంకరన్‌ నంబియార్‌ హెచ్చరించారు. 


కార్యకర్తలకు దేహశుద్ధి

కేరళలోని కన్నూరు ప్రాంతంలో బలవంతంగా దుకాణాలు మూయించడానికి ప్రయత్నించిన పీఎ్‌ఫఐ కార్యకర్తలపై స్థానికులు తిరగబడ్డారు. వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇతర రాష్ట్రాల్లోనూ...

మిళనాడులో పీఎ్‌ఫఐ కార్యకర్తలు చెలరేగిపోయారు. పొలాచ్చిలో బీజేపీ, హిందూ మున్నడి నాయకులకు చెందిన రెండు కార్లు, రెండు ఆటోలను ధ్వంసం చేశారు. ఈ దుశ్చర్య ఎవరు చేశారనేది పోలీసులు వెల్లడించకపోయినా... పీఎ్‌ఫఐ జరిపిన దాడిగానే దీనిని భావిస్తున్నారు. ఎన్‌ఐఏ సోదాలు జరిపి కోయంబత్తూరులో గురువారం ఆ సంస్థకు చెందిన 11 మందిని అరెస్టు చేసి ముగ్గురిని ఢిల్లీకి తీసుకువెళ్లారు.  పీఎ్‌ఫఐ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు మినారుల్‌ షేక్‌ను ఢిల్లీలో అసోం పోలీసులు అరెస్టు చేశారు. 

నిషేధం దిశగా...

పీఎ్‌ఫఐ కార్యకలాపాలను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ రాష్ట్ర హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిషేధ ప్రక్రియ ఇప్పటికే మొదలయిందని ఆయన తెలిపారు. 18 ప్రాంతాల్లో సోదాలు జరిపి 15 మందిని గురువారం ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసినట్టు మంత్రి వెల్లడించారు. గతవారం పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులకు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎ్‌స)తో సంబంధాలు ఉన్నాయని శివమొగా ఎస్పీ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.


బీజేపీ నేతల నివాసాలపై పెట్రోల్‌ బాంబుల దాడి

చెన్నై, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు పర్యటనలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, ఆర్‌ఎ్‌సఎస్‌, హిందూ మున్నని నేతల నివాసాలు, దుకాణాలు, కార్యాలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు. కోయంబత్తూరు, పొల్లాచ్చి, ఈరోడ్‌ నగరాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు ఈ దాడులు జరిగాయి. ఈ కారణంగా కోయంబత్తూరు, ఈరోడ్‌ జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత గురువారం రాత్రి 8 గంటలకు కోయంబత్తూరులోని బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులు విసిరి పారిపోయారు. ఇదే తరహాలో కోయంబత్తూరు, పొల్లాచ్చి, మేట్టుపాళయ, ఈరోడ్‌ల్లో నేతల నివాసాలు, దుకాణాలపై వరుస బాంబు దాడులు జరిగాయి.

Updated Date - 2022-09-24T07:55:12+05:30 IST