పెట్రోల్‌ ఎట్‌ రూ.99.74

ABN , First Publish Date - 2021-06-14T05:30:00+05:30 IST

నగరంలో పెట్రోల్‌ ధర సెంచరీకి చేరువగా వచ్చింది. సోమవారం రాత్రి వరకు రూ.99.74 ధర పలికింది. గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ క్షణమైనా సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తున్నాయి.

పెట్రోల్‌ ఎట్‌ రూ.99.74

ఏ క్షణమైనా సెంచరీ కొట్టే అవకాశం
పెరుగుతున్న ధరలతో సామాన్యుల బెంబేలు
నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం
ఉమ్మడి జిల్లాలో నెలకు రూ.33కోట్ల అదనపు భారం

హన్మకొండ, ఆంధ్రజ్యోతి
నగరంలో పెట్రోల్‌ ధర సెంచరీకి చేరువగా వచ్చింది.  సోమవారం రాత్రి వరకు రూ.99.74 ధర పలికింది.  గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ క్షణమైనా సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తున్నాయి.  కరోనా కష్ట కాలంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని సామాన్యులు, వాహనదారులు అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియడం లేదు. ఈ రోజు ఉన్న ధర మర్నాడు ఉండడం లేదు. ఒక్కోసారి ఒకేరోజు రెండుసార్లు పెరుగుతున్నాయి. ఉదయం ఒక ధర ఉంటే సాయంత్రానికి మరో ధర ఉంటోంది. ఆరు నెలలుగా ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది వరకు పక్షం రోజులకు ఒకసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏ రోజుకారోజు మారుతోంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలు వ్యాట్‌ కారణంగా ఇంధన ధరలను ఎప్పటికప్పుడు పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరగడమే ఽకారణమని  ఆయిఎల్‌ కంపెనీలు చెబుతున్నాయి.

నెలకు రూ.33కోట్ల భారం
పెరిగిన ఇంధన ధరలతో వాహనదారులపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజుకు రూ.1.08కోట్లు, నెలకు రూ.33.48కోట్ల అదనపు భారం పడుతోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 6లక్షల లీటర్ల డీజిల్‌, 3లక్షల డీలర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నట్లు అంచనా. జిల్లాలో నెలకు సగటున 186లక్షల లీటర్ల డీజిల్‌, 93లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగమవుతుంది. జిల్లాలో 250 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వివిధ రకాల వాహనాలు సుమారు 2,494,794 వరకు ఉన్నాయి. వీటిలో 21,44,178 ద్విచక్రవాహనాలు, 1,61,436 కార్లు, 1,19,370 ఆటోలు, 69,264 సరుకు రవాణా వాహనాలు, 546 కాంట్రాక్టు గ్యారెజ్‌ బస్సులు ఉన్నాయి. ట్రాక్టర్లు అదనం.

వాహనదారుల బెంబేలు
ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ఆటోలు, క్యాబ్‌లు, రవాణా వాహనాలు నడుపుకొని జీవించేవారు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా చార్జీలను పెంచితే వినియోగదారులు ఒప్పుకోవడం లేదు. దీంతో వారి రోజువారీ గిరాకీ తగ్గిపోయి ఆదాయానికి గండిపడుతోంది. కరోనా సమయంలో అసలే గిరాకీలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. వచ్చిన ఆదాయం సగానికి సగం ఇంధనానికే ఖర్చవుతోంది. మిగిలిన కొద్ది మొత్తంతో కుటుంబ పోషణ ఎలా అని వాపోతున్నారు. వాహన రుణాలు చెల్లించలేకపోతున్నారు. జీవనోపాధి కోసం స్కూటర్లు, లేదా బైక్‌లపై వెళ్లేవారు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు సమీపంలో చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యావసరాలపై ప్రభావం
ఇంధన ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై తీవ్రంగా పడుతోంది. వాటి ధరలు గణనీయంగా పెరిగి సామాన్యుడిని ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నాయి. గతేడాది నుంచి ఇంధన ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఊహించని స్థాయికి కొండెక్కాయి. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. టోల్‌ చార్జీలు మొదలు కిలోమీటరు ప్రయాణానికి చెల్లించే సగటు ధరలు మూడు నెలల వ్యవధిలో నాలుగుసార్లు మారాయి. ఇంధన ధరల పెరుగుదలతో మార్కెట్‌కు తరలిస్తున్న నిత్యావసర సరుకులు క్రమంగా తగ్గుతున్నాయి. కొరత ఏర్పడి సహజంగానే వాటి రేట్లు పెరుగుతున్నాయి. వాస్తవానికి  ఇంధన ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల్లో కొన్ని ప్రత్యేక వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. ఏడాదిగా నిరంతరం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రతీ వస్తువుపై సగటు ధరను వ్యాపారులు పెంచుతున్నారు. గత సంవత్సరం జనవరిలో రూ.95 ఉన్న కిలో కందిపప్పు ధర రూ.125నుంచి రూ.140 పెరిగింది. రూ.85 విక్రయించే వంట నూనె రూ.142 నుంచి రూ 170 వరకు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో డీజిల్‌ ధర లీటరు రూ.67 ఉన్నప్పుడు ఒక కార్గో వాహనం చార్జీ కిలోమీటరుకు రూ.19 తీసుకునేవారు. కానీ ఇప్పుడు లీటర్‌ రూ.99 దాటడంతో ప్రతీ కిలోమీటరుకు రూ.27 నుంచి రూ.30 డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-06-14T05:30:00+05:30 IST