కొడాలి నానికి 2 లీటర్ల పెట్రోల్‌ పంపండి: బీటెక్‌ రవి

ABN , First Publish Date - 2022-01-22T23:50:11+05:30 IST

గుడివాడలో క్యాసినో వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌ హాల్‌లో సంక్రాంతి

కొడాలి నానికి 2 లీటర్ల పెట్రోల్‌ పంపండి: బీటెక్‌ రవి

అమరావతి: గుడివాడలో క్యాసినో వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కొడాలి నానికి  చెందిన కే కన్వెన్షన్‌ హాల్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో, ఇతర జూదక్రీడలు నిర్వహించిన విషయం విదితమే. ఈ ఆరోపణలను కొడాలి నాని ఖండించారు. ‘నా రెండున్నర ఎకరాల కల్యాణ మండపంలో క్యాసినో, జూదం నిర్వహించినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా.’ ఇదీ కొడాలి నాని విసిరిన సవాల్‌. ఇది విని... రాష్ట్ర ప్రజలంతా విస్తుపోయారు. గుడివాడ వాసులేమో ‘వామ్మో... మా మంత్రి నోట ఇంత పచ్చి అబద్ధమా!?’ అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడలో ‘గోవా కేసినో’లను దించడం నిజం. అందుకు మంత్రికి చెందిన కె-కన్వెన్షన్‌ హాలు వేదిక కావడం నిజం! దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 


కొడాలి నాని సవాల్‌కు టీడీపీ నేత మారెడ్డి రవీంద్రనాధ్‌ రెడ్డి (బీటెక్‌ రవి) రియాక్ట్ అయ్యారు. గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేశారో లేదో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ క్యాసినో తరహా జూదం జరిగిందని తేలితే, మంత్రి కొడాలి నానికి రెండు లీటర్ల పెట్రోల్‌ పంపించాలని ట్వీట్‌ చేశారు. 


గుడివాడలో క్యాసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారు. పోలీసుల తీరు కూడా కలిసిరావడంతో చెలరేగిపోయారు. నిజ నిర్ధారణ కోసం శుక్రవారం గుడివాడ వచ్చిన టీడీపీ నాయకులే లక్ష్యంగా దౌర్జన్యకాండకు మంత్రి కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకులు తెగబడ్డారు. గుడివాడను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులు చేస్తూ.. రాళ్ల వర్షం కురిపించారు.

Updated Date - 2022-01-22T23:50:11+05:30 IST