రాష్ట్రమూ పెట్రోపన్నులు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-05-24T08:30:23+05:30 IST

కేంద్రం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

రాష్ట్రమూ పెట్రోపన్నులు తగ్గించాలి

బాదుడులో మొదటి స్థానంలో ఆంధ్ర

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఉపశమనం: చంద్రబాబు

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): కేంద్రం మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. ‘‘పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల నుంచి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అభినందనీయం. తమ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు తగ్గించుకొని ప్రజలకు మేలు చేయాలని కేంద్రం కోరడం ప్రశంసనీయం. టీడీపీ హయాంలో అభివృద్ధిలో దేశంలో మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు పెట్రో బాదుడులో దేశంలో మొదటి స్థానంలో ఉంది. పెట్రో ధరల బాదుడు సామాన్యుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువుల ధరల భారానికి ఇది కారణంగా మారుతోంది. ప్రజల నడుం కుంగిపోతున్నా... ప్రతిపక్షాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఉపశమనం కలిగించడానికి ముందుకు రావడం లేదు. పోయిన ఏడాది చివర్లో దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సొంత పన్నులు తగ్గించుకొని ప్రజలకు కొంత భారం తగ్గించాయి. కాని ఏపీలో ఇప్పటికీ పైసా కూడా తగ్గించకపోగా అదనపు పన్నులతో మరింత బాదుతున్నారు. ఇప్పుడు కేంద్రం తరువాత... అదే బాటలో తమిళనాడు, రాజస్థాన్‌, ఒడిశా పన్నులు తగ్గించాయి. మరి ఏపీ ప్రజలు ఏం పాపం చేశారు? వైసీపీ ప్రభుత్వం వెంటనే తన పన్నులు తగ్గించుకొని పెట్రో ధరల బాదుడు నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించాలి’’ అని చంద్రబాబు కోరారు.

Updated Date - 2022-05-24T08:30:23+05:30 IST