శ్రీలంకలో రెండు వారాలు పెట్రోల్‌ బంద్‌!

ABN , First Publish Date - 2022-06-29T09:06:23+05:30 IST

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు చమురు సమస్య భారీ తలనొప్పిగా మారింది.

శ్రీలంకలో రెండు వారాలు పెట్రోల్‌ బంద్‌!

అడుగంటిన చమురు నిల్వలు

దిగుమతికీ నిధులు లేని దుస్థితి

కొలంబో, జూన్‌ 28: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు చమురు సమస్య భారీ తలనొప్పిగా మారింది. తాజాగా దేశంలో చమురు నిల్వలు అడుగంటాయని, అత్యవసరాలకు మాత్రమే కొద్దిపాటి నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి రెండు వారాల పాటు పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. అయితే.. వైద్య రంగం సహా అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధన మీడియాకు వివరించారు. చమురు సరఫరాలో అంతరాయంపై మన్నించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూలై 10 తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని తెలిపారు. ఇదిలావుంటే, గత వారమే చమురు నిల్వలు నిండుకుంటున్నాయని గ్రహించిన ప్రభుత్వం.. స్కూళ్లను మూసివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించింది. పోనీ.. చమురును దిగుమతి చేసుకుందామని భావించినా.. సర్కారు దగ్గర విదేశీ మారక ద్రవ్యం లేకుండా పోయింది. దీంతో చమురు సరఫరాను రెండు వారాల పాటు నిలిపి వేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలపైనా ప్రభావం పడుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పెట్రోలు, డీజిల్‌ విక్రయాలకు రేషన్‌ మాదిరిగా టోకెన్‌ విధానాన్ని ప్రవేశ పెడతామని ప్రకటించిన 24 గంటల్లోనే సరఫరాను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో లంక ప్రజలు ఒక్కపూట అన్నం తినేందుకు కూడా ఆహార పదార్థాలు లభించని దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

Updated Date - 2022-06-29T09:06:23+05:30 IST