పెట్రోల్‌కు పరిమితి!?

ABN , First Publish Date - 2022-05-20T06:27:40+05:30 IST

చమురు సంక్షోభం పొంచి ఉంది.

పెట్రోల్‌కు పరిమితి!?

విక్రయాలపై ఆంక్షలు

క్రూడాయిల్‌ ధరలు భారీగా పెరగడంతో లీటర్‌కు రూ.30 నష్టపోతున్నామంటున్న కంపెనీలు

బంకులకు 60 శాతమే సరఫరా చేస్తున్న బీపీసీఎల్‌

ఆ మేరకు వినియోగదారులకు కోత

వినియోగదారులకు ఇక ఫుల్‌ ట్యాంక్‌ కష్టమే

నగదు చెల్లిస్తేనే ట్యాంకర్‌ పంపుతున్న హెచ్‌పీసీఎల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


చమురు సంక్షోభం పొంచి ఉంది. పెట్రోల్‌, డీజిల్‌కు కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందులా పెట్రోల్‌ బంకుకు వెళ్లి ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించుకుందామంటే  ఇకపై కుదరదు. పరిమితంగా మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ లభించనుంది. క్రూడాయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్‌ సుమారుగా రూ.120, డీజిల్‌ రూ.106 చొప్పున అమ్ముతున్నారు. ఈ రేటుకు బంకులకు సరఫరా చేయడం వల్ల లీటరుకు రూ.30 చొప్పున నష్టం వస్తున్నదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ప్రభుత్వ రంగంలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ విశాఖపట్నం కేంద్రంగా పెట్రో ఉత్పత్తులు విక్రయిస్తున్నాయి. 


పరిస్థితి మారింది

మొన్నటి వరకు పరిస్థితి ఒకలా ఉండేది. బంకుల యజమానులు డబ్బులు ఇవ్వకపోయినా ట్యాంకర్‌ కావాలని ఫోన్‌ చేస్తే కంపెనీలు వెంటనే పంపించేవి. గత రెండు నెలల నుంచి ఆ విధానానికి స్వస్తి చెప్పాయి. ‘క్యాష్‌ అండ్‌ క్యారీ’ విధానం అమలులోకి తీసుకువచ్చాయి. ట్యాంకర్‌ కావాలంటే...దానికి సరిపడా మొత్తం బ్యాంకులో ఆర్‌టీజీఎస్‌ ద్వారా జమ చేశాకే పంపుతున్నాయి. హెచ్‌పీసీఎల్‌ అయితే డబ్బులు ఇవ్వని వారికి అసలు ట్యాంకర్లనే పంపడం లేదు.  


బీపీసీఎల్‌ ఆంక్షలు

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) తాజాగా పెట్రోల్‌ బంకులన్నింటికీ ఆంక్షలు పెట్టింది. ఇప్పటివరకూ ప్రతి నెలా ఎంతైతే పెట్రోల్‌, డీజిల్‌ తీసుకుంటున్నారో అందులో ఇకపై 60 శాతం మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే ఉదాహరణకు ఒక బంకు రోజుకు 5 వేల లీటర్ల చొప్పున నెలకు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్‌ తీసుకుంటే...ఇప్పుడు అందులో 60 శాతం అంటే 90 వేల లీటర్లు మాత్రమే ఇస్తారు. 60 వేల లీటర్ల కోత విధిస్తారు. సాధారణంగా పెట్రోల్‌ బంకులు ఎంత డిమాండ్‌ ఉంటే అంతే కొనుగోలు చేస్తాయి. ఎక్కువ కొని నిల్వ చేసుకోవడానికి అందరి వద్ద తగిన సౌకర్యాలు ఉండవు. ఇప్పుడు డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడం వల్ల బంకుకు వచ్చే వినియోగదారులకు ఆ మేరకు కోత పడనుంది. కారుకు 30 లీటర్ల డీజిలో, పెట్రోలో కొట్టమంటే...అంత ఇవ్వలేమని, 20 లీటర్లే ఇస్తామని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన వాహనాలకు వచ్చినట్టు పెట్రోల్‌ పోసినా మధ్యాహ్నానికే అంతా అయిపోయి బంకు మూసేయాల్సి ఉంటుంది. దానివల్ల బంకుకు చెడ్డ పేరు వస్తుంది. ఆ భయంతో వచ్చిన వారందరికీ ఎంతో కొంత సర్దుబాటు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. బీపీసీఎల్‌ బంకులన్నీ గురువారం నుంచి ఇదే విధానం అనుసరిస్తున్నాయి. ఇక ఒకరిని చూసి మరొకరు అన్నట్టు...ఇతర కంపెనీలు హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌ కూడా అనుసరించనున్నాయి.


5:15 ట్యాంకర్‌కు రూ.22 లక్షలు

పెట్రోల్‌ బంకు యజమానులకు కోడ్‌ లాంగ్వేజ్‌ ఉంది. 5:15 ట్యాంకర్‌ అంటే 5 వేల లీటర్ల పెట్రోల్‌, 15 వేల లీటర్ల డీజిల్‌తో ఒక ట్యాంకరు పంపిస్తారు. దాని ఖరీదు ప్రస్తుతం సుమారు రూ.22 లక్షలు. దీనిని 20 కేఎల్‌ (కిలోలీటర్లు) అంటారు. అలాగే డిమాండ్‌ తక్కువగా ఉన్న బంకులు 12 కేఎల్‌, బాగా అమ్మకాలు జరిగే బంకులు 24 కేఎల్‌ ట్యాంకులు తెప్పించుకుంటాయి. ఆ మేరకు రేట్లు ఉంటాయి. విశాఖపట్నం జిల్లాలో పెందుర్తి, గాజువాక, మధురవాడలను కలుపుకొంటే మొత్తం 72 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలను కూడా కలుపుకొంటే మరో 70 బంకులు పెరుగుతాయి. సగటున ఒక్కో బంకు రోజుకు పెట్రోల్‌/డీజిల్‌ కలిపి ఐదు వేల లీటర్ల వరకు విక్రయిస్తాయి. ఇకపై వారికి మూడు వేల లీటర్లు మాత్రమే సరఫరా జరగనుంది. ఆ మేరకే వినియోగదారులకు అమ్మకాలు జరుగుతాయి. 


రేటు పెంచే అవకాశాల్లేకే...

ఇప్పుడున్న ధరలే అధికం. ఇతర ప్రాంతాల కంటే ఇక్కడే ఎక్కువ రేట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ రేటు పెరిగినా ఇక్కడ ఆ మేరకు రేటు పెంచడానికి కేంద్రం భయపడుతోంది. లీటరుకు రూ.30 నష్టం వస్తున్నదని చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రేటు పెంచకుండా వీలైనంత వరకు సరఫరా, ఆ మేరకు నష్టాలు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఇలా వ్యవహరిస్తున్నాయని, అందులో తప్పు కనిపించడం లేదని బంకు యజమానులు అంటున్నారు.


విచ్చలవిడి వినియోగం మంచిది కాదు

నారాయణరెడ్డి, బంకుల సంఘం యజమాని

పెట్రోల్‌, డీజిల్‌ ప్రకృతి నుంచి లభించేవి. పరిమిత వనరులు. వాటిని ఆ విధంగానే వాడుకోవాలి. విచ్చలవిడి వినియోగం మంచిది కాదు. లాంగ్‌ డ్రైవ్‌లని, అవసరం లేకున్నా వాహనాల్లో తిరుగుతూ పెట్రోల్‌, డీజిల్‌ వృథా చేయడం తగదు. ఇప్పటికిప్పుడు కొరత ఏమీ లేదు. పత్రికల్లో వార్తలు చూసి, అంతా బంకుల ముందు క్యూ కట్టేసి, అవసరం లేకపోయినా ఫుల్‌ ట్యాంక్‌, ఆఫ్‌ ట్యాంక్‌లు కొట్టించవద్దు. అవసరమైనంత వాడుకుంటే చాలు.



Updated Date - 2022-05-20T06:27:40+05:30 IST